ప్రాజెక్టుల పరిశీలనపై యూటర్న్‌

ప్రాజెక్టుల పరిశీలనపై యూటర్న్‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ప్రాజెక్టుల అనుమతులపై మొదట ఓవరాక్షన్‌‌‌‌ చేసిన గోదావరి బోర్డు ఇప్పుడు చేతులెత్తేసింది. టెక్నికల్​ ఎగ్జామినేషన్ పేరుతో డీపీఆర్‌‌‌‌లను లేటు చేయొద్దని వాటిని వెంటనే సీడబ్ల్యూసీకి పంపాలని తెలంగాణ చాలా కాలం క్రితమే గోదావరి బోర్డును కోరింది. అయితే అప్పట్లో తెలంగాణ డిమాండ్​ బోర్డు పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ టెక్నికల్​ ఎగ్జామినేషన్ తమ వల్ల కాదని అది సీడబ్ల్యూసీనే చూసుకోవాలని తేల్చి చెప్పింది. జీఆర్‌‌‌‌ఎంబీ గెజిట్‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌లో అన్‌‌‌‌ అప్రూవ్డ్​ లిస్ట్ నుంచి తమ ఐదు ప్రాజెక్టులు తొలగించాలని తెలంగాణ విజ్ఞప్తి చేసింది. కాళేశ్వరం అడిషనల్‌‌‌‌ టీఎంసీ, గూడెం ఎత్తిపోతలు, రామప్ప–పాకాల లేక్‌‌‌‌ డైవర్షన్‌‌‌‌, కందుకుర్తి ఎత్తిపోతలు, పీవీ నర్సింహారావు కంతనపల్లి సుజల స్రవంతి పథకాలను ఆమోదం లేని ప్రాజెక్టుల లిస్ట్​ నుంచి తొలగించాలని జీఆర్‌‌‌‌ఎంబీని తెలంగాణ కోరింది. ఈ విజ్ఞప్తిని సీడబ్ల్యూసీకి పంపకుండా అదనపు సమాచారం ఇవ్వాలంటూ జీఆర్‌‌‌‌ఎంబీ ఇరిగేషన్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ను పలు వివరాలు కోరింది. బోర్డు తీరును ఆక్షేపిస్తూ ఇరిగేషన్‌‌‌‌ అధికారులు లేఖలు రాయడం, సీఎం కేసీఆర్ స్వయంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌‌‌‌ షెకావత్‌‌‌‌ను కలిసి.. జాబితా నుంచి ప్రాజెక్టులు తొలగించాలని కోరడంతో దీనిపై కదలిక వచ్చింది. ఆయా ప్రాజెక్టులను అన్‌‌‌‌ అప్రూవ్డ్​ కేటగిరీ నుంచి తొలగించేందుకు టెక్నికల్‌‌‌‌ ఎగ్జామినేషన్‌‌‌‌ చేయాలని సీడబ్ల్యూసీ నుంచి జీఆర్‌‌‌‌ఎంబీకి రెండు నెలల క్రితం ఆదేశాలు అందాయి. ఆ తర్వాత బోర్డు అడిగిన పలు వివరాలను రాష్ట్ర అధికారులు సమర్పించిన తర్వాత జీఆర్‌‌‌‌ఎంబీ చేతులెత్తేసింది.

గెజిట్‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌ నుంచి ప్రాజెక్టులు తొలగించాలన్న తెలంగాణ విజ్ఞప్తిపై తాము టెక్నికల్‌‌‌‌ ఎగ్జామినేషన్‌‌‌‌ చేయలేమని, ఆ పని సీడబ్ల్యూసీనే చేసుకోవాలని ఇటీవల లెటర్ రాసింది. ఇన్ని రోజులు సాంకేతిక పరిశీలన పేరుతో ఇష్టమొచ్చినట్టు వివరాలడిగిన బోర్డు ఉన్నట్టుండి యూటర్న్‌‌‌‌ తీసుకుంది. తన పరిధిలో లేని అంశాలపై కొర్రీలు పెట్టి తీరా టైమ్​కు ఆ బాధ్యత తమది కాదని చెప్తోంది. గోదావరి బోర్డు గెజిట్‌‌‌‌లో 11 ప్రాజెక్టులకు అనుమతుల్లేవని పేర్కొన్నారు. అందులో 6 ప్రాజెక్టుల డీపీఆర్‌‌‌‌లు రాష్ట్రం సమర్పించింది. వాటి పరిశీలన పేరుతో సుదీర్ఘకాలం బోర్డు అధికారులు తమ వద్దే పెట్టుకున్నారు. దీనిపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. కేఆర్‌‌‌‌ఎంబీకి డీపీఆర్‌‌‌‌లు ఇస్తే వాటిని టెక్నికల్‌‌‌‌ ఎగ్జామినేషన్‌‌‌‌ కోసం సీడబ్ల్యూసీలోని డైరెక్టరేట్లకు పంపినప్పుడు గోదావరి బోర్డు అలా ఎందుకు చేయడం లేదని తెలంగాణ ప్రశ్నించింది. జీఆర్‌‌‌‌ఎంబీ బాధ్యుల తీరుపై కేంద్రానికి ఫిర్యాదులు చేసింది. ఇటీవల కేంద్ర జలశక్తి శాఖ సెక్రటరీ పంకజ్‌‌‌‌కుమార్‌‌‌‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌లో అసలు గోదావరి బోర్డే అవసరం లేదని తెలంగాణ డిమాండ్‌‌‌‌ చేసింది. ఈ కారణాలతోనే బోర్డు సాంకేతిక పరిశీలన నుంచి వైదొలిగినట్టు తెలుస్తోంది.