
- సెంట్రల్ టీమ్ ఎదుట ముంపు ప్రాంతాల్లోని జనం ఆవేదన
- రెండో రోజు ఎల్బీనగర్,ఖైరతాబాద్ జోన్లలో పర్యటన
- హైదరాబాద్ లో ఈ పరిస్థితి రావడానికి కారణాలేంటి?
- చెరువులు, నాలాలను కబ్జా చేస్తుంటే ఏం చేస్తున్నరు?
- రాష్ట్ర అధికారులను వివరాలు కోరిన కేంద్ర బృందం
హైదరాబాద్, వెలుగు: చెరువులు, నాలాలను కబ్జా చేసి ఎక్కడికక్కడ అక్రమంగా నిర్మాణాలు చేపడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ఇరిగేషన్, జీహెచ్ఎంసీ అధికారులను సెంట్రల్ టీమ్ ప్రశ్నించింది. హైదరాబాద్‌లో ఈ పరిస్థితి రావడానికి గల కారణాలపై పూర్తి వివరాలివ్వాలని అధికారులను ఆదేశించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం రెండోరోజు కేంద్ర బృందం పర్యటించింది. కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ ప్రవీణ్ వశిష్ఠ నేతృత్వంలోని టీమ్ ఎల్బీనగర్, ఖైరతాబాద్ జోన్లలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించింది. ఆయా ప్రాంతాల్లో సెంట్రల్టీమ్ సభ్యులు నేరుగా జనంతో మాట్లాడి వివరాలు తీసుకున్నారు. కాలనీల్లో బతకలేని పరిస్థితి ఉందని, ఇండ్లు, రోడ్లు బురదనీటితో నిండి పది రోజులైనా ఆఫీసర్లెవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన వారికి పరిహారం అందేలా చూడాలని కోరారు. నాగోల్, బండ్లగూడ చెరువుల కింది కాలనీల్లో జరిగిన నష్టంపై టీమ్ సభ్యులు వివరాలు తీసుకున్నారు. హయత్ నగర్ లోని నాగోల్ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట నాలా ఏరియా, బైరామల్‌గూడలోని పలు కాలనీలను పరిశీలించారు. ఉదయ్ నగర్, మల్ రెడ్డి రంగారెడ్డి నగర్, తపోవన్ కాలనీలలో దాదాపు 2 వేల ఇండ్లు ముంపునకు గురైనట్లు అధికారులు సెంట్రల్ టీమ్‌కు వివరించారు. అనంతరం సరూర్ నగర్చెరువుతోపాటు టోలీచౌకిలోని విరాసత్ నగర్, బాల్ రెడ్డి నగర్, నదీమ్ కాలనీ, సాతం చెరువు ఏరియాల్లో పర్యటించి స్థానికులతో మాట్లాడారు.
మూసీలోకి వరద నీరు మళ్లించేందుకు నాలాల అభివృద్ధి
నాగోల్, బండ్లగూడ, బైరామల్‌గూడ చెరువుల నుంచి వచ్చే వరద నీటిని మూసీలో కలిపేందుకు శాశ్వత ప్రాతిపదికన నాలాలను అభివృద్ధి చేయనున్నట్లు సెంట్రల్ టీమ్‌కు ఇరిగేషన్, జీహెచ్ఎంసీ అధికారులు వివరించారు. దీనిపై సమగ్ర ప్లాన్ రూపొందించే బాధ్యతను కన్సల్టెన్సీకి అప్పగిస్తామన్నారు. దెబ్బతిన్న రోడ్లు, నాలాలు, చెరువు కట్టలు పునరుద్ధరణ వారికి తెలిపారు. కేంద్ర బృందం వెంట జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు ఉపేందర్‌రెడ్డి, ప్రావీణ్య, చీఫ్ ఇంజనీర్ జియా ఉద్దీన్ ఉన్నారు.
నష్ట నివారణలో సర్కారు ఫెయిల్..కేంద్ర బృందానికి కాంగ్రెస్ ఫిర్యాదు
వరద ముప్పును అంచనా వేయడంలో ప్రభుత్వం ఫెయిలైందని సెంట్రల్ టీమ్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. కేంద్ర బృందాన్ని కలిసేందుకు అవకాశం లేకపోవడంతో ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఈ మెయిల్ ద్వారా లేఖ పంపారు. కేంద్ర బృందానికి నేతృత్వం వహిస్తోన్న కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ ప్రవీణ్ వశిష్ట, ఇతర సభ్యులకు వేర్వేరుగా మెయిల్ పంపారు. వేర్వేరు సంస్థలు, వరద బాధితుల అభిప్రాయాలు కేంద్ర బృందం తీసుకుంటే ఎక్కువ విషయాలు తెలుస్తాయన్నారు. భారీ విపత్తు వచ్చినా నష్ట నివారణకు ప్రభుత్వం కనీస ప్రయత్నం చేయలేదన్నారు. సీఎం తన అధికార నివాసాన్ని వీడి బయటకు రాలేదని, వరద నష్టాన్ని ఇష్టం వచ్చినట్టుగా కాగితాలపై నమోదు చేశారన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.20 వేల చొప్పున పరిహారమివ్వాలని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, తెలంగాణ చైర్మన్ అన్వేశ్‌రెడ్డి కేంద్ర బృందాన్ని కోరారు. పత్తి, చెరుకు, కంది రైతులనూ ఆదుకోవాలన్నారు.