ప్రజాస్వామిక తెలంగాణకు పునాది పడింది : కోదండరాం

 ప్రజాస్వామిక తెలంగాణకు పునాది పడింది : కోదండరాం
  • 2014లో వచ్చింది భౌగోళిక తెలంగాణ మాత్రమే

సత్తుపల్లి/మహబూబాబాద్ అర్బన్,​ వెలుగు : తొమ్మిదిన్నరేళ్ల క్రితం మనం పొందింది భౌగోళిక తెలంగాణ మాత్రమే అని,అసలైన ప్రజాస్వామిక తెలంగాణ ఇప్పుడే ఏర్పడిందని టీజేఎస్  చీఫ్​  కోదండరాం అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తొలి, మలితరాల ఉద్యమకారులను శనివారం ఖమ్మం జిల్లా సత్తపల్లి పట్టణంలోని కళాభారతి ఆడిటోరియంలో ఆయన కలిసి మాట్లాడారు. ప్రగతి భవన్  ఇనుప కంచెలను కూలదోస్తున్నపుడు తెలంగాణ ప్రజలు తమ చుట్టూ ఉన్న ముళ్ల కంచెలు తొలగినట్లు భావించారని, నేడు ప్రజాభవన్ లో వినతిపత్రాలు ఇవ్వడానికి వేల మంది తరలివచ్చి తమ బాధలను చెప్పుకుంటున్నారని తెలిపారు. హైదరాబాద్ లో ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్ ను పునరుద్ధరిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించి ప్రజల సమస్యలపై గొంతుకలను వినిపించే అవకాశం కల్పించిందన్నారు. గత తొమ్మిదిన్నరేండ్లలో మనం ఏమి కోల్పోయామో అవన్నీ ఈ ప్రభుత్వంలో పొందగలమన్న నమ్మకం తనకు కలిగిందన్నారు. ఉద్యమకారులు అందరం కలసి చర్చించుకొని సమస్యలను ప్రభుత్వంతో  పరిష్కరించుకుందామని కోరారు. ఈ సందర్భంగా ఈ ప్రాంత  ఉద్యమకారులు కోదండరాంను సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాటి తెలంగాణ జేఏసీ చైర్మన్, కన్వీనర్ చిత్తలూరు ప్రసాద్, కూకలకుంట రవి, సభ్యులు ఆదిల్ షరీఫ్, నాగాచారి, మలిదశ ఉద్యమకారులు బొంతు వెంకటేశ్వరరావు,  కంచర్ల బాబురావు తదితరులు పాల్గొన్నారు.

ఉద్యమ లక్ష్యాలను సాధించుకుందాం

ఉద్యమ లక్ష్యాలను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అందరి సమన్వయంతో సాధించుకోవాలని టీజేఎస్  అధ్యక్షుడు కోదండరాం అన్నారు. శనివారం మహబూబాబాద్​లోని నలంద కాలేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య​అతిథిగా పాల్గొని మాట్లాడారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో బీఆర్ఎస్​ ప్రభుత్వంతో తీవ్రంగా నష్టపోయామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్​ జిల్లా అధ్యక్షుడు డోలి సత్యనారాయణ, పిల్లి సుధాకర్, అంబటి శ్రీనివాస్  తదితరులు పాల్గొన్నారు.