లోన్లు తీసుకునేటోళ్లు తగ్గిన్రు

V6 Velugu Posted on Sep 30, 2021

  • ఎడ్యుకేషన్, హౌసింగ్  లోన్లు తగ్గినయ్​
  • కరోనా ఎఫెక్ట్​తో ఆర్థికంగా చితికిపోయిన జనం
  • పిల్లల ఉన్నత విద్య, ఇండ్ల నిర్మాణాలు వాయిదా
  • లోన్లు తీసుకునేందుకు ఆసక్తి చూపుతలే
  • రాష్ట్ర సర్కార్​కు ఎస్​ఎల్​బీసీ రిపోర్ట్​ 

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో ఎడ్యుకేషన్​, హౌసింగ్​ లోన్లు తీసుకునే వారి సంఖ్య తగ్గింది. రెండేండ్లుగా ఈ లోన్ల టార్గెట్​ను రీచ్​ కావడం లేదు. కరోనా ఎఫెక్ట్​తో జనం ఫైనాన్షియల్​గా దెబ్బతినడం, కొంతమంది ఉద్యోగాలు కోల్పోవడం, జీతాల్లో కోతతో లోన్లు తీసుకునే వారి సంఖ్య తగ్గినట్లు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్​ఎల్​బీసీ) అభిప్రాయపడింది. ఈ మేరకు 2021–22 ఫైనాన్షియల్​ ఇయర్​ ఫస్ట్​ క్వార్టర్​లో తీసుకున్న లోన్లు, సెకండ్​ క్వార్టర్​లో ఎలా ఉందనే దానిపై సర్కార్​కు బుధవారం రిపోర్టు ఇచ్చింది. దీని ప్రకారం రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి చూస్తే గడిచిన, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఎడ్యుకేషన్​, హౌసింగ్​ లోన్లు బ్యాంకులు తక్కువగా ఇచ్చాయి. ఈ ఏడాది టార్గెట్​లో ఏప్రిల్​ నుంచి జూన్​ వరకు హౌసింగ్​లో 9.47%, ఎడ్యుకేషన్​ కింద 5.40% లోన్లు మాత్రమే ఇచ్చాయి.  

ఎడ్యుకేషన్ ​లోన్లు ఇట్లా..
పిల్లలను విదేశాల్లో చదివించేందుకు ఎక్కువ మంది ఎడ్యుకేషన్​ లోన్లు తీసుకుంటుంటారు. ఇందుకోసం బ్యాంకులు గ్యారంటీ లు పెట్టుకోకపోయినా పక్కా  పే స్లిప్​ వంటివి పరిగణనలోకి తీసుకుంటాయి. కరోనా ఎఫెక్ట్​తో ప్రైవేట్​ సెక్టార్​లో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో వారి నెలవారీ ఖర్చులకే ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు వచ్చాయి. ఫలితంగా పిల్లల ఉన్నత చదువులను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారని బ్యాంకర్లు సర్కార్​కు తెలిపారు. అదే టైంలో చాలా ప్రైవేట్​ లిమిటెడ్​ కంపెనీలు ఉద్యోగుల జీతాల్లో కోతలు పెట్టడంతో లోన్లు తగ్గినట్లు వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఖర్చులు తగ్గించుకున్నారని, దీని ప్రభావంతోనే టార్గెట్​ రీచ్​ కాలేకపోయినట్లు పేర్కొన్నారు. ఎడ్యుకేషన్​ లోన్లు 2019–20లో రూ. 977.13 కోట్లు ఇవ్వగా.. 2020–21లో రూ. 693 కోట్లు ఇచ్చారు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే నిరుడు దాదాపు రూ. 300 కోట్లు తగ్గాయి. ఈ ఏడాది రూ. 2,347 కోట్లు భారీ టార్గెట్​ పెట్టుకోగా.. ఫస్ట్​ క్వార్టర్​లో కేవలం రూ.126.71 కోట్లు ఇచ్చారు. సెకండ్​ క్వార్టర్​లోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. 

హౌసింగ్​ లోన్లు ఇట్లా..
కరోనా ఎఫెక్ట్​ నిర్మాణ రంగంపై కూడా తీవ్రంగా పడిందని ఎస్​ఎల్​బీసీ పేర్కొంది. గృహ నిర్మాణాలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయని రిపోర్టులో తెలిపింది. హౌసింగ్​ లోన్లకు చాలా బ్యాంకులు వారి పరిధిలో ఇంట్రెస్ట్​ రేట్లను సవరించినప్పటికీ అనుకున్న స్థాయిలో లోన్లు తీసుకోలేదని వివరించింది.  ఖర్చులు తగ్గించుకోవాలనే జనాల ఆలోచనతో పాటు నిర్మాణ వ్యయం పెరగడం కూడా లోన్లపై ఎఫెక్ట్​ చూపిందంది. హౌసింగ్​ లోన్లు 2019–20లో రూ. 5,099 కోట్లు ఇవ్వగా.. 2020–21లో రూ. 4,162 కోట్లు మాత్రమే ఇచ్చారు. అంటే దాదాపు రూ. వెయ్యి కోట్లు తగ్గింది. ఈ ఏడాదిలో టార్గెట్​రూ. 8,640 కోట్లు కాగా.. ఫస్ట్​ క్వార్టర్​లో రూ. 818 కోట్లు మాత్రమే  బ్యాంకులు పంపిణీ చేశాయి. నిర్దేశించుకున్న లక్ష్యంలో 9.47  శాతమే ఇచ్చాయి. రెండో క్వార్టర్​లోనూ అనుకున్నంతగా లోన్లు తీసుకోలేదని రిపోర్టులో ఎస్​ఎల్​బీసీ పేర్కొంది. 

జోరుగా ఎంఎస్​ఎంఈ లోన్లు
మైక్రో అండ్​ స్మాల్​ మీడియం ఎంటర్​ప్రైజెస్​ లోన్లు పెరుగుతున్నాయి. ఈ ఫైనాన్షియల్​ ఇయర్​ మొదటి 3 నెలల్లోనే టార్గెట్​లో 30% వరకు లోన్లను బ్యాంకులు మంజూరు చేశాయి. ఈ ఏడాది రూ. 1,3451 కోట్లు టార్గెట్​ ఉంటే ఫస్ట్​ క్వార్టర్​లోనే రూ. 11,689 కోట్లు ఇచ్చాయి.

Tagged Telangana, students, coronavirus, Loans, housing loan, education loan, slbc report, MSME loans

Latest Videos

Subscribe Now

More News