నాగర్ కర్నూలు, వెలుగు: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు అప్రోచ్ కెనాల్ పక్కన ఫుల్ సెక్యూరిటీ నడుమ తయారు చేస్తున్న భారీ జెట్టిని మేఘా ఇంజనీరింగ్ కంపెనీ గుట్టుగా శనివారం ఏపీ బార్డర్‌కు తరలించింది. మన పాలమూరు-–రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో ఎత్తిపోసిన మట్టి, కంకర, రాళ్లను మనను ముంచే ఏపీ అక్రమ ప్రాజెక్టు రాయలసీమ లిఫ్ట్‌కు తరలించేందుకు మేఘా కంపెనీ ప్లాన్వేసిందని, ఇందులో భాగంగానే జెట్టిని తయారు చేస్తోందంటూ ‘వెలుగు’లో ‘మేఘా చీటింగ్’ పేరిట కథనం పబ్లిష్ అయిన విషయం తెలిసిందే. మేఘా తీరుపై దక్షిణ తెలంగాణ రైతులు మండిపడ్డారు. దక్షిణ తెలంగాణను ఎడారి చేసే ఏపీ ప్రాజెక్టులను కట్టడమే కాకుండా ఇక్కడి మట్టి, కంకర, రాళ్లను ఎట్లా తరలిస్తారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో హడావుడిగా కంపెనీ ప్రతినిధులు జెట్టిని సేఫ్‌గా అవతలి గడ్డకు చేర్చారు. ప్రస్తుతం ఏపీలోని కర్నూల్ జిల్లా జానాగుడెం దగ్గర రెండు జెట్టీలను తయారు చేస్తున్నట్లు సమాచారం.
