ఆంక్షల ట్రాక్‌‌పై హైదరాబాద్ మెట్రో! దేశవ్యాప్తంగా రూ.5 లక్షల కోట్ల అప్పులిచ్చిన IRFC తెలంగాణకు కొత్త షరతులు

ఆంక్షల ట్రాక్‌‌పై హైదరాబాద్ మెట్రో!  దేశవ్యాప్తంగా  రూ.5 లక్షల కోట్ల అప్పులిచ్చిన IRFC తెలంగాణకు  కొత్త షరతులు
  • మిగిలిన మెట్రోలకు లేని నిబంధన 
  • హైదరాబాద్‌‌కే  ఎందుకంటున్న అధికారులు
  • ఆర్‌‌‌‌బీఐ గ్యారెంటీ, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించినా 
  • నిలిచిపోయిన నిధుల విడుదల
  • మెట్రో మొదటి దశ రీఫైనాన్సింగ్ ఆగితే ఫేజ్‌‌–-2 విస్తరణకూ సమస్యలు
  • మరోసారి కేంద్రంతో చర్చలకు రెడీ అవుతున్న అధికారులు 
  • గ్రీన్ ​సిగ్నల్ ​ఇవ్వకుంటే ఇతర ప్రైవేట్​ బ్యాంకులకు వెళ్లే యోచనలో రాష్ట్ర సర్కారు

హైదరాబాద్, వెలుగు:హైదరాబాద్ మహానగరాభివృద్ధిలో అత్యంత కీలకమైన మెట్రో రైల్ ప్రాజెక్ట్ నిధుల విడుదల అంశం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సరికొత్త వివాదానికి దారితీసింది. 
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల మెట్రో ప్రాజెక్టులకు, రైల్వే రంగానికి ఏకంగా రూ.5 లక్షల కోట్ల మేర నిధులు సమకూర్చిన ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్‌‌‌‌ఎఫ్‌‌సీ).. హైదరాబాద్​ మెట్రో వంతు వచ్చేసరికి గతంలో లేని షరతులు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ మెట్రో మొదటి దశను ఎల్‌‌అండ్‌‌టీ నుంచి  స్వాధీనం చేసుకోవడంలో  భాగంగా రూ.13,527 కోట్ల రీ ఫైనాన్సింగ్‌‌కు రాష్ట్ర సర్కారు చేసిన ప్రయత్నాలకు చివరి నిమిషంలో కేంద్రం దగ్గర బ్రేక్​పడిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద ఇప్పటికే రూ.1,400 కోట్లు, ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.84 కోట్లు 
చెల్లించింది.


ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ అనుమతులుసహా చట్టపరమైన అన్ని ప్రక్రియలను  పూర్తి చేసినప్పటికీ.. జూన్ 15 కల్లా విడుదల కావాల్సిన నిధులు అందకపోవడంతో ప్రభుత్వ, అధికారవర్గాలను షాక్‌‌‌‌‌‌‌‌కు గురిచేసింది. లోన్​ఇస్తున్న జపాన్ ఫైనాన్స్​ కంపెనీకి లేని అభ్యంతరం, కేంద్రానికి ఎందుకనే ప్రశ్న ఇప్పడు అందరి మదిలోనూ మెదులుతోంది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే హైదరాబాద్​ మెట్రోను కేంద్రం పక్కనపెడుతోందని అనుమానిస్తున్న ప్రభుత్వ పెద్దలు.. త్వరలో మరోసారి కేంద్ర రైల్వే మంత్రిని కలిసి విజ్ఞప్తిచేయాలని భావిస్తున్నారు. అప్పటికీ ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌సీ లోన్‌‌‌‌‌‌‌‌కు కేంద్రం గ్రీన్​సిగ్నల్​ఇవ్వకుంటే ఇతర ప్రైవేట్​ బ్యాంకుల నుంచి తెచ్చుకోవాలని సీఎం రేవంత్​ఇప్పటికే నిర్ణయించారు. '

సాంకేతిక కారణాల సాకుతో ఆగిన లోన్ 

ముంబై మెట్రో విస్తరణకు ఏకంగా రూ.50 వేల కోట్లు, ఢిల్లీ ఫేజ్-–4, యూపీ, గుజరాత్ మెట్రోలకు  వేల కోట్లకు ఎలాంటి షరతులు లేకుండా  లోన్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చిన ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌సీ, కేంద్రం.. హైదరాబాద్​మెట్రోకు మాత్రమే ‘ఎస్క్రో అకౌంట్’ నిబంధన పెట్టాయని అధికారులు చెప్తున్నారు.  ఎస్క్రో అకౌంట్​ అంటే రుణం తీసుకునే సంస్థ తన ఆదాయాన్ని నేరుగా వాడుకోకుండా ఈ ప్రత్యేక ఖాతాలో జమ చేయాలి.

తర్వాత థర్డ్​ పార్టీగా వ్యవహరించే ఏదైనా బ్యాంకు  లేదా పర్యవేక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఈ ఖాతా నుంచి డబ్బులు విడుదలవుతాయి. కాగా, మెట్రో ద్వారా వచ్చే రోజువారీ ఆదాయాన్ని మొదట రుణ వాయిదాల చెల్లింపునకు, తర్వాత మెట్రో నిర్వహణ (ఓఅండ్​ఎం)కు వాడేలా రాష్ట్ర సర్కారు అగ్రిమెంట్​చేసుకుంది. ఈ విషయంలో ఇరత రాష్ట్రాల ఒప్పందాలను అనుసరించినట్టు అధికారులు చెప్తున్నారు. తీరా ఈ అంశం దగ్గరే రుణం విడుదలకు కేంద్ర పట్టణాభివృవద్ధి శాఖ అడ్డుపుల్ల వేసిందని అంటున్నారు. ‘‘మెట్రోకు వచ్చే ఆదాయంలో మెట్రో మెయింటెనెన్స్‌‌‌‌‌‌‌‌కే మొదట ఖర్చు చేయాలి.

ఆ తర్వాతే అప్పులు కట్టాలనేది కేంద్ర ప్రభుత్వ పాలసీ. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం మొదట ఐఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌సీ అప్పే కడతాం, ఆ తర్వాతే మెయింటెనెన్స్ చూసుకుంటాం అంటోంది. మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోతే రేపు మెట్రో నడవడమే కష్టమవుతుందనేది కేంద్రం ఆలోచన. ఇందులో ఎలాంటి రాజకీయ వివక్ష లేదు. ఇది పూర్తిగా సాంకేతికమైన అంశం’’ అని ఇటీవల కేంద్రమంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి వివరించారు. మెట్రో ఆదాయంలోంచి మొదట మెయింటనెన్స్‌‌‌‌‌‌‌‌కి చెల్లించినా, ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌సీ కిస్తీలు చెల్లించినా తమకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదని, ఒకవేళ ఆదాయం తక్కువగా వస్తే మిగిలిన మొత్తాన్ని ఎలాగూ తామే భరించాల్సి ఉంటుంది కదా? అని అధికారులు అంటున్నారు. మెట్రో లోన్​ ఆపేందుకు కేంద్రమంత్రి చెప్పిన సాంకేతిక కారణం సహేతుకంగా లేదని, ఇది కావాలని చేస్తున్నట్టుగా ఉందని ఇటీవల  సీఎం, మంత్రుల సమావేశంలో అభిప్రాయపడినట్టు తెలిసింది. 

లోన్​కు ఒప్పుకోకుంటేసొంతంగా ముందుకు..

ఐఆర్‌‌‌‌ఎఫ్‌‌సీ లోన్​ విషయంలో త్వరలో మరోసారి కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేయాలని ఇటీవలే సీఎం, మంత్రులు నిర్ణయించారు. ఆ తర్వాత వారం, పదిరోజులు వేచిచూడాలని, అప్పటికీ లోన్‌‌కు కేంద్రం గ్రీన్ ​సిగ్నల్​ఇవ్వకుంటే ఇతర ప్రైవేట్​ బ్యాంకుల నుంచి తెచ్చుకోవాలని భావిస్తున్నారు. ఐఆర్‌‌‌‌ఎఫ్‌‌సీ నుంచి తీసుకునే అప్పుపై కేవలం 4 శాతం వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. కానీ బయట బ్యాంకుల నుంచి 8 శాతం వడ్డీ రేటు చెల్లించక తప్పని పరిస్థితి ఉంటుంది. కేంద్రం తీరువల్ల మెట్రో పనులు ఆగితే మరింత నష్టం తప్పదని భావిస్తున్న ప్రభుత్వం 8 శాతం వడ్డీకైనా సరే  ఏదైనా బ్యాంక్ లేదా ప్రభుత్వ ఆర్థిక సంస్థల నుంచి రుణం సేకరించేందుకు సిద్ధమవుతోంది.

భవిష్యత్తులో మెట్రో ఫేజ్-–2 విస్తరణ ప్రాజెక్టులో భాగస్వామ్యానికి కేంద్రం ముందుకు రాకుంటే ఇక ఢిల్లీ పెద్దల చుట్టూ తిరగడం పక్కనపెట్టి, ఎన్వోసీ తీసుకోవాలని యోచిస్తోంది.  నిజానికి మెట్రో–2ను  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యం (50:50 )లో చేపడితే.. ఈ ప్రాజెక్టుకయ్యే మొత్తం రూ. 32,237 కోట్ల వ్యయంలో కేంద్ర ప్రభుత్వం తన ఈక్విటీ  వాటా కింద  కేవలం రూ. 5,802 కోట్లను (18%) మాత్రమే గ్రాంట్ల రూపంలో సమకూరుస్తుంది. అంతే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కేటాయించాల్సి ఉంటుంది.

భూసేకరణ, పరిహారం పంపిణీ ఖర్చుల కింద మరో రూ. 2,902 కోట్లను (9%) రాష్ట్ర ప్రభుత్వమే అదనంగా భరించాలి. మిగిలిన  55 శాతం నిధులను, అంటే దాదాపు రూ. 17,731 కోట్లను అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి ఐఆర్‌‌ఎఫ్‌‌సీ  ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు సేకరించాలనేది ప్లాన్​. కేంద్ర పెద్దల కొర్రీల నేపథ్యంలో జాయింట్​వెంచర్​ కోసం చూడకుండా కేంద్రం నుంచి ఎన్వోసీ లభించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా మెట్రో విస్తరణను పట్టాలెక్కించేలా ప్రత్యామ్నాయ ప్రణాళిక సైతం సిద్ధం చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు.