బీరేన్ సింగ్ సర్కార్ కు షాక్.. ప్రభుత్వం నుంచి తప్పుకున్న కుకీ పీపుల్స్ అలయెన్స్

బీరేన్ సింగ్ సర్కార్ కు షాక్.. ప్రభుత్వం నుంచి తప్పుకున్న కుకీ పీపుల్స్ అలయెన్స్

ఇంఫాల్ : మణిపూర్‌ హింసాత్మక ఘటనల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎన్‌.బీరేన్ సింగ్ సారథ్యంలోని సర్కార్‌కు షాక్ తగిలింది. రాష్ర్ట ప్రభుత్వం నుంచి తప్పుకున్నట్లు కుకీ పీపుల్స్ అలయెన్స్ (KPA) ప్రకటించింది. ఎన్డీయే భాగస్వామ్యం నుంచి వైదొలగుతున్నట్టు కేపీఏ ప్రకటించింది. 

మణిపూర్ అసెంబ్లీలో కుకీ పీపుల్స్ అలయెన్స్‌కు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. 160 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన హింసాత్మక ఘటనలను అదుపు చేయడంలో ఎన్. బీరేన్ సింగ్ ప్రభుత్వం విఫలమైందంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో కేపీఏ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. 

ఎన్డీయే ప్రభుత్వం నుంచి తెగదెంపులు చేసుకోవాలని పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు కేపీఏ అధ్యక్షులు టాంగ్‌మాంగ్ హోకిప్ మణిపూర్ గవర్నర్‌కు లేఖ ద్వారా తెలియజేశారు. మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత బీరేన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు కొనసాగించడం సాధ్యం కాదని తమ పార్టీ నిర్ణయించిందని పేర్కొన్నారు. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నామని, వెంటనే ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని గవర్నర్‌ కు రాసిన లేఖలో టాంగ్‌మాంగ్ తెలియజేశారు. 

మణిపూర్‌ అసెంబ్లీలో 60 స్థానాలు ఉన్నాయి. బీజేపీకి 32 మంది సభ్యుల బలం ఉంది. ఐదుగురు ఎన్‌పీఎఫ్ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు, ఇద్దరు కేపీఏ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. కేపీఏ తాజా నిర్ణయంతో ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు బీరేన్ ప్రభుత్వం కోల్పోయింది.