మేడారం మహా జాతరలో తొలి ఘట్టం ఆవిష్కృతమైంది. కన్నెపల్లిలో కొలువైన సారలమ్మ బుధవారం రాత్రి భక్తుల జయజయ ధ్వానాలు, శివసత్తుల పూనకాల మధ్య మేడారానికి చేరుకుంది. కోయ పూజారులు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భారీ భద్రత నడుమ కాలినడకన మేడారానికి తీసుకొచ్చారు.
మార్గమధ్యలో జంపన్న గద్దె వద్దకు తీసుకెళ్లి.. అక్కడి నుంచి నేరుగా సారలమ్మ గద్దెకు చేరుకొని అక్కడ ప్రతిష్ఠించారు. సారలమ్మ వచ్చే దారికి ఇరువైపులా భక్తులు నిల్చొని అమ్మవారికి ఘన స్వాగతం పలికారు. మహిళలు వరాలు పడుతూ మొక్కులు చెల్లించుకున్నారు.
అలాగే పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజులు సైతం గద్దెలపైకి చేరుకున్నారు. ఇయ్యాల రాత్రి సమ్మక్క కొలువుదీరనుండగా దర్శనం కోసం లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో మేడారం జనసంద్రంగా మారింది.
