బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావదే సుమదీ..! అన్నట్లుగా ఫుల్ మెజారిటీ ఉండి.. వరుసగా మూడోసారి అధికారాన్ని ఛేజిక్కించుకుని.. తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం.. జెన్ జీ పిల్లలకు తలవంచింది. దేశంలో పెద్ద పెద్ద రాజకీయ పార్టీలకు సాధ్యం కానిది.. అందరూ తక్కువ అంచనా వేసినా ఆ పిల్లబచ్చాగాళ్ల వల్ల అయ్యింది. ఏం ప్రశ్నిస్తే ఏం ముద్ర పడుతుందో.. అని భయపడే రోజుల్లో.. నిర్భయంగా.. లాఠీలకు, రబ్బర్ బుల్లెట్ తూఠాలకు వెరవకుండా.. 37 రోజుల సుదీర్ఘ ఆందోళనతో కేంద్రం మెడలు వంచి యువశక్తి అంటే ఏంటో చూపించారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో బాధ్యుడిగా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించడమే కాకుండా.. అన్ని డిమాండ్లను ఒప్పుకునేలా చేశారు.
భారత రాజకీయాల దశ–దిశను మార్చేలా నాయకులకు, పార్టీలకు మార్గదర్శకాన్ని చూపించారు. ఇంత పెద్ద ఉద్యమం రథాన్ని నడిపించడంలో నాలుగు చక్రాల్లాగా ముందుండి.. నాలుగు స్తంభాలుగా నిలిస్తే.. వారి గెలుపు కోసం ప్రాణాలను పణంగా పెట్టి దీక్షకు దిగిన మరో వ్యక్తి గురించి.. వారి బ్యాగ్రౌండ్.. కమిట్మెంట్ గురించి తెలుసుకుందాం.
అభిజీత్ దీప్కే
కాక్రోచ్ జనతా పార్టీ అభిజీత్ దీప్కేతో మొదలైంది అనటంలో ఆశ్చర్యం లేదు. 2026 మే లో సోషల్ మీడియా వేదికగా సెటైరికల్ గా సీజేపీకి జీవం పోశారు. దేశ యువతను బొద్దింకలు అని పిలిచిన చీఫ్ జస్టిస్ సూర్యకాంత్.. వ్యాఖ్యలకు కౌంటర్ గా వ్యంగ్యంగా ఈ సోషల్ మీడియా అకౌంట్ ను స్టార్ట్ చేశారు. యువత యొక్క, యువత చేత, యువత కోసం ఒక రాజకీయ వేదిక. లౌకిక - సామ్యవాద - ప్రజాస్వామ్య - సోమరి.. అనే ట్యాగ్ లైన్ తో మొదలైన ఆన్ లైన్ పార్టీ .. ఆఫ్ లైన్ లో చూపించిన తెగువ.. దాని ఫలితం ఏంటో స్పష్టంగా చూశాం.
ఈ అకౌంట్ వెనుక దీప్కేనే సూత్రధారి. ప్రారంభించిన అతి కొద్ది కాలంలో ఆన్ లైన్ లో అపారమైన మద్దతును లభించింది. అతి తక్కువ సమయంలో బీజేపీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లను దాటి పోయి సంచలనం సృష్టించింది.
సీజేపీ స్థాపించక ముందు.. విద్యార్థులకు ఆదర్శంగా మారకముందు, డిజిటల్ పొలిటికల్ క్యాంపెయిన్ చేస్తూ ఉండేవాడు. పూణే నుంచి జర్నలిజంలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని, బోస్టన్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ రిలేషన్స్‌లో రెండేళ్ల మాస్టర్స్ డిగ్రీని పొందారు.
చాలా రోజుల పాటు ఆన్‌లైన్‌లో విద్యార్థులకు మద్దతుగా గళం విప్పిన తర్వాత, దీప్కే గత నెలలో భారతదేశానికి తిరిగి వచ్చి జంతర్ మంతర్ దగ్గర మొదటి సీజేపీ నిరసనకు నాయకత్వం వహించారు. నీట్-యూజీ పేపర్ లీక్, ఇతర పరీక్షా అవకతవకలపై జవాబుదారీతనం కోరుతూ పూర్తి స్థాయి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎన్నో వక్రీకరణలు, ఎన్నో విమర్శలు, మరెన్నో అనుమానాల మధ్య ఉద్యమాన్ని సమర్ధవంతంగా నడిపించడంలో కీలక పాత్ర పోషించారు.
సౌరవ్ దాస్ , అశుతోష్ రాంకా
సీజేపీ ఉద్యమానికి స్పందన పెరిగే కొద్దీ.. ఆ సంస్థ విస్తరణ మొదలైంది. అందులో భాగంగా ఆ సంస్థ ప్రతినిధుల పేర్లను ప్రకటించింది . వారిలో సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా దీప్కే తర్వాత కీలకంగా నిలిచారు. నిరసనల సమయంలో వీరిద్దరూ అతిపెద్ద డ్రైవింగ్ ఫోర్స్ గా ముందు నిలిచారు. అంతేకాకుండా, ప్రధాన్ రాజీనామాకు ముందు ప్రభుత్వంతో చర్చలకు కూడా నాయకత్వం వహించారు.
సౌరవ్ దాస్ ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ( పరిశోధనాత్మక జర్నలిస్ట్). లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, దాస్ జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్‌లో పట్టభద్రుడు. 2020లో తన వృత్తిపరమైన రచనా జీవితాన్ని ప్రారంభించాడు. దేశం ఎన్నికల నిరంకుశత్వంలోకి జారిపోవడానికి న్యాయవ్యవస్థ ఎలా దోహదపడిందో అన్వేషించే.. ఒక పుస్తకంపై కూడా రాస్తున్నట్లు బయోలో ఉంది.
మరోవైపు అశుతోష్ రాంకా ఐఐటి కాన్పూర్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పూర్వ విద్యార్థి. లండన్‌లోని మెకిన్సీ & కంపెనీకి కన్సల్టెంట్‌గా పనిచేశారు. ప్రముఖ ప్రజా ఉద్యమాలతో ఆయనకు ఉన్న అనుబంధం కొత్తేమీ కాదు. 2025లో ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత, జైపూర్‌లో పర్యావరణ, విద్యా, యువజన సమస్యలపై దృష్టి సారించిన అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు.
సోనమ్ వాంగ్‌చుక్
బొద్దింకల ఉద్యమానికి ఊపునిచ్చి, ఒక పూర్తి స్థాయి ఉద్యమంగా మారటంలో కీలక పాత్ర పోషించిన మరో కీలక వ్యక్తి వాతావరణ కార్యకర్త, విద్యావేత్త అయిన సోనమ్ వాంగ్‌చుక్. ఆయన ప్రారంభించిన నిరవధిక నిరాహార దీక్షే సీజేపీ గెలుపుకు నాంది పలికిందని చెప్పవచ్చు. జంతర్ మంతర్ దగ్గర వందలాది మంది గుమిగూడగా, పలువురు ప్రముఖ ప్రతిపక్ష నాయకులు, సెలబ్రిటీలు కూడా ఇందులో పాల్గొన్నారు.
3 ఇడియట్స్ సినిమాలోని ఫున్సుఖ్ వాంగ్డుగా ప్రసిద్ధి చెందిన వాంగ్‌చుక్, లడఖ్ విద్యా స్వరూపాన్ని మార్చిన ఘనతను పొందారు. ఆయన లేహ్‌కు సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐదు కుటుంబాలు గల ఒక చిన్న గ్రామంలో పుట్టి పెరిగి, ఆ తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న తమ డిమాండ్‌కు ప్రభుత్వం అంగీకరించి, జోక్యం చేసుకోవాలని వేలాది మంది విజ్ఞప్తి చేయడంతో, ఆయన సీజేపీ ఉద్యమానికి అతిపెద్ద ముఖంగా మారారు. ప్రజల విజ్ఞప్తుల మధ్య, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌ల సమక్షంలో గురుగ్రామ్‌లోని మెదాంత ఆసుపత్రిలో 26 రోజుల తర్వాత సోనమ్ వాంగ్‌చుక్ తన నిరాహార దీక్షను విరమించారు .
నేహా బోరా
జంతర్ మంతర్ దగ్గర నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన వారిలో వాంగ్‌చుక్ ఒక్కరే లేరు. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) కు చెందిన ముగ్గురు విద్యార్థులు కూడా అన్నపానీయాలు మానేసి దీక్షలో కూర్చున్నారు. వారే.. నేహా బోరా, మనీష్ కుమార్, ఆమీన్ అమిటోజ్. వాంగ్‌చుక్ దీక్ష కంటే ముందే దీక్ష చేపట్టి కాక్రోచ్ ల ఉద్యమానికి ఊపిరిపోశారు.
నేహా బోరా జేఎన్‌యూలో పీహెచ్‌డీ స్కాలర్. జూలై 19న, సోనమ్ వాంగ్‌చుక్‌ను పోలీసులు జంతర్ మంతర్ నుంచి బలవంతంగా అదుపులోకి తీసుకుని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించినట్లు ఆమె ఆరోపించారు. మీరందరూ జంతర్ మంతర్‌కు రావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఉద్యమం ఇంకా ముగియలేదు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఇది ముగియదు. దయచేసి ఈ మెసేజ్అందరికీ చేరేలా చూడండి,అని ఆమె ఇచ్చిన పిలుపుకు యువత నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.
సీజేపీ విజయ సాధనలో కీలక డిమాండ్లు..
నీట్ పేపర్ లీక్ తో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు సాధ్యమైనంత పరిహారం.
కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు నమోదు చేసిన అన్ని ఎఫ్ఐఆర్‌లు ఉపసంహరించుకోవాలి.
భవిష్యత్తులో ఈ నిరసనలలో పాల్గొన్న ఎవరిపైనా ఎటువంటి చర్యలు ఉండకూడదు
