నేషనల్ మ్యూజియం లో 900 కోట్ల జాకబ్ డైమండ్

నేషనల్ మ్యూజియం లో 900 కోట్ల జాకబ్ డైమండ్

ఢిల్లీ: పెద్ద లాకరు లాంటి గది. లోపలికెళ్లగానే మొబైల్ నెట్ వర్క్ బంద్. మసకబారిన వెలుతురు. చుట్టూ ఎంతో విలువైన వస్తువులున్నా, మధ్యలో ఉన్న ఓ వజ్రం మాత్రమే అందరినీ ఆకర్షిస్తోంది. చూపుతిప్పుకోనివ్వని సౌందర్యంతో కట్టిపడేస్తోంది. అదే జాకబ్ డైమండ్. మన నిజాం రాజుల నగల్లో ఒకటి. దేశ రాజధానిలోని నేషనల్ మ్యూజియంలో ఉంది. దీనికి 12 మంది గార్డులు 24 గంటల పాటు కనురెప్ప వాల్చకుండా కాపలా కాస్తుంటారు. ప్రస్తుతం నేషనల్ మ్యూజియంలో ‘జ్యువెల్స్ ఆఫ్ ఇండియా: ది నిజాం జ్యువెల్లరీ కలెక్షన్’ పేరుతో ఎగ్జిబిషన్ జరుగుతోంది. దీనిలో నిజాం రాజులకు చెందిన 173 అతి విలువైన ఆభరణాలను ప్రదర్శనకు ఉంచారు. జాకబ్ డైమండ్ కూడా వీటిలో ఒకటి. మే ఐదో తేదీ వరకూ ఎగ్జిబిషన్ కొనసాగనుంది. 30 నిమిషాల పాటు ఆభరణాలను చూసేందుకు 50 రూపాయలు వసూలు చేస్తారు. ఒకసారి 50 మందిని మాత్రమే గదిలోకి పంపుతారు.

కొహీనూర్ కంటే పెద్దది
జాకబ్ డైమండ్ దక్షిణాఫ్రికాలోని కింబర్లీ వజ్రాల గనుల్లో దొరికింది. అలెగ్జాండర్ మాల్కమ్ జాకబ్ అనే వజ్రాల వ్యాపారి నుంచి ఆరో నిజాం మెహబూబ్ అలీ ఖాన్ దీన్ని కొనుగోలు చేశారు. వ్యాపారి పేరు మీదుగానే దీనికి జాకబ్ డైమండ్ అనే పేరొచ్చింది. బరువు 184.75 క్యారెట్లు. సైజులో కోహినూర్ వజ్రానికి రెండిం తలు ఉంటుం ది. కాబట్టే దీనికంత క్రేజ్. 1995లో భారత ప్రభుత్వం నిజాం ట్రస్ట్ నుంచి రూ.218 కోట్లకు దీన్ని కొనుక్కుంది. తొలుత ట్రస్టు రూ.4,600 కోట్లు డిమాండ్ చేసింది. దీంతో సర్కారు కోర్టుకు వెళ్లి తక్కు వ ధరకు దక్కించుకుంది. 2008లో జాకబ్ డైమండ్ విలువ దాదాపు 900 కోట్ల రూపాయలు ఉంటుం దని బీబీసీ పేర్కొంది. నిజాం జ్యువెల్లరీని సర్కారు ఎగ్జిబిషన్ కు పెట్టడం
ఇది మూడోసారి.