హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నెలకొన్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల (ఎల్‌నినో) నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలవారీగా పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులుగా సీనియర్ ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆదివారం సీఎస్ సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌కు జయేశ్ రంజన్, రంగారెడ్డికి వికాస్ రాజ్, కరీంనగర్‌కు బెన్హర్ మహేశ్ దత్ ఎక్కా, మెదక్‌కు ఏ వాణీ ప్రసాద్, నిజామాబాద్‌కు యోగితా రాణా, నల్గొండకు హరిచందన దాసరి, ఆదిలాబాద్‌కు ఇలంబర్తి, వరంగల్‌కు ఏ శ్రీదేవసేన, మహబూబ్‌నగర్‌కు వీపీ గౌతం, ఖమ్మం జిల్లాకు అనుదీప్ దురిశెట్టిని కేటాయించారు.
వీరంతా తమకు కేటాయించిన జిల్లాల్లో వర్షపాతం, జలాశయాల్లో నీటి నిల్వలు, భూగర్భ జలాలు, తాగునీటి లభ్యత, వ్యవసాయ, ఉద్యాన పంటల పరిస్థితి, విద్యుత్ సరఫరాలాంటి అంశాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, వివిధ శాఖల మధ్య సమన్వయం జరిగేలా చూడాల్సి ఉంటుంది. ఈ ప్రత్యేక అధికారులు జులై 20న తమకు కేటాయించిన ఉమ్మడి జిల్లాల్లో పర్యటించి, జిల్లా ఇన్‌చార్జి మంత్రుల నేతృత్వంలో జరిగే ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాల్లో పాల్గొంటారు.
ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగే ఈ సమావేశాల్లో ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో కలిసి ఎల్‌నినో పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక, తాగునీటి బడ్జెట్, పశుగ్రాసం లభ్యతపై సమగ్రంగా చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు. జిల్లా స్థాయి సమీక్షలు ముగిసిన వెంటనే సీఎం ఈ ప్రత్యేక అధికారులు, మంత్రులతో కలిసి రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు.
