ప్రతిపక్ష నేతలపై కేంద్రం కక్ష 

ప్రతిపక్ష నేతలపై కేంద్రం కక్ష 

దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది 

న్యూఢిల్లీ :
రాజకీయ ప్రత్యర్థులపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని, ప్రతిపక్ష నేతలను ఇబ్బందులకు గురిచేసేందుకు వాటిని వాడుకుంటోందని ఆరోపించాయి. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విజ్ఞప్తి చేశాయి. మంగళవారం రాష్ట్రపతికి కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ, ఆప్, ఆర్జేడీ, సీపీఎం కలిసి లెటర్ రాశాయి. ‘‘ఇప్పటికే దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడది తీవ్రం చేసింది. ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసింది. కావాలనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నోళ్లను అణచివేయాలని చూస్తోంది” అని పేర్కొన్నాయి. పేదరికం, నిరుద్యోగం, ధరల పెరుగుదల తదితర అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేంద్రం ఇలా చేస్తోందని మండిపడ్డాయి. సోనియా గాంధీని ఈడీ విచారించిన నేపథ్యంలో ఈ లేఖ రాశాయి. 

కేంద్రానిది మొండి వైఖరి.. 
పార్లమెంట్ లోనూ కేంద్రం మొండి వైఖరి అవలంబిస్తోందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. జీఎస్టీ పెంపుపై చర్చకు అనుమతించడం లేదని ఫైర్ అయ్యాయి. ‘‘కేంద్రం తీరుతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా సాగడం లేదు. నిత్యావసరాల ధరల పెరుగుదల, జీఎస్టీ పెంపు అంశాలపై అత్యవసర చర్చకు అనుమతించడం లేదు. ఇంతకుముందు అత్యవసర చర్చలు చేపట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఈసారి ప్రభుత్వం అందుకు అనుమతించడం లేదు” అని ఆగ్రహం వ్యక్తం చేశాయి. కాగా, రాష్ట్రపతికి రాసిన లెటర్ పై మల్లికార్జున ఖర్గే (కాంగ్రెస్), సంజయ్ సింగ్ (ఆప్), మనోజ్ ఝా (ఆర్జేడీ), ఎలమారం కరీం (సీపీఎం), రామ్ గోపాల్ యాదవ్ (ఎస్పీ) సంతకాలు చేశారు.