
మీర్పూర్: టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య ఏకపక్షంగా సాగుతున్న రెండో టెస్టు ఒక్కసారిగా రసవత్తరంగా మారింది. భారీ విజయంపై కన్నేసిన ఇండియాకు బంగ్లా ఓటమి భయం చూపెట్టింది. మెహిదీ హసన్ మిరాజ్ (3/12), కెప్టెన్ షకీబ్ అల్ హసన్(1/21) స్పిన్ దెబ్బకు టీమిండియా టాపార్డర్ బ్యాట్లెత్తేసింది. బంగ్లా ఇచ్చిన 145 రన్స్ చిన్న టార్గెట్ ఛేజింగ్‌లో మూడో రోజు శనివారం చివరకు రెండో ఇన్నింగ్స్‌లో 23 ఓవర్లలో 45/4తో కష్టాల్లో పడింది.
గిల్ (7), కేఎల్ రాహుల్ (2), పుజారా (6), కోహ్లీ (1) ఫెయిలయ్యారు. అక్షర్ పటేల్ (26 బ్యాటింగ్), ఉనాద్కట్ (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇండియా విజయానికి ఇంకో 100 రన్స్ అవసరం అవగా.. బంగ్లాకు ఆరు వికెట్లు కావాలి. ఇండియాను గట్టెక్కించే బాధ్యత క్రీజులో ఉన్న అక్షర్‌తో పాటు రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ పై ఉంది. అంతకుముందు బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో 231 స్కోరుకు ఆలౌటైంది. లిటన్ దాస్ (73), జాకిర్ హసన్ (51) ఫిఫ్టీలు కొట్టగా.. చివర్లో నురుల్ హసన్ (31), తస్కిన్ (31 నాటౌట్) రాణించారు. ఇండియా బౌలర్లలో అక్షర్ మూడు, సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టారు.
చివర్లో పట్టు విడిచి, క్యాచ్‌లు వదిలి..
ఓవర్‌నైట్ స్కోరు 7/0తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ 150లోపే ఆలౌట్ అవ్వాల్సింది. వెంటవెంటనే ఆరు వికెట్లు పడగొట్టిన ఇండియా బౌలర్లు చివరి వికెట్లు తీయలేక ఇబ్బంది పడ్డారు. మూడో రోజు ఆట రెండో ఓవర్లోనే ఓపెనర్ శాంటో (5)ను ఎల్బీ చేసిన అశ్విన్ ఇండియాకు బ్రేక్ ఇచ్చాడు. మరో ఓపెనర్ జాకిర్ ధాటిగా ఆడుతున్నప్పటికీ, మోమినుల్ (5)ను సిరాజ్, షకీబ్ (13)ను ఉనాద్కట్ పెవిలియన్ చేర్చగా.. అక్షర్ బౌలింగ్‌లో ముష్ఫికర్ (9) వికెట్ల ముందు దొరికిపోయాడు.
దాంతో, ఫస్ట్ సెషన్లోనే బంగ్లా 71/4తో కష్టాల్లో పడ్డది.జాకిర్‌కు తోడైన లిటన్ ఐదో వికెట్‌కు 32 రన్స్ జోడించాడు. అయితే, ఉమేశ్ బౌలింగ్‌లో జాకిర్ వెనుదిరగ్గా.. ఆ వెంటనే మెహిదీ హసన్ (0)ను అక్షర్ డకౌట్ చేయడంతో 113/6తో బంగ్లా ఎదురీత మొదలు పెట్టింది. ఇండియా బౌలర్ల జోరు చూస్తుంటే హోమ్‌టీమ్ 150 చేయడం కష్టమే అనిపించింది. ఈ టైమ్‌లో లిటన్‌కు తోడైన నురుల్ ఒక్కసారిగా ఎదురుదాడికి దిగాడు. అక్షర్ బౌలింగ్‌లో నురుల్ స్టంపౌటైనా.. తర్వాత తస్కిన్ కూడా బ్యాట్ ఝుళిపించడంతో బంగ్లా 195/7 స్కోరతో టీ బ్రేక్‌కు వెళ్లింది. బ్రేక్ తర్వాత కూడా లిటన్, తస్కిన్ అదే జోరు కొనసాగించారు. ఈ క్రమంలో లిటన్ 50 దాటాడు.
ఇండియా ఫీల్డింగ్ తప్పిదాలు కూడా బంగ్లాకు కలిసొచ్చాయి. కోహ్లీ స్లిప్‌లో మూడు క్యాచ్‌లు వదిలేశాడు. రివ్యూలు కూడా హోమ్‌టీమ్‌కు అనుకూలంగా మారాయి. చివరకు అద్భుత బాల్‌తో సిరాజ్.. లిటన్‌ను క్లీన్ బౌల్డ్ చేయడంతో ఎనిమిదో వికెట్‌కు 61 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. ఆపై, తైజుల్ను అశ్విన్ ఎల్బీ చేయగా.. ఖాలెద్ అహ్మద్ (8) రనౌట్ కావడంతో బంగ్లా ఇన్నింగ్స్ ముగిసింది.
స్పిన్‌కు వణికి..
చిన్న టార్గెట్ ఛేజింగ్‌లో చివరి సెషన్లో బ్యాటింగ్‌కు వచ్చిన ఇండియా అనూహ్యంగా తడబడింది. అప్పటిదాకా బంగ్లా టెయిలెండర్లు భారీ షాట్లు ఆడిన వికెట్‌పై మన స్టార్ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. బంగ్లా కెప్టెన్ షకీబ్ తొలి ఓవర్ నుంచే స్వయంగా స్పిన్ ఎటాక్ ప్రారంభించి ఇండియాను దెబ్బకొట్టాడు. మంచి టర్న్, అనూహ్యమైన బౌన్స్ లభిస్తున్న పిచ్‌పై అతనితో పాటు మెహిదీ తక్కువ ఎత్తులో బాల్స్ వేసి బ్యాటర్లను బోల్తా కొట్టించారు.
సిరీస్‌లో చెత్త ఫామ్ కొనసాగించిన రాహుల్.. మూడో ఓవర్లో షకీబ్ వేసిన టర్నింగ్ బాల్‌కు కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఇక, బాల్ టర్న్ అవ్వకముందే ఆడాలని క్రీజు విడిచి ముందుకొచ్చిన పుజారాను మిరాజ్ స్టంపౌట్ చేశాడు.
స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు లెఫ్టాండర్ అక్షర్ పటేల్‌ను కోచ్ ద్రవిడ్ ముందుగా బ్యాటింగ్‌కు పంపడం లాభించింది. అక్షర్ క్రీజులో నిలదొక్కుకున్నాడు. కానీ, మిరాజ్ దూస్రాకు గిల్ కూడా స్టంపౌట్ అవ్వడంతో ఇండియా 29/3తో కష్టాల్లో పడ్డది. అక్కడితో వికెట్ల పతనం ఆగలేదు. టర్నింగ్, బౌన్స్‌కు తోడు క్లోజ్ ఫీల్డింగ్ పెట్టిన షకీబ్ ఇండియాపై మరింత ఒత్తిడి పెంచాడు. ఈ క్రమంలో మిరాజ్ బాల్‌ను డిఫెన్స్ ఆడే ప్రయత్నంలో కోహ్లీ షార్ట్ లెగ్‌లో తైజుల్‌కు క్యాచ్ ఇచ్చాడు. నైట్ వాచ్‌మన్ ఉనాద్కట్‌తో అక్షర్ డే ముగించాడు.
సంక్షిప్త స్కోర్లు
బంగ్లాదేశ్తొలి ఇన్నింగ్స్: 227 ఆలౌట్; ఇండియా తొలి ఇన్నింగ్స్: 314 ఆలౌట్; బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్: 231 ఆలౌట్ (లిటన్ 73, శాంటో 51, అక్షర్ 3/68), ఇండియా రెండో ఇన్నింగ్స్ (టార్గెట్ 145): 23 ఓవర్లలో 45/4 (అక్షర్ 26*, ఉనాద్కట్ 3*,
మెహిదీ 3/12)