ఎవరొచ్చినా మా  బతుకులు  మారలె

ఎవరొచ్చినా మా  బతుకులు  మారలె
  • కేటీఆర్​ చెప్పి ఐదేండ్లాయె..లెదర్​ పార్క్​ ఏమాయె?
  • స్టేషన్​ఘన్​పూర్​లో మెగా లెదర్​ పార్క్ పెడ్తామని అసెంబ్లీలో మంత్రి హామీ
  • ​అనుబంధంగా 9 మినీ లెదర్ ​పార్కులూ లింక్​ చేస్తమని వెల్లడి
  • ఇప్పటికీ అతీగతీ లేదు.. 20 వేల మందికి జాబుల్లేవు
  • ఇన్నేండ్లయినా లెదర్​ పార్క్​ కోసం భూసేకరణ కూడా చేయలే
  • జాబ్​ల కోసం చెన్నైలో ట్రైనింగ్ తీసుకొని రోడ్డున పడ్డ 2 వేల మంది
  • ఎవరొచ్చినా తమ బతుకులు మారలేదని ట్రైనింగ్ ​పొందినోళ్ల ఆవేదన

రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకుంటున్న ఈయన పేరు.. ఈశ్వరయ్య. 2003లో టీడీపీ సర్కారు స్టేషన్​ఘన్​పూర్​కు మినీ లెదర్​ పార్క్​ మంజూరు చేసింది. పార్క్​లో ఉపాధి కల్పిస్తామని చెప్పి ఈశ్వరయ్యతోపాటు చాలా మందికి లిడ్​క్యాప్​ ఆధ్వర్యంలో చెప్పులు, షూస్, బ్యాగుల తయారీపై చెన్నైలో ట్రైనింగ్​ ఇప్పించారు. ఇది జరిగి ఏండ్లు గడిచినా మినీ లెదర్​పార్కు ఏర్పాటుకాలేదు. తెలంగాణ వచ్చాక మంత్రి కేటీఆర్​ అసెంబ్లీలో మాట్లాడుతూ.. మెగా లెదర్​పార్కు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీంతో ఈశ్వరయ్య సహా ట్రైనింగ్​ పొందినోళ్లంతా సంబురపడ్డారు. కానీ, ఇప్పటికీ మెగా లెదర్​ పార్క్​ కోసం ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంతో ఎప్పటిలెక్కనే స్టేషన్​ ఘన్​పూర్​ బస్టాండ్​ పక్కన ఈశ్వరయ్య చెప్పులు కుట్టుకుంటున్నాడు. 

మెగా లెదర్​ పార్క్​ ముచ్చట మూలకు పడ్డది. మంత్రి కేటీఆర్​ హామీ ఇచ్చి ఐదేండ్లయితున్నా అతీగతీ లేదు. 2018  డిసెంబర్​ కల్లా రూ. 270 కోట్ల పెట్టుబడులతో స్టేషన్​ ఘన్​పూర్​లో లెదర్​పార్క్​ పెట్టి, 20 వేల మందికి ఉపాధి చూపెడ్తమని అసెంబ్లీ సాక్షిగా 2016లో ఆయన ప్రకటించారు. మూతపడ్డ మినీ లెదర్​ పార్కులను కూడా తెరిపిస్తామన్నారు. సర్కారు నుంచి వచ్చిన ఆదేశాలతో అప్పట్లో ఆఫీసర్లు స్టేషన్​ఘన్​పూర్​లో భూసేకరణ పేరిట కొద్దిరోజులు హడావుడి చేశారు. కానీ.. ఇప్పటికీ ఇటు మినీ లెదర్​ పార్కులు లేవు.. అటు మెగా లెదర్​ పార్క్​ లేదు.


‘స్టేషన్ ఘన్​పూర్​లో మెగా లెదర్ పార్క్ ఏర్పాటు చేస్తం. ఇందుకోసం117 ఎకరాల స్థలం సేకరించినం. సుమారు 270 కోట్ల పెట్టుబడులు అవసరముంటయ్. ఇందులో కేంద్రం నుంచి రూ.105 కోట్లను ఆశిస్తూ డీపీఆర్ సబ్మిట్​చేసినం. గతంలో రాష్ర్టంలో 9 మినీ లెదర్ పార్క్ లు ఏర్పాటు చేస్తే అవి ఆశించినంత ఉపయోగపడలే. కొత్తగా నిర్మించే మెగా లెదర్ పార్క్ కు ఈ 9 మినీ పార్క్ లను లింక్​ చేస్తం. మెగా లెదర్​  పార్క్ ఏర్పాటుతో 20 వేల మందికి ఉపాధి వస్తది. రాబోయే రెండేళ్లలో వీటన్నింటినీ వినియోగంలోకి తెస్తం’
                                                                                                                                                                       –2016 డిసెంబర్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో మంత్రి కేటీఆర్
జనగామ, వెలుగు: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్​లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న మెగా లెదర్ పార్క్​కాగితాలకే పరిమితమైంది. 2018 డిసెంబర్ కల్లా రూ. 270 కోట్ల పెట్టుబడితో లెదర్ పార్క్​పెట్టి 20 వేల మందికి ఉపాధి చూపిస్తామని అసెంబ్లీ సాక్షిగా మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చి ఐదేళ్లయినా అతీగతీ లేదు. ఇదే స్టేషన్​ఘన్ పూర్ నియోజకవర్గం నుంచి మొదట తాటికొండ రాజయ్య, తర్వాత కడియం శ్రీహరి డిప్యూటీ సీఎంలుగా పనిచేసినా లెదర్​పార్క్​కు సర్కారు నుంచి ఫండ్స్ తెచ్చుకోలేకపోయారు.  పైగా మెగా లెదర్​పార్క్​కు అనుబంధంగా జిల్లాల్లో మూతపడిన 9 మినీ లెదర్​పార్క్​లనూ పునరుద్ధరిస్తామని కేటీఆర్​చెప్పారు. గతంలోనే లిడ్ క్యాప్ (లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్​మెంట్ కార్పొరేషన్) ఆధ్వర్యంలో ఆఫీసర్లు ఆయా జిల్లాల్లోని 2 వేల మంది నిరుద్యోగ యువతను సెలెక్ట్ చేసి చెన్నైలో ట్రైనింగ్ ఇప్పించారు. కొన్నిచోట్ల మినీ లెదర్​పార్క్​లు ఓపెన్​చేసి వీళ్లలో కొందరిని ఉద్యోగాల్లోకి తీసుకున్నా పాలకుల నిర్లక్ష్యం వల్ల అన్నీ మూతపడ్డాయి. దీంతో నాడు ట్రైనింగ్ తీసుకున్నవాళ్లంతా ఇప్పుడు రోడ్ల పక్కన చెప్పులు కుట్టుకుంటూ భారంగా బతుకులు వెల్లదీస్తున్నారు.
ఘన్​పూర్​లో నేటికీ భూసేకరణే కాలే 
స్టేషన్ ఘన్​పూర్​లో మెగా లెదర్ పార్క్​ను ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్​అసెంబ్లీలో ప్రకటన చేశారు. సర్కారు నుంచి వచ్చిన ఆదేశాలతో ఆఫీసర్లు స్టేషన్​ఘన్​పూర్​లో భూ సేకరణ పేరిట కొద్దిరోజులు హడావుడి చేశారు. గతంలో మినీ లెదర్ పార్క్​కోసం ప్రతిపాదించిన 117 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండటంతో దాంట్లో మెగా లెదర్​ పార్క్ ఏర్పాటు చేయొచ్చని సర్కారుకు ప్రపోజల్స్ పంపారు. కానీ ఏపీలో ఉన్నట్టు లెదర్ పార్క్ ఏర్పాటు చేయాలంటే ఈ భూమి ఏ మూలకూ చాలదని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అదనంగా మరో 400 ఎకరాలు సేకరించాల్సి ఉన్నా ఆ దిశగా ప్రభుత్వం ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. కేంద్రం నుంచి రూ.105 కోట్ల కోసం డీపీఆర్ ​పంపించామని మంత్రి కేటీఆర్​చెప్పారు. ఈ విషయమై నేటివరకు కేంద్రాన్ని ఫాలోఅప్ చేయలేదు. వాస్తవానికి తెలంగాణకు మెగా లెదర్​పార్క్​ఇస్తామని కేంద్రం ఎక్కడా చెప్పలేదు. కానీ రాష్ట్ర సర్కారు మాత్రం కేంద్రంపై ఓ రాయేసి మెగా, మినీ లెదర్​ పార్క్​లను పక్కన పడేసింది. 
ఎక్కడియక్కడ్నే
రాష్ట్రంలో లెదర్ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. ఏటా స్టేట్ వైడ్ వేల కోట్ల బిజినెస్ జరుగుతున్నా లోకల్​గా వీటి ఉత్పత్తి లేక నార్త్ ఇండియా, ఇతర దేశాలనుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దీంతో మన దగ్గరే వీటిని ఉత్పత్తి చేస్తే స్థానికులకు ఉపాధి చూపడంతో పాటు తక్కువ రేట్లకు మన ప్రజలకు అందించాలని గత ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఈ క్రమంలోనే నాగర్​ కర్నూల్​జిల్లా జినుకుంట, ఖమ్మం జిల్లా మల్లెమడుగు, జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్, మంచిర్యాల జిల్లా మందమర్రి, సిద్దిపేట జిల్లా దుద్దెడ, నిజామాబాద్ జిల్లా ఆర్మూరు, నల్గొండ జిల్లా దండేపల్లి, కరీంనగర్​ జిల్లా రుక్మాపూర్, మహబూబ్​నగర్​ జిల్లా పోలేపల్లిలో 9 మినీ లెదర్ పార్క్​ల ఏర్పాటుకు నిర్ణయించాయి. కానీ ప్రభుత్వాల నిర్లక్ష్యంతో లెదర్​పార్క్​లు మూతపడ్డాయి. ఉద్యోగులు రోడ్డునపడ్డారు.
జిల్లాల్లో మినీ లెదర్ పార్క్​ల పరిస్థితి ఇదీ 
2004లో అప్పటి మహబూబ్​నగర్​జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి, బల్మూర్ మండలం జినుకుంటలో అప్పటి ప్రభుత్వం మినీ లెదర్​పార్క్​లు ఏర్పాటు చేసింది. 2004లో జినుకుంటలోని 25 ఎకరాల్లో లెదర్​పార్క్​బిల్డింగ్​,అందులో రూ.2 కోట్ల విలువైన మిషన్లు ఏర్పాటు చేసి అప్పటి క్రీడా శాఖ మంత్రి  పోతుగంటి రాములు ప్రారంభించారు. 200 మంది నిరుద్యోగ యువతను సెలెక్ట్ చేసి చెన్నై లో  ట్రైనింగ్ ఇప్పించారు. అది కొన్నిరోజులకే మూతపడగా 2008లో అప్పటి ఎమ్మెల్యే వంశీకృష్ణ రెండోసారి ప్రారంభించారు. తర్వాత 6 నెలలు తిరగకుండానే మూతపడగా నిరుద్యోగుల నిరాహార దీక్షలతో 2012లో ఎమ్మెల్యే పి. రాములు ఆధ్వర్యంలో మూడోసారి ప్రారంభించారు. అయినా కొన్నినెలలకే బంద్ పెట్టారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో పాలవాగు ఒడ్డున 25 ఎకరాల్లో 2007 ఫిబ్రవరి 1న అప్పటి కార్మిక శాఖ మంత్రి గడ్డం వినోద్ లెదర్ పార్క్ కు శంకుస్థాపన చేశారు. రెండేళ్ల తర్వాత 2009 ఫిబ్రవరి 23న అప్పటి సీఎం వైఎస్ ప్రారంభించారు. 300 మందికి ట్రైనింగ్ ఇచ్చారు. కేవలం షెడ్డు నిర్మించి వదిలేశారు.

కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామంలో లెదర్ పార్క్ కోసం దాదాపు 134 ఎకరాలు సేకరించారు. కానీ లెదర్​ పార్క్​ ఏర్పాటు చేయలేదు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్​లో 1999లో శంకుస్థాపన చేసిన లెదర్ పార్క్​అసంపూర్తిగా మిగిలింది. 28.02 ఎకరాల్లో ప్రొడక్షన్ యూనిట్ నిర్మించినా పరికరాలు రాలేదు. ఇటీవల ఆర్మూర్ లెదర్ పార్క్ కు కేంద్రం రూ. 53 కోట్లు కేటాయించింది. రాష్ట్రం తనవంతుగా 20 శాతం ఫండ్స్​ ఇస్తే పార్క్ స్టార్టయ్యే అవకాశమున్నా టీఆర్ఎస్​సర్కారు పట్టించుకోవట్లేదని విమర్శలున్నాయి.  సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడలో అప్పటి మంత్రి చెరుకు ముత్యంరెడ్డి చొరవతో 2002లో లెదర్​పార్క్ ఏర్పాటైంది. అక్కడ ఎస్సీ యువతకు శిక్షణ ఇచ్చి దాదాపు దశాబ్ద కాలం పాటు చెప్పులు తయారు చేశారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో మూతపడింది. 2016 లో సిద్దిపేట జిల్లా ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ​లెదర్ పార్క్ స్థలం కలెక్టరేట్​కు కేటాయించారు. లెదర్ పార్కు భవనాన్ని కూల్చి కలెక్టర్ కార్యాలయం నిర్మించారు.

18 ఏండ్లయినా లెదర్​ పార్క్​ ఏర్పాటు చేస్తలేరు
2003లో చెప్పులు కుట్టేందుకు చెన్నైలో మాకు ట్రైనింగ్​ ఇచ్చిన్రు. మొత్తం 200 మందిమి 2 నెలలు శిక్షణ తీసుకున్నం. రాగానే లెదర్​ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇస్తమన్నరు. 18 ఏండ్లు అయినా ఆర్మూర్​లో లెదర్​ పార్కు ఏర్పాటు చేయలేదు. మాకు ఉద్యోగాలు ఇయ్యలేదు. చేసేది లేక 30 ఏండ్ల సంది రోడ్డు పక్కన ఇలా చెప్పులు కుట్టుకొని బతుకుతున్న. ఎవరొచ్చినా బతుకులు మారుతలెవ్వు.                                                                                                                                                                     - జె. సత్యనారాయణ, ఆర్మూర్

కూలికి పోతన్న
స్టేషన్ ఘన్ పూర్ లో మెగా లెదర్ పార్క్ ఏర్పాటు హామీని టీఆర్​ఎస్ సర్కారు నిలబెట్టుకోవాలె. 2016లో మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. కానీ పట్టించుకుంటలేరు. టీడీపీ హయాంలో లెదర్ ఉత్పత్తుల తయారీలో చెన్నై లో మాస్టర్ ట్రైనర్ గా శిక్షణ తీసుకున్న. తర్వాత పార్కు ఏర్పాటును పట్టించుకోక అందరం రోడ్డునపడ్డం. ఉపాధి లేక కొన్నేండ్లుగా నేను కూలి పనులకు పోతున్న.                                                                                                 - గాదె కుమార్, లెదర్ పార్క్ మాస్టర్ ట్రైనర్, నమిలిగొండ, స్టేషన్ ఘన్​పూర్ మండలం