ఆర్టీసీలో సగం మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఔట్?

ఆర్టీసీలో సగం మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఔట్?

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో సగం మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించాలని సంస్థ భావిస్తోంది. లాక్ డౌన్ కారణంగా పెద్ద ఎత్తున ఆదాయం పడిపోవటంతో ఖర్చు తగ్గించేందుకే వీరిని తీసేయనుంది. ఇప్పటికే కొంతమందిని తొలగించగా త్వరలోనే మరికొంత మందిని ఇంటికి పంపించనుంది. ప్రస్తుతం 446 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పలు విభాగాల్లో పనిచేస్తున్నారు. తొలగించిన వారి స్థానంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న అదనపు సిబ్బందిని వినియోగించనున్నారు. బుధవారం హైదరాబాద్ లో ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంత్రి పువ్వాడ ఇంటర్నల్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో  ఖర్చు తగ్గించుకోవడం, సిటీ బస్సులు నడపడం, జాబ్ సెక్యూరిటీపై ప్రధానంగా చర్చించారు.  రోజుకు రూ.  11 నుంచి  రూ. 12 కోట్ల వరకు ఆదాయం వచ్చే ఆర్టీసీకి ప్రస్తుతం రూ. 3 కోట్లు కూడా రావటం లేదు. ఇప్పట్లో పెద్దగా ఆదాయం పెరిగే చాన్స్ లేదని వీలైనంత ఖర్చులు తగ్గించుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.  వీలైనంత త్వరగా ఆర్టీసీ హెడ్స్ సమావేశమై ఏయే రంగాల్లో, ఎలా, ఎంత ఖర్చు తగ్గించుకోవచ్చో ఒకటి రెండు రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించినట్లు తెలిసింది.

పెట్రోల్ బంకుల్లో డ్రైవర్లు, కండక్టర్లకు విధులు

ఇటీవల సమ్మె తర్వాత బస్సులను తగ్గించడంతో ఆర్టీసీ స్టాఫ్ చాలా మంది ఖాళీగా ఉన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల స్థానంలో ఈ స్టాఫ్ ను ఉపయోగించుకోనున్నారు. ఇందులో భాగంగానే ఆసక్తి ఉన్న వారు అటెండర్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఇటీవల అధికారులు ప్రకటించారు.  ఇక బస్ పాస్ కౌంటర్లు, ఆర్టీసీ పెట్రోల్ బంకులను ఆర్టీసీయే నిర్వహించనుంది. ప్రస్తుతం  ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతోనే వీటిని నడిపిస్తున్నారు. ఆ స్థానంలో డ్రైవర్లు, కండక్టర్లను నియమించనున్నారు.

ఇక ఫుల్ జాబ్ సెక్యూరిటీ

ఆర్టీసీలో చిన్న చిన్న తప్పులకు కూడా ఉద్యోగాల నుంచి తీసేసే వారు. దీనిపై ఎప్పటి నుంచో యూనియన్లు ఫైట్ చేస్తున్నాయి. ఇటీవల ఆర్టీసీ సమ్మె సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు జాబ్ సెక్యూరిటీ ఉండాలని దీనిపై విధివిధానాలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. ఇందులో భాగంగా అధికారులు విధివిధానాలు సిద్ధం చేశారు. ఇంటర్నల్ మీటింగ్ లో దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. మంత్రి పువ్వాడ కొన్ని మార్పులు చేయాలని సూచించటంతో త్వరలోనే వాటిని మార్చి ఫైనల్ చేయనున్నారు. ఇది అమల్లోకి వస్తే ఆర్టీసీ ఉద్యోగులకు జాబ్ సెక్యురిటీ  ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

కేసీఆర్ పనితీరు ఏంటో తేలిపోయింది