ఇంటికి రూ.3 లక్షలపై త్వరలోనే గైడ్ లైన్స్

ఇంటికి రూ.3 లక్షలపై త్వరలోనే గైడ్ లైన్స్

రూల్స్ ఖరారుకు త్వరలో మంత్రులు, సీఎస్ భేటీ
రాష్ట్రంలో10 లక్షల మందికి ఇండ్లు లేవని అంచనా  
పీఎం ఆవాస్ యోజన గైడ్ లైన్స్ పైనా సర్కార్ ఫోకస్   
కేంద్రం నుంచి సగం నిధులు పొందేలా ప్లాన్

హైదరాబాద్, వెలుగు: సొంత జాగాలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సాయంపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. దీనిపై త్వరలో మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, సీఎస్ సోమేశ్​కుమార్, హౌసింగ్ అధికారులు సమావేశం కానున్నట్లు తెలిసింది. ఇందులో గైడ్ లైన్స్ ఖరారుపై చర్చించనున్నారు. 2018 ఎన్నికల మేనిఫెస్టోలో సొంత జాగా ఉన్న వాళ్లకు రూ. 5 లక్షలు, ఎస్సీ, ఎస్టీ వాళ్లకు రూ.6 లక్షలు ఇస్తామని టీఆర్ఎస్ పేర్కొంది. అయితే నిధుల కొరత, లబ్ధిదారులు ఎక్కువ ఉండటంతో ప్రభుత్వం ఈ నిధుల్లో కోతపెట్టింది. ఇతర రాష్ర్టాల్లో ఇంత పెద్ద మొత్తం ఎక్కడా ఇవ్వటం లేదని చెబుతోంది. 
 
ఎమ్మెల్యేలే ఎంపిక చేస్తరు 

లబ్ధిదారులను గుర్తించేందుకు పకడ్బందీగా గైడ్ లైన్స్ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన వారికే ఆర్థిక సాయం అందించేలా గైడ్ లైన్స్ ఉండాలని యోచిస్తోంది. ఇందుకోసం తమిళనాడు, కేరళ, గుజరాత్, కర్నాటక, ఏపీ రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసేందుకు హౌసింగ్ అధికారులు ఆయా రాష్ర్టాల్లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ముందుగా అర్బన్, రూరల్ ఏరియాల్లో సొంత జాగా ఉన్న లబ్ధిదారులను గుర్తించాల్సి ఉంది. అక్రమాలను నివారించేందుకు జాగా దగ్గర లబ్ధిదారుతో పాటు ప్రభుత్వ అధికారి ఫొటో దిగి, దానిని ఆన్​లైన్​లో అప్ డేట్ చేయటంతో పాటు జియో ట్యాగింగ్ చేయనున్నారు. ఈ ప్రక్రియలో పంచాయతీ రాజ్ ఏఈలు గ్రామ పంచాయతీ సెక్రటరీల సహాయం తీసుకోనున్నారు. తర్వాత లబ్ధిదారులను ఎమ్మెల్యే ఎంపిక చేసి లిస్ట్​ను కలెక్టర్​కు ఇవ్వనున్నారు.  

పంచాయతీ సెక్రటరీలతో సర్వే 

రాష్ట్రంలో12,769 గ్రామాలు, 141 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లు ఉన్నాయి. ఇన్ని ప్రాంతాల్లో లబ్ధిదారులను గుర్తించాలంటే అధికారులు, సిబ్బంది ఎక్కువ సంఖ్యలో కావాలి. అయితే హౌసింగ్ డిపార్ట్ మెంట్​లో చాలా తక్కువ మంది అధికారులు, ఉద్యోగులు ఉన్నందున సర్వేకు రూరల్ ఏరియాలో పంచాయతీ సెక్రటరీలు, పీఆర్ ఏఈలు, అర్బన్ ఏరియాల్లో మున్సిపల్, కార్పొరేషన్ అధికారులు, ఉద్యోగుల సహాయం తీసుకోవాలని భావిస్తున్నరు. రాష్ట్రంలో ఇండ్లు లేని వాళ్లు 10 లక్షల  మంది ఉన్నట్లు అంచనా. 2014 లో సమగ్ర కుటుంబ సర్వే చేసిన సమయంలో రాష్ట్రంలో 25 లక్షల మందికి ఇండ్లు లేనట్లు తేలింది. కానీ అధికారులు సర్వే చేయనందున ఆ లెక్కలు కరెక్ట్ కాదని అంటున్నరు. 

పీఎం ఆవాస్​లా రూల్స్  

పీఎం ఆవాస్ యోజన గైడ్ లైన్స్​లో కొన్నింటిని ఈ ఆర్థిక సాయం కోసం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. హౌసింగ్ డిపార్ట్​మెంట్ ప్రకారం “రూరల్ ఏరియాల్లో 269 చదరపు గజాలు, అర్బన్ ప్రాంతాల్లో 323 చదరపు గజాలు ఉన్న వారికి రూ.3 లక్షలు అందించాలని నిర్ణయించాం. లబ్ధిదారులకు ఉన్న ప్లేస్ దగ్గర ఫొటో దిగి దానిని ఆన్​లైన్​లో అప్ లోడ్ చేస్తే అవకతవకలు జరగకుండా ఉంటుంది. ఆధార్​తో లింక్ చేయటం వల్ల నిజమైన లబ్ధిదారుల ఎంపిక జరగనుంది. త్వరలో ఈ స్కీమ్ గైడ్ లైన్స్​కు మంత్రులు, సీఎస్ తో మీటింగ్ జరుగుతుంది. తర్వాత లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ఎమ్మెల్యేలు, కలెక్టర్లకు గైడ్ లైన్స్ ఇవ్వనున్నాం” అని హౌసింగ్ డిపార్ట్ మెంట్ కు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. 

డబుల్ ఇండ్లు 90 శాతం పూర్తి

రాష్ట్రంలో సుమారు 69 వేల డబుల్ బెడ్ రూం ఇండ్లు 90% పూర్తయినయి. వీటిలో 40 వేల ఇండ్లు గ్రేటర్ పరిధిలో ఉన్నయి. పటాన్ చెరు దగ్గర నిర్మిస్తున్న కొల్లూరు మెగా టౌన్ షిప్ ను వచ్చే నెలలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించాలని యోచిస్తున్నరు. వాస్తవానికి ఈ ప్రాజెక్టును రాష్ర్టపతి లేదా ప్రధాని చేతుల మీదుగా ఓపెన్ చేయించాలని అనుకున్నరు. కానీ ఇటీవలి పరిణామాల వల్ల నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. 

కేంద్రం నుంచే సగం నిధులు 

2022‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–23 బడ్జెట్ లో సొంత జాగా ఉన్న వాళ్లకు 4 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఒక్కో ఇంటికి  రూ.3 లక్షలు సాయం చేసేం దుకు ప్రభుత్వం రూ.12,000 కోట్లను కేటాయించింది.  వీటిలో సుమారు రూ.4,500 కోట్లు కేంద్రం నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పీఎం ఆవాస్ యోజన స్కీమ్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూరల్ ఏరియాలో రూ.72 వేలు, అర్బన్ ఏరియాలో రూ.1.50 లక్షలు ఆర్థిక సహాయం చేస్తోంది. అయితే ఈ స్కీంలో నిధులు రావాలంటే ముందే లబ్ధిదారుల పేర్లు ఇవ్వాల్సి ఉంటుంది. డబుల్ బెడ్ రూమ్ స్కీమ్ లో ఇళ్ల నిర్మాణం పూర్తయిన తరువాత లబ్ధిదారులకు ఇస్తున్నందున ఇన్నాళ్లు పీఎం ఆవాస్ నిధులు రాలేదు. ఇపుడు ముందే లిస్ట్ ఇస్తున్నందున కేంద్రం నుంచి నిధులు వస్తాయని అధికారులు చెబుతున్నారు.