అంతటా సన్న బియ్యం..అంగన్​వాడీల్లో దొడ్డు బియ్యం

అంతటా సన్న బియ్యం..అంగన్​వాడీల్లో దొడ్డు బియ్యం

రంగారెడ్డి జిల్లా, వెలుగు:  పేద ప్రజలకు అందుబాటులో ఉంటున్న అంగన్​వాడీ కేంద్రాలపై ప్రభుత్వం సీతకన్ను వేసింది. పౌష్టికాహారం అందించాల్సిన అంగన్ వాడీల్లో మధ్యాహ్నం తినేందుకు పిల్లలు, గ్రామాల్లో ఉన్న గర్భిణులు, బాలింతలు ముఖం చాటేస్తున్నారు. అన్ని చోట్ల సన్నబియ్యం సరఫరా చేస్తున్న ప్రభుత్వం అంగన్​వాడీ కేంద్రాలకు దొడ్డు బియ్యం ఇవ్వడమే ఇందుకు కారణం.

ఆరేళ్లలోపు చిన్నారులకు పౌష్టికాహారం అందించి వారిని పాఠశాలకు సన్నద్ధం చేసేందుకు అంగన్‌‌వాడీ కేంద్రాల్లో  ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఒకపూట పిల్లలకు పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అంగన్​వాడీ కేంద్రాల్లోనే వండిపెట్టాలి. గ్రామాల్లో  అయితే చిన్నారులతో పాటు బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించేందుకు వీలుగా  మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం దొడ్డు బియ్యం సరఫరా చేస్తుండడంతో చిన్నారులకు ముద్ద దిగడం లేదు. కొన్ని  చోట్ల బియ్యం నాసిరకంగా, తుట్టెలు కట్టి ఉండడంతో నిర్వాహకులు కూడా భయాందోళన చెందుతున్నారు.

రంగారెడ్డి జిల్లాలో అమన్‌‌గల్లు, చేవెళ్ల, హయత్‌‌నగర్‌‌, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, శేరిలింగంపల్లి, షాద్‌‌నగర్‌‌ 7  ఐసీడీఎస్‌‌ ప్రాజెక్టులున్నాయి. వాటి పరిధిలో 1,600 అంగన్‌‌వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. జిల్లా మొత్తంగా ఆరేండ్లలోపు చిన్నారులు 70,727 మంది, గర్భిణులు8,577మంది , బాలింతలు 6,369 మంది  అంగన్​వాడీ కేంద్రాల  ద్వారా లబ్ధి పొందుతున్నారు. వీరందరికి మధ్యాహ్న భోజనం నిమిత్తం ప్రతినెలా1,370 క్వింటాళ్ల దొడ్డు బియ్యం సరఫరా అవుతున్నాయి.   బియ్యం నాణ్యతగా ఉండడంలేదని, తుట్టెలు కట్టి, దుమ్ము, ధూళి, పురుగులతో ఉంటున్నాయని అంగన్​వాడీ కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న దొడ్డు బియ్యాన్ని శుభ్రం చేయడానికి ఆయాలు నిత్యం నానా తంటాలు పడుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో వీటినే వండి పెడుతున్నారు. అయితే చాలాచోట్ల  మంది  చాలామంది తినడానికి విముఖత చూపుతున్నారు. మరికొందరు తప్పనిసరి పరిస్థితిలో తింటున్నారు. నాణ్యమైన పౌష్టికాహారం అంటే ఇలాగే ఉంటుందా..? అని బాలింతలు, గర్భిణులు మండిపడుతున్నారు.  ప్రాథమిక, ఉన్నత పాఠశాలలోపాటు వసతి గృహాలు, కస్తూర్బా విద్యాలయాల్లో  సన్న బియ్యం సరఫరా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మారుమూల ప్రాంతాల్లో ఉండే అంగన్​వాడీ కేంద్రాలకు నాణ్యత కొరవడిన  దొడ్డుబియ్యం సరఫరా ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తుట్టెలు కట్టిన దొడ్డు  బియ్యాన్ని వండి చూస్తూ చూస్తూ   చిన్న పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు ఎలా వడ్డించాలని   ప్రశ్నిస్తున్నారు.

నీరుగారుతున్న పథకం లక్ష్యం

గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం ఇవ్వాలన్న ఉద్దేశంతో అంగన్‌‌వాడీ కేంద్రాల్లో  కోడి గుడ్డుతోపాటు కూరగాయాలు, పప్పులతో భోజనం వండిపెడతారు. ప్రతిరోజూ కోడి గుడ్డు ఇస్తుండగా… మిగతా రోజుల్లో ఆహార పట్టిక ప్రకారం సాంబారు, కూరగాయలు వండిపెడతారు. ఇందుకు అవసరమైన బియ్యంతోపాటు పప్పులు, కోడి గుడ్లు, నూనె వంటి పదార్ధాలను ఏజెన్సీల ద్వారా ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. ఇవన్నీ బాగానే ఉన్నా దొడ్డు బియ్యం సరఫరా పైననే అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.  కేంద్రానికి వస్తున్న చిన్నారులతోపాటు మహిళలు అర్ధాకలితోనే ఉండిపోతున్నారు.

హామీల అమలులోనూ నిర్లక్ష్యం…

జిల్లాలో చాలాచోట్ల పాఠశాలల ఆవరణలోనే అంగన్‌‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. అరగంట తేడాతో మధ్యాహ్న భోజనం సమయం అందరిదీ ఒకేలా ఉంటుంది. పక్కపక్కనే ఉన్న పాఠశాలల్లో సన్న రకం బియ్యంతో వండిన భోజనం ఉండగా, అక్కడే ఉండే అంగన్‌‌వాడీ కేంద్రాల్లో మాత్రం దొడ్డు రకం బియ్యంతో వండిన భోజనం పెడుతున్నారు. సన్న బియ్యం పంపిణీ చేస్తామని గతంలో ప్రకటించినప్పటికీ  ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. అంగన్​వాడీ కేంద్రాల్లో  చిన్నారులు తుట్టెలు కట్టిన దొడ్డు బియ్యంతో వండిన భోజనం తిని ఆరోగ్యపరమైన ఇబ్బందులకు లోనవుతున్నారు.  మా పిల్లలు కడుపు నిండా తినడం లేదని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలింతలు, గర్భిణులు కూడా దొడ్డు బియ్యం భోజనం చేయడానికి ఇష్టపడడంలేదు. దొడ్డు బియ్యం వల్ల చాలామంది భోజనం కోసం కేంద్రానికి రావడంలేదని అంగన్​వాడీకేంద్రాల టీచర్లు చెబుతున్నారు.

ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే

అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు సన్న బియ్యం పంపిణీ చేయాలని గతంలోనే  ప్రభుత్వానికి నివేదికలు పంపిచాము. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే భోజనం ఏర్పాటు చేస్తాం. త్వరలోనే సన్న బియ్యం పంపిస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇప్పటిదాకా సన్న బియ్యం సరఫరా కాలేదు. దాంతో దొడ్డు బియ్యం పంపిణీ చేస్తున్నాం.

మోతి, జిల్లా సంక్షేమాధికారిణి