నాలుగేండ్లవుతున్నా పంట రుణాలు మాఫీ  చేయని సర్కారు

నాలుగేండ్లవుతున్నా పంట రుణాలు మాఫీ  చేయని సర్కారు
  • ఎప్పట్లాగే అన్నదాతల అకౌంట్లు  ఫ్రీజ్ ​చేస్తున్న బ్యాంకులు
  • పైసలు ఆపడంతో ఆందోళనలో  రైతులు

మహబూబ్​నగర్​, వెలుగు : 'రైతుబంధు' పైసలు రైతుల చేతికి రావడం లేదు. క్రాప్​ లోన్ల వడ్డీల కింద బ్యాంకర్లు జమ చేసుకుంటున్నారు. 2018 నుంచి ఏటా ఈ స్కీం కింద పైసలు వేస్తున్న ప్రతిసారీ బ్యాంకు అధికారులు అకౌంట్లను ఫ్రీజ్​ చేసి వడ్డీ పైసలు వసూలు చేసుకుంటున్నారు.  2018 డిసెంబరు 11నాటికి రూ.లక్ష వరకు ఉన్న క్రాప్ లోన్లను మాఫీ చేస్తామని రాష్ట్ర సర్కారు హామీ ఇచ్చింది.  కానీ నాలుగేండ్లు గడిచినా ఇప్పటివరకు 4 శాతం లోన్లను, అది కూడా రూ.25వేల లోపు ఉన్నవాటిని పూర్తిగా, రూ.50వేల లోపు ఉన్న లోన్లను కొంతవరకు మాత్రమే మాఫీ చేసింది. సర్కారు చెప్పిన తేదీ నాటికి బ్యాంకుల్లో40.66 లక్షల మంది రైతులు రూ.25,936 కోట్ల క్రాప్​లోన్స్​ తీసుకోగా, ఇప్పటివరకు 4లక్షల మంది తీసుకున్న రూ.1171 కోట్లు మాత్రమే మాఫీ చేశారు. ఇంకా 36.68 లక్షల మంది రైతులకు సంబంధించిన 24,765 కోట్లను మాఫీ  చేయాల్సి ఉంది.  ఈ లోన్లను ఏడాదికోసారి వడ్డీ కట్టి  రెన్యువల్ చేసుకోవాలని బ్యాంకులు చెబుతున్నా సర్కారు మాఫీ చేస్తుందనే నమ్మకంతో చాలా మంది రైతులు పట్టించుకోవడం లేదు. దీంతో బ్యాంకర్లు రైతుల అకౌంట్లలో వడ్ల పైసలు పడగానే ఫ్రీజింగ్​ పెడుతున్నారు.  

నాలుగేండ్లుగా ఇదే పని

సర్కారు  మొదట్లో 'రైతుబంధు' స్కీంను ప్రారంభించి ఎకరాకు రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.8 వేలు చెల్లించింది. 2019–-20 ఆర్థిక సంవత్సరం నుంచి స్కీం కింద ఎకరాకు మరో రూ.వెయ్యి పెంచి రూ.5 వేల చొప్పున ఏడాదికి రూ.10 వేలను ఇస్తోంది. అయితే, స్కీం కింద పైసలు పెంచినప్పటి నుంచి రైతుల చేతికి డబ్బులు రావడం లేదు. వీరు తీసుకున్న లోన్లకు వడ్డీ పెరిగిపోతోందంటూ 2019 నుంచి బ్యాంకర్లు రైతుల అకౌంట్లలో జమవుతున్న 'రైతుబంధు' పైసలను డ్రా చేయనివ్వకుండా ఫ్రీజ్​ చేస్తున్నారు. ఇతర లావాదేవీల కింద డబ్బు జమవుతున్నా.. వాటిని కూడా డ్రా చేయనివ్వకుండా డెబిట్ ​చేస్తున్నారు. ప్రధాన మంత్రి కిసాన్ ​సమ్మాన్​నిధి కింద వస్తున్న పైసలను కూడా వడ్డీ కింద కట్​ చేసుకుంటున్నారు.  

ప్రకటనకు ముందే ఫ్రీజింగ్​ 

జూన్​28, 2022లో తొమ్మిదో విడత రైతుబంధు కింద రాష్ర్టంలో 68.94 లక్షల మంది రైతులకు రూ.7,654.43 కోట్లిచ్చారు. యాసంగి సీజన్​కు సంబంధించి డిసెంబరు 28 నుంచి సంక్రాంతి పండుగ ముగిసే లోపు స్కీం కింద డబ్బులు జమ చేస్తామని డిసెంబరు 18న సీఎం కేసీఆర్​ప్రకటించారు. రాష్ర్ట వ్యాప్తంగా ఈ సీజన్​లో రూ.7,600 కోట్లను రైతుల అకౌంట్లలో జమ చేయనున్నట్ల ఫైనాన్స్​మినిస్టర్ హరీశ్​రావుతో కలిసి ప్రకటన చేశారు. కానీ, డిసెంబరు 15 నుంచే బ్యాంకర్లు రైతుల అకౌంట్లను ఫ్రీజ్​చేయడం మొదలుపెట్టారు. ఎలాంటి లావాదేవీలు జరుపకుండా ఖాతాలను హోల్డ్​లో పెట్టారు. తర్వాత రైతుల అకౌంట్లలో జమవున్న రైతుబంధు డబ్బులతో పాటు పీఎం కిసాన్​సమ్మాన్​నిధి కింద క్రెడిట్​అవుతున్న పైసలను కూడా వడ్డీల కింద జమ చేసుకుంటున్నారు. రైతుబంధు పైసలు పోను మిగిలిన వడ్డీ డబ్బులు కట్టాలని రైతులను ఒత్తిడికి గురి చేస్తున్నారు.  

హోల్డ్​లో అన్ని రకాల అకౌంట్లు

రైతులకు ఏ బ్యాంక్​ అకౌంట్లు ఉన్నా.. వాటన్నింటినీ బ్యాంకర్లు హోల్డ్​లో పెడుతున్నారు.వితంతు, వృద్ధాప్య, దివ్యాంగుల పింఛన్లు, రైతుభీమా, రైతుబంధు, పీఎం కిసాన్​ సమ్మాన్​ నిధి డబ్బులు ఏ అకౌంట్లో జమయితే, వాటన్నింటినీ ఫ్రీజ్​ చేస్తున్నారు. భూ యజమాని చనిపోతే.. వారి వారసుల అకౌంట్లను వడ్ల కొనుగోళ్ల సెంటర్​ టైంలో సేకరించి ఫ్రీజ్​చేస్తున్నారు. కొందరి అకౌంట్లను నెలలు గడుస్తున్నా రిలీజ్​చేయడం లేదు. దీంతో బ్యాంకర్ల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్కీం పైసలు తమ అకౌంట్లలో జమ చేయడం.. ఆ పైసలను వెంటనే బ్యాంకులు వడ్డీల కింద జమ చేసుకోవడం రెండున్నరేండ్లుగా కామన్​గా మారిందని ఫైర్​ అవుతున్నారు.  

రెన్యువల్​చేయలేదని ఫ్రీజ్​ చేసిండ్రు

నాకు మూడున్నర ఎకరాలుంది. గతంలో బ్యాంకులో క్రాప్​లోన్​ కింద రూ.3 లక్షలు తీసుకున్నా. ప్రతి ఏటా లోన్​ను రెన్యువల్​ చేస్తుంటి. రుణమాఫీ చేస్తరని ఈసారి చేయలేదు. దీంతో నా అకౌంట్​ను ఫ్రీజ్​ చేసిన్రు. రైతుబంధు కింద యాసంగిలో ప్రభుత్వం నా అకౌంట్​లో జమ చేసిన రూ.17,500లను డ్రా చేయకుండా ఆపేశారు.  

- ధర్మాజి కిష్టయ్య, రైతు, చిట్యాల్, కడెం మండలం, నిర్మల్ జిల్లా

రూ.60 వేలకు రూ.60 వేల వడ్డీ  

మా అమ్మకు 9.23 ఎకరాల భూమి ఉంది. రూ.60 వేల క్రాప్ లోన్ తీసుకున్నం. గవర్నమెంట్ రుణమాఫీ అన్నందుకు మిత్తీ కట్టలేదు. ఇప్పుడు రూ.60 వేలకు రూ.60 వేల వడ్డీ కలిపి రూ.1.07 లక్షలు చేసిండ్రు. మాకు కొత్తగా క్రాప్ లోన్లు ఇస్తున్నది ఏం లేదు. పేపర్ల మీద రెన్యువల్ చేస్తున్నరు. పెట్టుబడి కోసం మళ్లీ అప్పులకు పోతున్నం.

- నాగోలు లక్ష్మమ్మ, వట్టెం, బిజినేపల్లి మండలం, నాగర్​కర్నూల్ జిల్లా