అంతరిక్షంలో హోటల్.. అదిరిపోయే సౌలతులు

అంతరిక్షంలో హోటల్.. అదిరిపోయే సౌలతులు

అంతరిక్షంలోనూ హోటల్ అందుబాటులోకి రానుంది. అదీ అత్యాధునిక సౌలతులతో ఉండనుంది. ఇక ఎంచక్కా.. అంతరిక్షంలోకి వెళ్లి, అక్కడా గడపొచ్చు. ఆర్బిటల్ అసెంబ్లీ కార్పొరేషన్ (ఓఏఎస్) అనే సంస్థ ఈ స్పేస్ హోటల్ ను నిర్మించనున్నట్లు ప్రకటించింది. దీనికి ‘‘వాయేజర్ స్టేషన్” అనే పేరు పెట్టింది. 2025లో హోటల్ నిర్మాణం చేపట్టి, 2027 వరకు పూర్తి చేస్తామని తెలిపింది. అంతా అనుకున్నట్టు జరిగి నిర్మాణం పూర్తయితే, ఇది ప్రపంచంలోనే మొదటి స్పేస్ హోటల్ కానుంది.

ఎట్లుంటది.. ఏముంటయ్? 

ఈ స్పేస్ హోటల్ లో మన భూమి మీదున్న స్టార్ హోటళ్లలో మాదిరి అత్యాధునిక సౌలతులు ఉండనున్నాయి. రూమ్స్, సినిమా థియేటర్లు, బార్లు, హెల్త్ స్పాలు, జిమ్ లు, రెస్టారెంట్స్,  సిబ్బంది ఉండేందుకు క్వార్టర్లు తదితరాలు ఉంటాయి. పెద్ద పెద్ద క్రూయిజ్ లలో ఉండే అన్ని రకాల సేవలు.. ఇక్కడ అందుబాటులోకి వస్తాయి. ఇందులో మొత్తం 400 మందికి ఆతిథ్యం ఇవ్వొచ్చు. ఈ హోటల్ ఒక జెయింట్ వీల్ లాగా ఉంటుంది. ఇందులో మొత్తం 24 మాడ్యూల్స్ ఉంటాయి. కంపెనీ ఈ మాడ్యూల్స్ ను అమ్మనుంది. నాసా లాంటి సంస్థలు, ప్రభుత్వాలు, ప్రైవేట్ కంపెనీలు వీటిని కొనుక్కోవచ్చు. అయితే దీని నిర్మాణానికి అయ్యే ఖర్చు, మాడ్యూల్స్ ను ఎంతకు అమ్మనుందనే విషయాలను ఓఏఎస్ వెల్లడించలేదు.

వాయేజర్ ఒక రొటేటింగ్ స్పేస్ స్టేషన్. దీని రొటేషన్ రేటును మార్చడం ద్వారా కృత్రిమ గురుత్వాకర్షణ శక్తి ఏర్పడుతుంది. ఈ ఆర్టిఫిషియల్ గ్రావిటీ మనుషులు ఎక్కువ రోజులు అంతరిక్షంలో ఉండేందుకు ఉపయోగపడుతుంది. స్పేస్‌‌లో జీరో గ్రావిటీ ఉంటుంది. ఈ స్పేస్ హోటల్‌‌లో కూడా జీరో గ్రావిటీ ఉంటే.. అక్కడికి వెళ్లేవారు ఎక్కువ సమయం గడపలేరు. అందుకే ఇందులో చంద్రుడి ఉపరితలంపై ఉండేంత గ్రావిటీని కృత్రిమంగా సృష్టిస్తారు. దీనికోసం స్పేస్ స్టేషన్ ను రొటేషన్ చేస్తారు. ఇది కేవలం 90 నిమిషాల్లోనే భూమి చుట్టూ తిరుగుతు౦ది. గేట్ వే ఫౌండేషన్ కు ‘వాయేజర్ స్టేషన్’ ఐడియా 2012లో వచ్చింది. దాన్ని సాకారం చేసేందుకు 2018లో ఓఏసీని ఏర్పాటు చేసింది. ఈ స్పేస్ హోటల్ నిర్మాణం.. మరో పారిశ్రామిక విప్లవం అవుతుందని గేట్ వే ఫౌండేషన్ ఫౌండర్ జాన్ బ్లింకో అన్నారు.