200 ఏండ్ల క్రితం మరణించిన కవికి మళ్లీ జీవం

200 ఏండ్ల క్రితం మరణించిన కవికి మళ్లీ జీవం

రెండు వందల ఏండ్ల క్రితం చనిపోయిన మనిషికి సైంటిస్టులు మళ్లీ జీవం పోస్తున్నారు! అదే రూపం.. ఆయన వాయిస్ అప్పట్లో ఉన్నట్టుగానే తీసుకురాబోతున్నారు. ఆ రోజుల్లో ఆయన వేసుకున్న అదే రకమైన ‘డ్రస్’ కూడా రెడీ చేస్తున్నారు. ఆ మనిషి ఎవరో కాదు.. రొమాంటిక్ ఇంగ్లిష్ పొయిట్రీతో ప్రపంచాన్ని ఏలిన కవి జాన్ కీట్స్. కానీ 200 ఏండ్ల క్రితం చనిపోయిన ఆయన్ని మళ్లీ ఎలా తీసుకొస్తారా? అని అందరికీ అనుమానం రావచ్చు. ఆయన్నేం రియల్‌‌గా బతికించడం లేదు. యానిమేషన్, లింగ్విస్టిక్ టెక్నాలజీల ద్వారా సీఐజీలో జాన్ కీట్స్‌‌ రూపాన్ని రీక్రియేట్ చేస్తున్నారు. వర్చువల్ రియాలిటీ ద్వారా ఆయనతో మాట్లాడించడం ఇక్కడ హైలైట్!

జాన్ కీట్స్.. ఆయన ఈ భూమిపై బతికింది గట్టిగా పాతికేండ్లు మాత్రమే! ప్రపంచం ఆయన్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకునేలా చెరిగిపోని ముద్ర వేసి వెళ్లిపోయారు. ఆయన రాసిన రొమాంటిక్ ఇంగ్లిష్ పొయిట్రీ కీట్స్‌‌ని చిరంజీవిగా నిలిపింది. 1795లో లండన్‌‌లో పుట్టిన ఆయన టీబీ కారణంగా 1821 ఫిబ్రవరి 23న ప్రాణాలు కోల్పోయారు. చనిపోయే ముందు కేవలం నాలుగేండ్లు మాత్రమే కీట్స్ పొయిట్రీ పబ్లిష్ అయ్యి జనాల్లోకి వచ్చింది. అయితేనేం ఆయనకు దక్కిన పేరు, పాపులారిటీ మాటల్లో చెప్పలేనంత స్థాయికి చేరింది. వాస్తవానికి జాన్ కీట్స్ కవిత్వం ఆయన మరణించిన తర్వాతనే ఎక్కువ పాపులర్ అయింది. చివరి రోజుల్లో టీబీ బాధ భరించలేక అల్లాడుతుంటే వేడి వాతావరణం ఉన్న దగ్గర అయితే కొంచెం బెటర్ అని డాక్టర్లు సలహా ఇవ్వడంతో కీట్స్ లండన్‌‌ నుంచి రోమ్‌‌కు షిఫ్ట్ అయ్యారు. కానీ ఏం మార్పులేదు. అక్కడికి వెళ్లిన ఐదు నెలల్లో ఆయన మరణించారు. 1821 ఫిబ్రవరి 23న ఆయన ఏ ఇంట్లో అయితే చనిపోయారో ఇప్పుడు అదే ఇంట్లో అయన్ని రీక్రియేట్ చేస్తున్నారు సైంటిస్టులు. ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ ఆర్కియాలజీకి చెందిన సైంటిస్టులు ఈ పనిలో చాలా బిజీగా ఉన్నారు. కీట్స్ 200వ వర్థంతి రోజుకు ఆయనను వర్చువల్‌‌గా ప్రపంచం ముందు మాట్లాడించబోతున్నారు.

సమాధిపై ఉన్న అబద్ధాన్ని నిజం చేయడానికి..

జాన్ కీట్స్ మరణించింది 1821 ఫిబ్రవరి 23న. కానీ ఆయన సమాధి మీద పెట్టిన శిలపై పొరపాటున చనిపోయిన తేదీని తప్పుగా చెక్కారు. ఫిబ్రవరి 24న ప్రాణాలు వదిలినట్లుగా ఆ శిలను చెక్కిన వాళ్లు రాశారు. సమాధిపై వాళ్లు పెట్టిన ఆ అవాస్తవాన్ని నిజం చేయాలన్న ఆలోచనతోనే ఈ వర్చువల్ రీక్రియేషన్ వర్క్ ఐడియా వచ్చిందని సైంటిస్టులు చెబుతున్నారు. ఆ అబద్ధాన్ని నిజం చేసి, జాన్ కీట్స్ జీవితంలో మరో 24 గంటల ఎక్స్‌‌ట్రా టైమ్‌‌ను ఆయన 200వ వర్థంతి సందర్భంగా సృష్టి చేస్తున్నామన్నారు. దీనికి సంబంధించిన వర్క్ ఇప్పటికే పూర్తయిందని, తుది మెరుగులు దిద్దుతున్నామన్నారు.

త్రీడీ ప్రింటింగ్ ద్వారా..

యానిమేటర్స్, లింగ్విస్టిక్స్, ఫిజిసిస్ట్స్, క్లాంథింగ్ ఎక్స్‌‌పర్ట్స్‌‌, ఫ్యాషన్ టెక్నాలజీ క్యూరేటర్స్ ఇలా రకరకాల టీమ్స్‌‌ ఎంతో శ్రమపడి కీట్స్‌‌ రీక్రియేషన్ వర్క్ చేస్తున్నారు. జాన్ కీట్స్ వాయిస్‌‌ని మళ్లీ అప్పట్లో ఉన్నట్టుగానే తీసుకురావడానికి యానిమేటర్స్, వోకల్స్ స్పెషలిస్టులు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆయన డ్రస్సింగ్‌‌ కూడా పూర్వపు ఇంగ్లిష్ రాజుల స్టైల్‌‌లో ఉండడంతో దానిని అలాగే డిజైన్ చేస్తున్నారు. యానిమేషన్ వర్క్ లాంటివి కంప్లీట్ అయిపోయాయి. కానీ డ్రస్ డిజైన్ పూర్తి కావడానికి ఇంకొన్ని రోజులు టైమ్ పడుతుందని ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ ఆర్కియాలజీ (ఐడీఏ) టీమ్స్ చెబుతున్నాయి. ఆర్కియాలజీ లైబ్రరీల్లో ఉన్న ఆయన లైఫ్ ఈవెంట్స్ ఆధారంగా ఈ రీక్రియేషన్ వర్క్ చేస్తున్నట్లు ఐడీఏ డైరెక్టర్ రోజర్ మైకెల్ తెలిపారు. యాక్యురేట్ త్రీడీ మోడల్ ప్రింటింగ్ చేసి కచ్చితమైన రూపం తీసుకొచ్చామని చెప్పారు.

వాయిస్ తీసుకురావడంలో ఇండియన్ సైంటిస్ట్

ఈ రీక్రియేషన్‌‌లో జాన్ కీట్స్ రూపురేఖలు సహా ప్రతి డీటైల్ క్లియర్‌‌‌‌గా ఉండడం కోసం తాను చాలా రీసెర్చ్ చేశానని రోజర్ తెలిపారు. బతికి ఉండగా లండన్‌‌లో ఒక సందర్భంలో రికార్డ్ చేసిన వాయిస్‌‌ల ఆధారంగా వర్చువల్ రియాలిటీలో జాన్ కీట్స్‌‌తో మాట్లాడించబోతున్నామన్నారు. కీట్స్ వాయిస్‌‌ను ఇప్పుడు మళ్లీ ఎగ్జాక్ట్ తీసుకువచ్చేందుకు ఇండియన్ ఆరిజన్ సైంటిస్ట్ సపోర్ట్ తీసుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్‌‌కు చెందిన లింగ్విస్టిక్ హిస్టోరియన్ డాక్టర్ రాంజన్ సేన్ వాయిస్ ట్యూనింగ్ చేశారు. ఫిబ్రవరి 23న కీట్స్ నోటి వెంట ఆయన చివరి రోజుల్లో రోమ్‌‌లో ఉండగా రాసిన ఫేమస్ పొయిట్రీ ‘బ్రైట్ స్టార్’ను చెప్పించబోతున్నారు.