భక్తులను సిరొంచకు తీసుకెళ్లేందుకు
10 బస్సులు పెట్టిన రాష్ట్ర సర్కారు
మహారాష్ట్ర వైపు రూ.10 కోట్లతో
ఏర్పాట్లు.. ఇక్కడ పైసా ఖర్చు పెట్టలే
నేటి నుంచే పుష్కరాలు మొదలు
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: రాష్ట్రంలో ప్రాణహిత పుష్కరాలపై ప్రభుత్వం చేతులెత్తేసింది. మన దగ్గర గతంలో కట్టిన పుష్కరఘాట్లు అందుబాటులోనే ఉన్నా.. ఏర్పాట్లకు పైసా కూడా ఇవ్వలేదు. కాళేశ్వరంలో పుణ్యస్నానాలకు వచ్చే భక్తులను మహారాష్ట్రలోని సిరొంచకు తీసుకెళ్లేందుకు పది బస్సులు పెట్టింది. దీంతో కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించాలని భావించిన భక్తులకు నిరాశ తప్పడం లేదు. వాళ్లంతా పొరుగు రాష్ట్రానికి వెళ్లాల్సిన పరిస్థితి. మహారాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లతో సిరొంచలో పనులు చేసినా.. మన దగ్గర ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు. బుధవారం నుంచే పుష్కరాలు మొదలుకానున్నాయి. దేవాదాయ శాఖకు చెందిన పూజారులు మధ్యాహ్నం 3.54 గంటలకు కాళేశ్వరంలోని అవతలి ఒడ్డుకు (మహారాష్ట్ర వైపు) పడవల్లో వెళ్లి పుష్కరుడ్ని ఆహ్వానించే పూజలు చేస్తారు. తర్వాత అవే నీళ్లను తీసుకొచ్చి కాళేశ్వర‒ముక్తీశ్వర ఆలయంలో అభిషేకం చేస్తారని ఈవో మహేశ్ ప్రకటించారు.
ప్రాణహిత నీళ్లపై ఆధారపడి లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన రాష్ట్ర సర్కారు.. అదే ప్రాణహితకు పుష్కరాలను కాళేశ్వరం వద్ద నిర్వహించలేక తప్పించుకున్నది. భక్తులు తక్కువ సంఖ్యలో వచ్చే కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి, మంచిర్యాల జిల్లా వేమనపల్లి, అర్జునగుట్ట ఏరియాల్లో అక్కడి కలెక్టర్లు లోకల్ ఫండ్స్‌తో కొన్ని ఏర్పాట్లు చేశారు. కీలకమైన కాళేశ్వరం త్రివేణి సంగమంలో ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. పుష్కరాలు జరిగే 12 రోజుల్లో కాళేశ్వరానికి రోజుకు కనీసం 2 లక్షల మంది చొప్పున 30 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని ఆఫీసర్లు అంచనా వేశారు. దీంతో భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రూ.22 కోట్లతో ప్రపోజల్స్ పంపించినా.. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. మహారాష్ట్రలో మాత్రం సీరొంచ, నగరం గ్రామాల్లో రూ.10 కోట్లతో పుష్కర ఘాట్ల వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. స్త్రీలు స్నానాలు చేసి, దుస్తులు మార్చకునేందుకు గదులను, తాత్కాలిక మరుగుదొడ్లను, మూత్రశాలలను కట్టించారు. చలువ పందిళ్లు కూడా వేశారు.
సీరొంచకు పోయి స్నానం చేయాలె
హైదరాబాద్, వరంగల్, నల్గొండ జిల్లాల నుంచి పుణ్యస్నానాలకు వచ్చే భక్తులకు కాళేశ్వరం దగ్గర. ఏపీ నుంచి వచ్చేవారు కూడా 353 సీ నేషనల్ హైవే నుంచి కాళేశ్వరం నేరుగా చేరుకోవచ్చు. ఇక్కడ భక్తులు విడిది చేయడానికి ప్రైవేట్ రూములు అందుబాటులో ఉన్నాయి. హరిత కాకతీయ హోటల్ ఉంది. కాళేశ్వరం టెంపుల్ ఏరియాలో చలువ పందిళ్లు వేసి భక్తులు సేదతీరే ఏర్పాట్లు చేయవచ్చు. గతంలో కట్టిన పుష్కరఘాట్లు అందుబాటులో ఉన్నాయి. కానీ సర్కారు పైసా ఇయ్యకపోవడంతో ఆఫీసర్లు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. దీంతో పుష్కరాలకు ఒక రోజు ముందు కాళేశ్వరం నుంచి మహారాష్ట్రలోని సీరొంచకు 10 ఉచిత బస్సులు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పుణ్య స్నానాలకు తెలంగాణ, ఏపీ నుంచి కాళేశ్వరం వచ్చే భక్తులను బుధవారం నుంచి సీరొంచ పుష్కర ఘాట్‌కు ఉచితంగా తరలిస్తామని, ఇందుకు రోజుకు 10 ఆర్టీసీ బస్సులు నడుపుతున్నామని ఆర్టీసీ ఆఫీసర్లు వెల్లడించారు. హనుమకొండ నుంచి కాళేశ్వరానికి 200 బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు. అక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీరొంచకు ఉచిత బస్సుల్లో వెళ్లవచ్చు.
కాళేశ్వరంలో పిండ ప్రదానాలే
ప్రాణహిత పుష్కరాలు బుధవారం మధ్యాహ్నం కాళేశ్వరంలోని అవతలి ఒడ్డు వైపు ప్రారంభమవుతాయి. దేవాదాయ శాఖకు చెందిన పూజారులు పడవల్లో మహారాష్ట్ర వైపు వెళ్లి పుష్కరున్ని ఆహ్వానించి.. ఆ నీళ్లను తీసుకొచ్చి కాళేశ్వర‒ముక్తీశ్వర స్వామికి అభిషేకం చేస్తారు. కాళేశ్వరంలో పిండ ప్రదాన పూజలు మాత్రమే చేసే అవకాశం కల్పించారు. పుష్కరాల నేపథ్యంలో టెంపుల్ రూమ్స్ భక్తులకు ఇవ్వట్లేదు. 20 రూములను ఆఫీసర్లకే కేటాయించారు. కాళేశ్వరం హనుమాన్ ఆలయం వద్ద బస్టాండ్ ఏర్పాటు చేశారు. భక్తుల కోసం కాళేశ్వరం ఆలయం దగ్గర మాత్రమే చలవ పందిళ్లు వేశారు. నది తీరంలో ఘాట్ వద్ద అలాంటివేం లేవు. దేవాదాయ శాఖకు చెందిన 8 మంది ఈవో లు, ఐదుగురు సూపరింటెండెంట్లు, 200 మంది సిబ్బంది, మహదేవపూర్ మండలానికి చెందిన రెవెన్యూ ఆఫీసర్లు, 200 మందికి పైగా పోలీసులకు డ్యూటీలు వేశారు.
