చికిత్స కోసం వచ్చిన ఓ రోగికి ఉస్మానియా వైద్య సిబ్బంది గడువు ముగిసిన ట్యాబ్లెట్స్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. హైదరాబాద్ కి చెందిన ఓ మహిళ(55) అనారోగ్యంతో ఉస్మానియా ఆసుపత్రిలో చేరింది. ఐసోలేషన్ వార్డులో ఉన్న ఆమెకు ముగ్గురు సిబ్బంది గత నెలతో గడువు ముగిసిన డాక్సీసైక్లిన్ 100 ఎంజీ ట్యాబెట్లు ఇచ్చారు.
దీంతో ఆమె మరింత అనారోగ్యానికి గురయింది. మొహం ఉబ్బిపోయింది. ఆమె కుటుంబ సభ్యులు విషయం తెలుసుకుని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న అధికారులు అంతర్గత కమిటీ వేసి విచారణ జరిపారు. ముగ్గరు నర్సులు బాధ్యులుగా తేల్చారు. ఉన్నతాధికారులు వీరిపై చర్యలు తీసుకుంటారని చెప్పారు. మరింత సమాచారం కోసం ఇంకో కమిటీ వేసినట్లు వెల్లడించారు.
