ఆడపిల్ల పుట్టిందని వదిలేసిన తల్లి.. గాంధీలో శిశువు మృతి

ఆడపిల్ల పుట్టిందని వదిలేసిన తల్లి.. గాంధీలో శిశువు మృతి

పద్మారావు నగర్, వెలుగు : ఆడపిల్ల.. ఆపై అనారోగ్యంతో పుట్టడంతో ఓ కన్నతల్లి తన బిడ్డను దవాఖానలోనే వదిలిపెట్టి వెళ్లింది. తక్కువ బరువుతో పుట్టిన ఆ శిశువు అనారోగ్యంతో రెండు రోజుల తర్వాత చికిత్స పొందుతూ చనిపోయింది. హైదరాబాద్ లోని గాంధీ దవాఖానలో ఈ ఘటన జరిగింది. మేడ్చల్ జిల్లా డబీల్ పూర్ కు చెందిన రేఖ అనే మహిళను ప్రసవం కోసం ఆమె భర్త అలోక్ సాహు ఈ నెల 6న మధ్యాహ్నం గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ చేశాడు. అదేరోజు సాయంత్రం రేఖ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. బిడ్డ 650 గ్రాముల బరువు మాత్రమే ఉండటంతోపాటు పలు అనారోగ్య సమస్యలతో పుట్టింది. వెంటనే శిశువును డాక్టర్లు ఎన్ఐసీయూలో పెట్టి వెంటిలేటర్ పై ట్రీట్మెంట్ అందించారు.

ఆడపిల్ల పుట్టడం, ఆరోగ్యం కూడా సరిగా లేకపోవడంతో బిడ్డను వదిలేసి భార్యాభర్తలిద్దరూ డాక్టర్లకు చెప్పకుండా ఆసుపత్రి నుంచి వెళ్ళిపోయారు. రెండు రోజుల ట్రీట్మెంట్ తర్వాత పాప ఈ నెల 8న సాయంత్రం చనిపోయింది. పాప చనిపోయిన తర్వాత పేరెంట్స్ కు డాక్టర్లు చాలాసార్లు ఫోన్ చేసినా ఫలితంలేకపోయింది. చివరికి పాప డెడ్ బాడీని మార్చురీలో భద్రపరిచారు. ఈ ఘటనపై గాంధీ ఆస్పత్రి ఆర్ఎంఓ రాతపూర్వకంగా చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చిలకలగూడ ఎస్ఐ కిషోర్ వెల్లడించారు.

శిశువు తల్లి రేఖపై 317 సెక్షన్​కింద కేసు పెట్టామన్నారు. అనతరం డబీల్ పూర్ కు వెళ్ళి విచారణ చేయగా, వారు ఇచ్చిన అడ్రస్ లో రేఖ అనే పేరు మీద ఎవరూ లేరని తెలిసిందన్నారు. పాప తల్లిదండ్రుల కోసం వెతుకుతున్నామని తెలిపారు.