పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 20 నుంచి ప్రారంభం

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 20 నుంచి ప్రారంభం
  • పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 20 నుంచి ప్రారంభం
  • ఆగస్టు 11 వరకు సెషన్  
  • పాత బిల్డింగులో మొదలు.. కొత్త బిల్డింగులో ముగింపు! 
  • పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టే యోచనలో కేంద్రం 

న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 11 వరకు కొనసాగనున్నాయి. ఈ మేరకు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి శనివారం వెల్లడించారు. మొత్తం 23 రోజుల పాటు సెషన్ కొనసాగుతుందని, అందులో 17 రోజులు సమావేశాలు ఉంటాయని ఆయన తెలిపారు. సమావేశాల్లో చర్చలకు అన్ని పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈసారి పార్లమెంట్ సెషన్ పాత బిల్డింగులో ప్రారంభమై, కొత్త బిల్డింగులో ముగుస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

పార్లమెంట్ కొత్త బిల్డింగ్ ను మే 28న ప్రధాని మోదీ ప్రారంభించారు. కాగా, ఈసారి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడీవేడిగా సాగనున్నాయి. పలు కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టాలని మోదీ సర్కార్ భావిస్తున్నది. ఢిల్లీలో అధికారుల బదిలీలకు సంబంధించిన ఆర్డినెన్స్, ది నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్లుతో పాటు యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) బిల్లును కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది. ఇందులో ఢిల్లీ ఆర్డినెన్స్​కు సంబంధించి కేంద్రం, ఆప్ సర్కార్ మధ్య గొడవ జరుగుతోంది.

ఈ ఆర్డినెన్స్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కేజ్రీవాల్ సర్కార్.. దాన్ని పార్లమెంట్​లో అడ్డుకోవాలని ఇప్పటికే పలు ప్రతిపక్ష నేతలను కోరింది. ఇక యూసీసీని కొన్ని పార్టీలు సమర్థిస్తుండగా, మరికొన్ని వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి బీజేపీని ఓడించాలని, అందుకోసం ఒక్కటిగా ముందుకు వెళ్లాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. ఇప్పటికే పలుమార్లు సమావేశాలు కూడా నిర్వహించాయి. ఈ నేపథ్యంలో ఈసారి పార్లమెంట్ సమావేశాలు వాడీవేడిగా జరిగే అవకాశం ఉంది.