ఐడీబీఐ బ్యాంక్‌‌లో 51 శాతం వాటా అమ్మకం!

ఐడీబీఐ బ్యాంక్‌‌లో 51 శాతం వాటా అమ్మకం!
  • బయ్యర్ల కోసం రూల్స్‌‌ను  సవరించనున్న ఆర్‌‌‌‌బీఐ!

న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌‌లో కనీసం 51 శాతం వాటాను అమ్మాలని ప్రభుత్వం, ఎల్‌‌ఐసీ చూస్తున్నాయి. ప్రస్తుతం కేంద్రానికి, ఎల్‌‌ఐసీకి కలిపి ఈ బ్యాంక్‌‌లో 94 శాతం వాటా ఉంది.  ఐడీబీఐ బ్యాంక్‌‌లో ఎంత వాటా అమ్మాలనే అంశంపై తాజాగా చర్చలు జరిగాయని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ప్రభుత్వం, ఎల్‌‌ఐసీ..రెండూ కూడా ఐడీబీఐలో కొంత వాటాను నిలుపుకోవాలని చూస్తున్నాయని అన్నారు. ఈ డీల్‌‌కు సంబంధించి మినిస్టర్ల ప్యానెల్ తుది నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. వచ్చే నెల ముగిసే నాటికి బయ్యర్‌‌‌‌ను గుర్తించాలని ప్రభుత్వం, ఎల్‌‌ఐసీ వర్గాలు భావిస్తున్నాయని ఈ విషయం తెలిసిన వ్యక్తులు వివరించారు. గత 12 నెలల్లో ఐడీబీఐ బ్యాంక్ షేరు విలువ 6.3 శాతం పెరిగింది.

బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌‌ రూ. 42,470 కోట్లకు చేరుకుంది. ఈ విషయంపై మాట్లాడేందుకు ఫైనాన్స్ మినిస్ట్రీ, ఐడీబీఐ బ్యాంక్, ఎల్‌‌ఐసీ ప్రతినిధులు నిరాకరించారు.  ప్రభుత్వం, ఎల్‌‌ఐసీ ఐడీబీఐ బ్యాంక్‌‌లో కొంత వాటాను అమ్మడంతో పాటు, మేనేజ్‌‌మెంట్ కంట్రోల్‌‌ను కూడా వదులుకోనున్నాయని సంబంధిత వ్యక్తులు వివరించారు. ఈ బ్యాంక్‌‌లో 40 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లకు రిజర్వ్‌‌ బ్యాంక్ అనుమతి ఇస్తుందని గతంలో బ్లూమ్‌‌బర్గ్‌‌ న్యూస్ రిపోర్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా, ఆర్‌‌‌‌బీఐ రెగ్యులేషన్స్‌‌ కింద పనిచేస్తున్న సంస్థలు మరో ఫైనాన్షియల్ సంస్థలో వాటా కొనడానికి రిజర్వ్ బ్యాంక్ అనుమతి తీసుకోవాలి. అదే రెగ్యులేషన్స్ కింద లేని  కంపెనీలు  గరిష్టంగా 10–15 శాతం వాటాను మాత్రమే కొనడానికి వీలుంటుంది. ఐడీబీఐ బ్యాంక్‌‌ కొనుగోలుదారుల కోసం ఆర్‌‌‌‌బీఐ  కొన్ని రూల్స్‌‌ను సవరిస్తుందని,   ప్రభుత్వం చేపడుతున్న  ప్రైవేటైజేషన్‌‌కు బూస్టప్‌‌ ఇవ్వాలని చూస్తోందని  వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది రూ. 65 వేల కోట్లను సేకరించాలని ప్రభుత్వం టార్గెట్‌‌గా పెట్టుకుంది. ఇప్పటికే ఎల్ఐసీలో వాటాలు అమ్మకం ద్వారా సుమారు రూ. 21 వేల కోట్లను సేకరించింది.