హెచ్1బీ వీసాలకు పాత పాలసీనే

హెచ్1బీ వీసాలకు పాత పాలసీనే

ట్రంప్ తెచ్చిన ఆంక్షలను కొట్టేసిన కాలిఫోర్నియా కోర్టు

ఇండియన్ టెకీలు, యూఎస్ ఐటీ కంపెనీలకు ఊరట
బైడెన్ టీంలో మరో ఇండో అమెరికన్ కు చోటు

వాషింగ్టన్: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసాలపై విధించిన రెండు ఆంక్షలను కాలిఫోర్నియా స్టేట్ లోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ (ఫెడరల్ జ్యుడీషియరీలో భాగం) రద్దు చేసింది. ట్రంప్ సర్కార్ ఈ రెగ్యులేషన్స్ పై తొందరపడిందని, ఎలాంటి ట్రాన్స్ పరెన్సీని పాటించలేదని స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో అమెరికన్ లకు ఎక్కువ ఉద్యోగాలు దొరకాలన్న ట్రంప్.. విదేశాల నుంచి హెచ్1బీ వీసాలపై ఉద్యోగులను తీసుకునే విషయంలో అక్టోబర్ లో ఆంక్షలు విధించారు. హెచ్1బీ వీసాపై తీసుకునే విదేశీ ఉద్యోగులకు కనీస శాలరీ అమెరికన్ ఉద్యోగుల కన్నా ఎక్కువగా ఉండాలని ఒక రూల్ ను తెచ్చారు. దీనివల్ల కంపెనీలు అమెరికన్ ఉద్యోగులను తొలగించి, తక్కువ శాలరీకి వచ్చే విదేశీ ఉద్యోగులను తీసుకునేందుకు చాన్స్ ఉండదన్నారు. అలాగే హెచ్1బీ వీసాపై వచ్చే ఉద్యోగులకు ఎలిజిబిలిటీ నిబంధనలను కూడా కఠినతరం చేస్తూ మరో రూల్ ను తెచ్చారు. మొదటి రూల్ అక్టోబర్ నుంచే అమలులోకి రాగా, రెండో రూల్ ఈ నెల 7 నుంచి అమలులోకి రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో హెచ్1బీ వీసాలపై ఆంక్షలు సరికాదంటూ గూగుల్, ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్, ఇతర ఐటీ కంపెనీలు, యూఎస్ చాంబర్​ ఆఫ్​ కామర్స్, బే ఏరియా కౌన్సిల్, స్టాన్ ఫర్డ్, తదితర యూనివర్సిటీలు కోర్టులో లా సూట్ ను దాఖలు చేశాయి. దీనిపై కాలిఫోర్నియాలోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ జడ్జి జెఫరీ వైట్ మంగళవారం తీర్పు చెప్పారు. కరోనా వల్ల దేశ ఎకానమీ పతనమైందని, కంపెనీలు, ఉద్యోగులు ఇబ్బందుల్లో పడ్డారని జడ్జి చెప్పారు. అయితే అమెరికా అభివృద్ధిలో విదేశాల నుంచి వచ్చిన ఉద్యోగులు, వ్యాపారవేత్తల పాత్ర కూడా చాలా ఉందన్నారు. కాగా, అమెరికన్ కంపెనీలు విదేశాల నుంచి స్కిల్డ్ ఎంప్లాయీలను నియమించుకునేందుకు ఏటా 85 వేల హెచ్1బీ వీసాలు జారీ అవుతుంటాయి. వీటిలో 70% వీసాలు (ప్రస్తుతం 6 లక్షల వీసాలు) ఇండియన్లు, చైనీస్ కే దక్కుతుంటాయి.

‘ప్రమాణ స్వీకార కమిటీ’ ఈడీగా మజు వర్ఘీస్

అమెరికా కాబోయే ప్రెసిడెంట్ జో బైడెన్ టీంలో మరో ఇండియన్ అమెరికన్ కు చోటు దక్కింది. నలుగురు సభ్యుల ప్రెసిడెన్షియల్ ఇనాగ్యురల్ కమిటీ (పీఐసీ)కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ)గా మజు వర్ఘీస్ ను వారు ఎంపిక చేశారు. ఈ కమిటీ ఆధ్వర్యంలోనే జనవరి 20న ప్రెసిడెంట్ గా బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. బైడెన్ ట్రాన్సిషన్ టీంలో చోటు పొందిన ఐదో ఇండియన్ అమెరికన్ మజు వర్ఘీస్. మజు వృత్తిరీత్యా అడ్వకేట్. ఆయన తల్లిదండ్రులు కేరళ నుంచి వచ్చి అమెరికాలో సెటిలయ్యారు.

వెంటనే రంగంలోకి దిగుతం: యెల్లెన్   

అమెరికా ఆర్థిక మంత్రిగా జానెట్ యెల్లెన్ (74)ను బైడెన్ ఎంపిక చేశారు. సెనేట్ కన్ఫమ్ చేసిన తర్వాత ఆమె అమెరికా హిస్టరీలోనే తొలి మహిళా ఆర్థిక మంత్రి కానున్నారు. ఆర్థిక మంత్రిగా తనను బైడెన్ ఎంపిక చేసిన నేపథ్యంలో యెల్లెన్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘‘కరోనా విపత్తు కారణంగా అమెరికా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీనిని నివారించేందుకు వెంటనే రంగంలోకి దిగుతాం” అని ఆమె చెప్పారు. దిద్దుబాటు చర్యల్లో ఆలస్యం జరిగిన కొద్దీ నష్టం పెరుగుతుందన్నారు. ‘‘ఉద్యోగాలు పోయాయి. ప్రాణాలు పోయాయి. చిన్న వ్యాపారాలు దివాళా తీశాయి. చాలామందికి తిండి దొరుకుతలేదు. రెంట్, బిల్లులు కట్టేందుకూ డబ్బుల్లేవు. అందుకే పరిస్థితిని మెరుగుపర్చేచర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది” అని జానెట్ చెప్పారు.