నదీ జలాల మళ్లింపులోనూ తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగేలా కేంద్రం అడుగులు వేస్తున్న తీరుపై ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో ప్రతిపాదించిన ఇచ్చంపల్లి-–కావేరి లింకును పక్కనబెట్టి, ఏపీకి లబ్ధి చేకూర్చేలా పోలవరం-, నల్లమలసాగర్- ,బనకచర్ల మీదుగా తమిళనాడుకు నీటిని తరలించేలా కేంద్రం కసరత్తు చేస్తోంది.
ఈ ప్రాజెక్టు ఖర్చును పూర్తిగా కేంద్రమే భరించనుండటంతో ఏపీకి పైసా ఖర్చు లేకుండా పని పూర్తవుతుంది. మరోవైపు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఎత్తు, నీటి లభ్యతపై చర్చించేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రికి తెలంగాణ సీఎం లేఖ రాసి నెల రోజులు గడుస్తున్నా అక్కడి నుంచి స్పందన లేదు.
పొరుగు రాష్ట్రాలు సహకరించుకోవాలని ప్రధాని మోదీ హితబోధలు చేస్తున్నా, మహారాష్ట్రలోని తమ కూటమి ప్రభుత్వాన్ని ఒప్పించడంలో కేంద్రం ఎలాంటి చొరవ చూపకపోవడంపై రాష్ట్ర వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. దేవాదుల ప్రాజెక్టుకు ఏఐబీపీ కింద అందాల్సిన ఆర్థిక సాయం కూడా అందకపోవడాన్ని ఎత్తిచూపుతున్నాయి.
- పోలవరం ముంపునూ పట్టించుకుంటలే
పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలను కేంద్రం మాత్రం పెడచెవిన పెడ్తున్నది. ఆ ప్రాజెక్టును ఫుల్ లెవెల్ 45.72 మీటర్లతో నిర్మిస్తే.. ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ప్రభావంతో తెలంగాణ భూభాగంలోని భద్రాచలం సహా 36 గ్రామాలు మునిగిపోతాయని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తున్నది. కిన్నెరసాని, ముర్రేడు వాగు సహా 6 పెద్ద వాగులకు వరద ప్రభావం ఎక్కువగా ఉంది.. భద్రాచలం మునిగిపోయే ముప్పు ఎక్కువగా ఉన్నది. అంతేగాకుండా మణుగూరు భార జల కేంద్రంలాంటి వాటికి ముంపు ముప్పు ఉందని ఇప్పటికే తేలింది. దీనిపై జాయింట్ సర్వే చేయించాలని ఎప్పటి నుంచో మన ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నది. ఎన్నో మీటింగుల్లో ఈ డిమాండ్ వినిపించింది. అయితే ఏపీ మాత్రం ముందుకు రాలేదు.
ఈ క్రమంలోనే పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కృష్ణా గోదావరి బేసిన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సర్వే చేయించేందుకు సిద్ధమయ్యారు. కానీ అది ఇప్పటికే ముందుకు పడడం లేదు. ఇటీవలే పీపీఏ సీఈవో, ఏపీ అధికారులు, మన అధికారులు కలిసి అక్కడ క్షేత్ర స్థాయిలో పరిశీలన చేపట్టారు. మరి ఆ ముంపు సర్వే ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి.
ఇక ఏపీకి లాభం చేసేలా విభజన సమయంలో 7 మండలాలను ఏపీలో కేంద్రం విలీనం చేసింది. ఆ 7 మండలాల్లోకే శబరి నది వెళ్లిపోయింది. ఫలితంగా దాదాపు 150 టీఎంసీలకు పైగా జలాల్లో మన హక్కులు కోల్పోవాల్సి వచ్చింది. ఇటు లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టు కూడా ఏపీ భూభాగంలోకి వెళ్లిపోయింది. దీంతో 460 మెగావాట్ల కరెంటును కేంద్రం ఏపీకి అప్పనంగా కట్టబెట్టినట్టయింది.
