ORR గోడలపై కనిపించిన హార్ట్ టచింగ్ ‘ఆర్ట్’.. హాట్ టాపిక్ ఎందుకు అయిందంటే..

ORR గోడలపై కనిపించిన హార్ట్ టచింగ్ ‘ఆర్ట్’.. హాట్ టాపిక్ ఎందుకు అయిందంటే..

వృక్షో రక్షతి రక్షితః అని బడుల గోడల మీద ఉన్న సూక్తి చదివి నిజమే అని నిట్టూర్చితే సరిపోదు. ఆ మాటను నిజం చేసి మొక్కను నాటితేనే భవిష్యత్ తరాలకు మంచి చేసిన వాళ్లం అవుతాం. ఎందుకంటే.. చెట్టు లేనిదే మనిషికి మనుగడ లేదు. అభివృద్ధి పేరుతో అడవులను ధ్వంసం చేస్తూ.. చెట్లను నరుక్కుంటూ పోతే ఆక్సిజన్ సిలిండర్లే దిక్కవుతాయి. వెంటిలేటర్పై ఉన్నప్పుడు కాదు ఆరోగ్యంగా ఉన్న మనిషి మనుగడ సాగించాలన్నా స్వచ్ఛమైన గాలినిచ్చే చెట్లు, మొక్కలు లేక ఆక్సిజన్ సిలిండర్ వేలు, లక్షలు పోసి కొనుక్కునే రోజొకటి వస్తుందనే ఊహే ఎంతో భయంకరంగా ఉంది కద. అలాంటి రోజు రాకుండా ఉండాలంటే మొక్కలు నాటి చెట్లను పెంచడం ఒక్కటే మన ముందున్న మార్గమని చాటి చెప్పేలా హైదరాబాద్ ఓఆర్ఆర్ గోడలపై పోలీస్ అకాడమీ జంక్షన్ దగ్గర ఒక ఆర్ట్ కనిపించింది.

ఇద్దరు చిన్నారులు మాస్క్లు ధరించి, ఆక్సిజన్ సిలిండర్ భుజానికి కట్టుకుని మనం చేసిన తప్పుకు వాళ్లు శిక్ష అనుభవిస్తున్నట్టుగా మొక్కలు నాటుతున్న ఆ దృశ్యం ఆ రోడ్డులో వెళ్తున్న పబ్లిక్ను ఆలోచించేలా చేసింది. అభివృద్ధి పేరుతో చెట్లను నరుక్కుంటూ పోతే భావితరాలు ఎంత దారుణమైన పరిస్థితులు అనుభవించాల్సి వస్తుందో ఆ ఆర్ట్ కళ్లకు కట్టింది. అడవులను ధ్వంసం చేసి ఫ్యాక్టరీలను, సిటీలను నిర్మిస్తే జరిగే అనర్థం ఏంటనేది ఆ ఆర్ట్లో ఉన్న దృశ్యాలు చెప్పకనే చెబుతున్నాయి. చెట్లను నరికివేశాక మిగిలే చెట్ల మొద్దులు, ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న గాలితో జరిగే కాలుష్యం కారణంగా భవిష్యత్ తరాలు పీల్చే గాలి కూడా కరువై నానా యాతన పడతారని ఈ ఆర్ట్ ఒక్క చిత్రంతో చెప్పేసింది.

కరోనా సెకండ్​‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారతదేశంలో చాలా మంది ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోయారు. కొన్ని వేల రూపాయిలు ఖర్చు పెట్టి ఆప్తులను బతికించుకుందామని అనుకున్నా, ఆక్సిజన్ దొరకకపోవడంతో తమ వారి ప్రాణాలు నిలబెట్టుకోలేకపోయారు. చెట్లను పెంచడం, వాటి నరికివేతను ఆపడం, అడవుల నరికివేతను అరికట్టడం వల్ల గాలిలో సహజంగా ఆక్సిజన్ లభిస్తుందని చెబుతూ కరోనా టైమ్లో కనిపించిన ఆక్సిజన్ కొరతను పర్యావరణవేత్తలు ఉదాహరణగా గుర్తుచేస్తున్నారు.