V6 News

పబ్లిక్ ఛార్జింగ్ పోర్ట్‌లతో జాగ్రత్త..'జ్యూస్ జాకింగ్'తో డేటా చోరీ చేస్తున్న మోసగాళ్లు..

పబ్లిక్ ఛార్జింగ్ పోర్ట్‌లతో జాగ్రత్త..'జ్యూస్ జాకింగ్'తో డేటా చోరీ చేస్తున్న మోసగాళ్లు..

పబ్లిక్ ప్రదేశాల్లో ఉచితంగా లభించే ఛార్జింగ్ పోర్టులను లేదా గుర్తు తెలియని వ్యక్తుల పవర్ బ్యాంక్‌లను ఉపయోగిస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే సైబర్ నేరగాళ్లు మీ డేటాను దొంగిలించడానికి 'జ్యూస్ జాకింగ్' అనే కొత్త టెక్నిక్ ఉపయోగిస్తున్నారు. ఇది వినడానికి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లా అనిపించినా.. ఈరోజుల్లో హ్యాకర్లు మీ స్మార్ట్‌ఫోన్ భద్రతను ఛేదించడానికి వాడుతున్న ఫేమస్ మార్గంగా ఇది మారిపోయింది.

జ్యూస్ జాకింగ్ అంటే ఏమిటి?
జ్యూస్ జాకింగ్ అనేది సైబర్ దాడి పద్ధతి. ఇందులో నేరగాళ్లు బహిరంగ USB Type-C ఛార్జింగ్ పోర్టులను లేదా ప్రత్యేకంగా తయారుచేసిన ఛార్జింగ్ కేబుల్స్‌ను, పవర్ బ్యాంక్ లా కనిపించే పరికరాలను ఉపయోగించి మీ స్మార్ట్‌ఫోన్‌లోకి మాల్వేర్‌ను పంపించి రహస్యంగా డేటాను యాక్సెస్ చేసి కాపీ చేస్తారు. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లు ఉపయోగించే USB Type-C కనెక్టర్లు పవర్‌తో పాటు డేటాను కూడా ట్రాన్స్‌ఫర్ చేయగల సామర్థ్యం కలిగి ఉంటాయి. దీనినే మోసగాళ్లు ప్రస్తుతం ఆసరాగా తీసుకుని డేటా దొంగిలిస్తు్న్నారు.

డేటా చోరీ జరిగేది ఇలానే..
ఈ జ్యూస్ జాకింగ్ దాడులు ప్రధానంగా మూడు విధాలుగా పనిచేస్తాయి: మాల్వేర్ ఇన్‌స్టాలేషన్, డేటా దొంగతనం, ఫర్మ్‌వేర్ దాడులు. నేరగాళ్లు ఒక సాధారణ పవర్ బ్యాంక్ లా కనిపించే పరికరాన్ని కలిగి ఉంటారు. తమ Type-C ఛార్జర్ పనిచేస్తుందో లేదో తనిఖీ చేయడానికి.. మీ ఫోన్‌ను అన్‌లాక్ చేసి కనెక్ట్ చేయమని మిమ్మల్ని అడుగుతారు. తాము ఇప్పటికే తమ ఫోన్‌లో ప్రయత్నించామని, పనిచేయలేదని చెప్పి మిమ్మల్ని నమ్మించే ప్రయత్నం చేస్తారు. వాళ్ల మాటలు నమ్మి మీరు మీ ఫోన్‌ను అన్‌లాక్ చేసి, వారి పరికరానికి కనెక్ట్ చేసిన వెంటనే.. మీ డేటా లైన్‌కు పూర్తి యాక్సెస్‌ను ఇచ్చినట్లే అవుతుంది. ఆ నకిలీ పవర్ బ్యాంక్ లేదా ఛార్జింగ్ పోర్ట్ వెంటనే మీ ఫైళ్లను – ఫోటోలు, వీడియోలు, మెసేజ్‌లు, డాక్యుమెంట్లు, యాప్ డేటా వంటి వాటిని మీకు తెలియకుండానే క్లోనింగ్ చేయడం ప్రారంభిస్తుంది. దొంగిలించిన ఈ సమాచారాన్ని తర్వాత బ్లాక్‌మెయిల్, ఆర్థిక మోసాలకు ఉపయోగించవచ్చు. ఫోన్ అన్‌లాక్ చేస్తేనే ఈ దాడి పనిచేస్తుంది. అందుకే మోసగాళ్లు అన్‌లాక్ చేయమని పట్టుబడతారని గుర్తుంచుకోండి.

జ్యూస్ జాకింగ్ నుంచి రక్షణ సూత్రాలు..

1. పబ్లిక్ ఛార్జింగ్‌కు దూరంగా ఉండండి
2. వ్యక్తిగత అడాప్టర్ మాత్రమే వాడండి
3. డేటా బ్లాకర్‌లు ఫోన్లలో ఉంచుకోండి
4. ఫోన్ అన్ లాక్ కానంత వరకు డేటా బదిలీని నిరోధించే సెట్టింగ్‌లను ఎనేబుల్ చేయండి
5. ఎక్కడికైనా వెళ్లేటప్పుడు మీ సొంత పవర్ బ్యాంక్ వెంట తీసుకెళ్లి దానిని మాత్రమే వాడండి.