
హైదరాబాద్, వెలుగు: కరోనా వ్యాక్సినేషన్ తొలి రోజు ఒక్కో సెంటర్‌లో 30 మందికే వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిరోజు వ్యాక్సినేషన్ జరగబోయే 139 సెంటర్ల వివరాలను రిలీజ్ చేసింది. ఒక్కో సెంటర్‌కు 30 మంది చొప్పున 4,170 మందికి మాత్రమే ఫస్ట్ రోజు వ్యాక్సిన్ వేయనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లకు హెల్త్ సెక్రటరీ రిజ్వీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సెంటర్‌కు 30 మందిని గుర్తించి, వారిని వ్యాక్సినేషన్ సెంటర్లకు తరలించాల్సిన బాధ్యతను డిస్ర్టిక్ట్ హెల్త్ ఆఫీసర్లు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నెల 16న వ్యాక్సినేషన్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని, అన్ని ఏర్పాట్లు ముందే చేసిపెట్టుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి వ్యాక్సిన్ సెంటర్‌కు స్పెషల్ ఆఫీసర్‌ను నియమించాలని సూచించారు. ఏయే సెంటర్‌లో ఏయే వీఐపీలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారో ముందే లిస్ట్ తయారు చేయాలని సూచించారు. వ్యాక్సిన్ తీసుకున్నాక రియాక్షన్ వస్తే ట్రీట్‌మెంట్ కోసం ఎమర్జెన్సీ కిట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రతి సెంటర్‌లో అంబులెన్స్ రెడీగా ఉండాలని, అవి పేషెంట్లను ఏ హాస్పిటల్‌కు తరలించాలో ముందే ఐడెంటిఫై చేసి పెట్టుకోవాలని ఆదేశించారు. ఆ తర్వాత రోజు నుంచి ఏయే అంబులెన్స్ ఏయే సెంటర్లు కవర్ చేయాలో, పేషెంట్లను ఎక్కడికి తీసుకెళ్లాలో మ్యాపింగ్ చేసి పెట్టుకోవాలన్నారు. సాఫ్ట్‌వేర్ మీదే ఆధారపడకుండా, మాన్యువల్ రిజిస్టర్ కూడా రెడీగా పెట్టుకోవాలన్నారు. తొలి రోజు గాంధీ దవాఖాన, నార్సింగి హెల్త్ సెంటర్ స్టాఫ్‌తో మోడీ మాట్లాడనున్నారు. వ్యాక్సినేషన్‌ను సక్సెస్ చేసేందుకు సహకరించాలని రాష్ర్టంలోని ప్రజాప్రతినిధులకు మంత్రి ఈటల రాజేందర్ లెటర్ రాశారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారు.