కాళేశ్వరం కెనాల్‌‌‌‌ లైనింగ్ కూలింది

కాళేశ్వరం కెనాల్‌‌‌‌ లైనింగ్ కూలింది

పలు చోట్ల పగుళ్లు

నాసిరకం పనులే కారణం

మెయింటనెన్స్ చూస్తున్న మేఘా కంపెనీ

రిపేర్లు చేపిస్తున్న ఆఫీసర్లు

గతంలో కూలిన పంప్ హౌస్

గోడ, బ్యారేజీ గేట్ల వద్ద లీకేజీలు

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి/ కాటారం, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌లో భాగంగా కన్నెపల్లి నుంచి అన్నారం వరకు గోదావరి నీళ్లను తీసుకెళ్లే మెయిన్​ కెనాల్‌ సిమెంట్‌ కాంక్రీట్ లైనింగ్ ఓ చోట కుప్పకూలింది. పలు చోట్ల పగుళ్లు ఏర్పడింది. ప్రాజెక్ట్‌‌‌‌  స్టార్టయిన ఏడాదిన్నరకే ఇలా కూలిపోవడం, పగుళ్లు ఏర్పడటం క్వాలిటీ లోపాలను బయటపెడుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలంలో కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి 13.6 కిలోమీటర్ల పొడవున ఈ కెనాల్​ను నిర్మించారు. 6వ కిలోమీటర్ వద్ద పైనుంచి మట్టి కూలి.. రోడ్డు, సిమెంట్‌ కాంక్రీట్‌ ధ్వంసమైంది. 6.7 కిలోమీటర్ల వద్ద 8.5 మీటర్ల పొడవు 7 మీటర్ల వెడల్పుతో పూర్తిగా సిమెంట్‌ కాంక్రీట్‌ కొట్టుకుపోయింది. లూజ్‌ సాయిల్‌ ఉన్న చోట నాసిరకం పనులు చేపట్టడం వల్లే కెనాల్‌ దెబ్బతిన్నదని స్థానికులు చెబుతున్నారు.

రూ. 600 కోట్ల పనులు

కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌ లింక్‌‌ –1 పనుల్లో భాగంగా కన్నెపల్లి వద్ద పంప్‌‌‌‌హౌస్ నిర్మాణంతోపాటు కన్నెపల్లి నుంచి అన్నారం వరకు కెనాల్‌ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం గతంలో రూ. 2,826 కోట్లు కేటాయించింది. టెండర్‌‌‌‌ దక్కించుకున్న మేఘా కంపెనీ… 13.6 కి.మీ దూరం కెనాల్‌ నిర్మాణ పనులను, కెనాల్‌ ను ఆనుకొని బీటీ రోడ్డును నిర్మించే రూ. 600 కోట్ల పనులను సబ్‌ లీజ్‌ పై మరో సంస్థకు అప్పగించిం ది. 2017 డిసెంబర్‌‌‌‌లో పనులు మొదలుపెట్టారు. 2019 జూన్‌ 21న ప్రాజెక్ట్‌‌‌‌  ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడితో హడావుడిగా పూర్తిచేశారు.

గతంలోనూ..

రూ. లక్ష కోట్లతో చేపట్టిన కాళేశ్వరం భారీ ప్రాజెక్ట్‌‌‌‌ పనుల్లో నాణ్యతా లోపాలు బయటపడుతూనే ఉన్నాయి. కన్నెపల్లిలో మోటార్లు ప్రారంభించిన 6 నెలలకే భారీ వర్షాల వల్ల ఏకంగా పంప్‌‌‌‌హౌస్ గోడ కూలి మోటార్ల వద్దకు వరద చొచ్చుకొచ్చింది. దీనిని ఎలాగోలా సరిచేశారు. ఆ తర్వాత మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల గేట్ల వద్ద లీకేజీలు కనిపించాయి. ఇప్పుడేమో కెనాల్‌ సిమెంట్‌ కాంక్రీట్‌ కొట్టుకుపోయింది. ఇవన్నీ చూస్తుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌ పనులు ఎంత నాణ్యతా లోపంతో చేపట్టారో అర్థం చేసుకోవచ్చని రైతులు, ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శిస్తున్నారు.

రిపేర్లు చేపడుతున్న ఆఫీసర్లు

గ్రావిటీ కెనాల్ సిమెంట్‌ కాంక్రీట్‌ వర్షా నికి కూలిపోవడంతో అధికార యంత్రాంగం వెంటనే రంగంలోకి దిగింది. కొట్టుకుపోయిన చోట రిపేర్లు చేపట్టాలని కాంట్రాక్ట్‌‌‌‌ సంస్థను ఆదేశించింది. కన్నెపల్లి పంప్ హౌస్ , గ్రావిటీ కెనాల్‌ మెయింటనెన్స్‌‌‌‌ 2022 వరకు మేఘా కంపెనీపైనే ఉంది. దీంతో 8.5 మీటర్ల పొడవు 7 మీటర్ల వెడల్పు తో ఏర్పడిన గొయ్యి ని యంత్రాల సాయంతో పూడ్చుతున్నా రు. భారీ ప్రొక్లయినర్, రెండు డోజర్లతో దాన్ని రిపేర్ చేసే పనులు చేపట్టారు. నలుగురు సుతారులు, 10 మంది వర్కర్లు అక్కడే ఉండి పని చేస్తున్నారు.

ఎందుకిట్ల జరిగింది..?

కన్నెపల్లి నుంచి అన్నారం వరకు 13.6 కి.మీ దూరం గ్రావిటీ కెనాల్‌ నిర్మించారు. మొత్తం అడవిలోనే పనులు జరిగాయి. సుమారు 70 మీటర్ల వెడల్పు, 30 మీటర్ల లోతు మట్టి తవ్వుకుంటూ పోయి లెవల్‌ చేస్తూ సిమెంట్‌ కాంక్రీట్‌ వేసి కాల్వ నిర్మాణం చేపట్టాలి. నేల స్వభావాన్ని బట్టి అంటే గట్టి మట్టి, లూజ్‌ మట్టి, రాళ్లతో కూడిన నేల.. ఇలా రకరకాల స్థా యిలలో పనులు జరపాల్సి ఉండగా సబ్‌ లీజ్‌ పై పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌‌‌‌ లూజ్‌ మట్టి వచ్చిన చోట కూడా నాణ్యత పాటించకపోవడంతో వర్షాలకు సిమెంట్‌ కాంక్రీట్‌ కొట్టు కుపోయినట్లు ఎక్స్​పర్ట్స్ చెబుతున్నారు. లూజ్‌ మట్టి ఉన్న మరి కొన్ని చోట్ల కూడా కెనాల్‌ పై సిమెంట్‌ కాంక్రీట్‌ కు పగుళ్లు కన్పిస్తున్నాయని వారు అంటున్నారు. అక్కడ కూడా రిపేర్లు జరపాలని సూచిస్తున్నారు.