హనుమకొండ, వెలుగు: ఓరుగల్లు భద్రకాళి బండ్ నుంచి రాకెట్ లాంచింగ్ నిర్వహించడం గర్వకారణమని, జిల్లాకు ఎంతో ఖ్యాతిని తీసుకొస్తుందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. నేషనల్ సైన్స్ డే సందర్భంగా హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో ఆస్ట్రానమీ, స్పేస్ ఇన్నోవేషన్స్, ఏటీడీఆర్ఎల్ రూపొందించిన రుద్రమ రాకెట్ ప్రయోగంపై శనివారం నిర్వహించిన సెమినార్ లో ఎంపీ కడియం కావ్య చీఫ్ గెస్ట్ గా ప్రసంగించారు. సైన్స్ డేను పురస్కరించుకుని విమెన్ ఇన్ సైన్స్ థీమ్ తో ఈ సంవత్సరం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు.
విద్య, ఆరోగ్యం, వ్యవసాయం తదితర రంగాలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్యం ఇస్తున్నారని, వరంగల్ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. అంతకుముందు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యా, విజ్ఞానం ప్రజలకు మరింత చేరువ కావాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తోందన్నారు. మార్చి 10 లేదా 11 తేదీల్లో హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ జిల్లా పర్యటనకు రానున్నారని తెలిపారు. రెండు రోజుల పాటు జిల్లాలోనే ఉండి ఆస్పత్రులు, సైన్స్ సెంటర్, విద్యాసంస్థల అభివృద్ధిపై సమగ్రంగా సమీక్షించనున్నట్లు తెలిపారు.
అనంతరం విమెన్ ఇన్ సైన్స్ థీమ్ పోస్టర్లను ఆవిష్కరించారు. వరంగల్ ను భవిష్యత్తులో స్పేస్ మాన్యుఫ్యాక్షరింగ్ హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఏటీడీఆర్ఎల్ వ్యవస్థాపకుడు, రుద్రమ వీ1 రాకెట్ రూపకర్త శశాంక్ భూపతి అన్నారు. ఒకే వ్యయంతో ఏడు ఉపగ్రహాలను పంపగలిగే రాకెట్లను తయారు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఉపగ్రహ ప్రోటోటైప్ అభివృద్ధి దశలో ఉందని, 2027లో శ్రీహరికోట నుంచి రుద్రమ వీ2 పేరుతో ప్రయోగించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. రాకెట్లను మనమూ తయారు చేయగలమనే నమ్మకాన్ని వరంగల్ నగరం నిరూపించిందన్నారు.
కాకతీయుల శిల్పకళలోని జ్యామితీయ సూత్రాల నుంచి ప్రేరణ పొంది స్పేస్ ఆర్కిటెక్చర్ డిజైన్లు రూపొందిస్తున్నామని వివరించారు. కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ యువత నక్షత్రాలను చూడటమే కాకుండా వాటిని చేరుకునే లక్ష్యంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఇస్రో కోఆర్డినేటర్ శేషగిరిరావు, కుడా సీపీవో అజిత్ రెడ్డి, ఈఈ భీమ్ రావు, రెడ్ క్రాస్ ఈసీ మెంబర్ ఈవీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
