
మల్లేశం, 8 ఎ.ఎమ్ మెట్రో చిత్రాల తర్వాత దర్శకుడు రాజ్ రాచకొండ తెరకెక్కించిన చిత్రం ‘23’. తేజ, తన్మయి ప్రధానపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని స్టూడియో 99 సంస్థ నిర్మించింది. స్పిరిట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ చేస్తోంది. ఈనెల 16న సినిమా విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు రాజ్ మాట్లాడుతూ ‘చిలకలూరి పేట బస్సు దహనం, చుండూరు ఊచకోత, జూబ్లీ హిల్స్ కారు బాంబు ఘటనల నేపథ్యంలో దీన్ని తెరకెక్కించా. ఇందులో మల్టిపుల్ థీమ్స్ ఉన్నాయి. అలాగే లవ్ స్టోరీ కూడా ఉంది.
ఒక ఘటన తర్వాత మరొకటి చూపిస్తూ ఒకరికి తక్కువ శిక్ష.. మరొకరికి ఎక్కువ శిక్ష ఎందుకు పడింది అనేది చర్చించడమే మూవీ మెయిన్ కాన్సెప్ట్. ఈ ఘటనలు జరిగి చాలా కాలమైనా పరిస్థితులు ఏమీ మారలేదు. ఒక తప్పు జరిగితే ఒక వ్యక్తికి 24 గంటల్లో బెయిల్ వస్తోంది. అదే తప్పు చేసిన మరొకరికి రెండేళ్ళకి కూడా బెయిల్ రాదు. అందుకే ఈ సమస్య ఇప్పటికీ రిలెవంట్‌గానే ఉంది.
నిజానికి ఇది చాలా కష్టమైన, సున్నితమైన అంశం. ఇలాంటివి తీయడం వెరీ చాలెంజింగ్. ఎక్కువ లొకేషన్స్, టైం ఫ్రేమ్స్ లో రాయడం.. దాన్ని అందరికీ అర్థమయ్యేలా తెరకెక్కించడం చాలా కష్టం. ప్రేక్షకులు కూడా ఏదో సరదాగా కాకుండా ఏకాగ్రతతో చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. చట్టం అందరికీ సమానంగా వర్తించాలి.
కానీ అలా ఎందుకు జరగడం లేదని వ్యవస్థను ప్రశ్నించడమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశం. మా సినిమాను సెన్సార్ చేయడంలోనూ ఇలాంటి వ్యత్యాసమే కనిపించింది. మొత్తం 17 కట్స్ ఇచ్చారు. అయితే ఇతర చిత్రాల్లో మాత్రం అలాంటి సీన్స్, పదాలను కనీసం పట్టించుకోలేదు. ఈ తరహా ప్రశ్నలను రేకిత్తించే సినిమానే ఇది” అని చెప్పారు.