విపక్షాల కూటమి పేరు I N D I A.. బీజేపీని కలిసి ఎదుర్కొనేందుకు అడుగులు

విపక్షాల కూటమి పేరు I N D I A.. బీజేపీని కలిసి ఎదుర్కొనేందుకు అడుగులు

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని కలిసి ఎదుర్కొనేందుకు విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. బెంగళూరు వేదికగా రెండోరోజు ప్రతిపక్ష నేతల భేటీ మంగళవారం (జులై 18న) నిర్వహించారు. ఈ సమావేశంలో విపక్షాల కూటమికి I-N-D-I-A అనే పేరు పెట్టారు.  ప్రతిపక్షాల ఫ్రంట్‌కు ఇకపై ‘భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి (I-N-D-I-A, ఇండియన్ నేషనల్ డెవలప్ మెంట్ ఇన్ క్లూజివ్ అలయన్స్ )’గా నామకరణం చేసినట్లు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్‌ ఖర్గే అధికారికంగా వెల్లడించారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా విపక్షాలు రెండో విడతగా బెంగళూరులో భేటీ అయ్యాయి. సోమవారం (జులై 17న) సాయంత్రం ఈ భేటీ ప్రారంభమవ్వగా.. మంగళవారం కీలక అంశాలపై నేతలు చర్చించారు. ‘కూటమి పేరు’పై విస్తృతంగా చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే ఐదారు పేర్లను నేతలు పరిశీలించారు. చివరకు I-N-D-I-A (Indian National Developmental Inclusive Alliance) అనే పేరును ప్రతిపాదించగా.. అత్యధిక పార్టీల నేతలు ఏకీభవించారు. ఈ పేరును కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రతిపాదించినట్లు ఖర్గే తెలిపారు. 

రెండో రోజు సమావేశంలో కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్‌ ఖర్గేతో పాటు పశ్చిమ బెంగాల్‌- ముఖ్యమంత్రి మమతాబెనర్జీ(టీఎంసీ), బీహార్ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ (-జేడీయూ), తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌(-డీఎంకే), ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌(-ఆప్‌), పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌(-ఆప్‌), ఝార్ఖండ్‌- ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌(ముక్తి మోర్చా), మాజీ ముఖ్యమంత్రులు- అఖిలేశ్‌ యాదవ్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌), ఉద్ధవ్‌ ఠాక్రే (మహారాష్ట్ర), లాలూ ప్రసాద్‌ యాదవ్‌ (బిహార్‌), మెహబూబా ముఫ్తీ (జమ్మూ-కశ్మీర్‌), సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షులు ఫరూక్‌ అబ్దుల్లా, ఎండీఎంకే నేత వైగో, జయంత్‌ చౌధరి (ఆర్‌ఎల్‌డీ) వంటి నేతలు పాల్గొన్నారు.