ఏజ్ లిమిట్ పెంపుపై జీవో

ఏజ్ లిమిట్ పెంపుపై జీవో

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల ఏజ్ లిమిట్ ను సర్కార్ పదేండ్లు పెంచింది. ప్రస్తుతం 34 ఏండ్లు ఉన్న ఏజ్ లిమిట్ ను 44 ఏండ్లకు పెంచుతూ సీఎస్​సోమేశ్ కుమార్​శనివారం జీవో జారీ చేశారు. ఇది రెండేండ్ల పాటు అమల్లో ఉంటుందని వెల్లడించారు. నిరుద్యోగుల నుంచి వచ్చిన వినతుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. టీఎస్​పీఎస్సీతో పాటు ఇతర రిక్రూట్​మెంట్​ఏజెన్సీలు నేరుగా భర్తీ చేసే పోస్టులకే ఈ పెంపు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఫిట్ నెస్ టెస్టులు తప్పనిసరిగా ఉండే యూనిఫామ్ సర్వీసు పోస్టులైన పోలీసు, ఎక్సైజ్, అగ్నిమాపక, జైళ్లు, అటవీ శాఖలకు ఈ పెంపు వర్తించదని పేర్కొన్నారు. జీవో ప్రకారం 2024  మార్చి వరకు చేపట్టనున్న డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ పోస్టుల భర్తీకి ఏజ్ లిమిట్ పెంపు వర్తించనుంది. జనరల్ కేటగిరీలో ఏజ్ లిమిట్ పెంచిన నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మరో ఐదేండ్లు పెరుగుతుంది. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏండ్లుగా ఉంటుంది.