విద్యకు టాప్ ప్రయారిటీ.. విధ్వంసమైన విద్యాశాఖ వికాసం వైపు: సీఎం రేవంత్‌‌రెడ్డి

విద్యకు టాప్ ప్రయారిటీ.. విధ్వంసమైన విద్యాశాఖ వికాసం వైపు: సీఎం రేవంత్‌‌రెడ్డి
  • నిధులు, ఫైళ్ల క్లియరెన్స్ వేగంగా జరగాలని ఆ శాఖను నేనే స్వయంగా పర్యవేక్షిస్తున్నా
  • గిట్టనోళ్లు మాపై అసత్య ఆరోపణలు చేస్తున్నరు.. అభివృద్ధిని చూసి ఓరుస్తలేరు..
  • ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాల నుంచి వందలాది మంది అంబేద్కర్‌‌లు రావాలి
  • చదువుతోపాటు క్రీడల్లోనూ తెలంగాణ 
  • విద్యార్థులు ప్రపంచస్థాయిలో రాణించాలి
  • విద్యా సంస్థల పరిసరాల్లో 
  • డ్రగ్స్ అమ్మితే శిక్ష తప్పదని హెచ్చరిక
  • ఎల్బీ స్టేడియంలో ‘యంగ్ ఇండియా 
  • ఎడ్యుకేషన్ కిట్స్’  పంపిణీ 

హైదరాబాద్, వెలుగు:తమ ప్రభుత్వానికి విద్యే టాప్​ ప్రయారిటీ అని, అందుకే ఆ శాఖను తన వద్ద పెట్టుకున్నానని సీఎం రేవంత్‌‌రెడ్డి స్పష్టం చేశారు. విధ్వంసమైన విద్యాశాఖను వికాసం వైపు నడిపించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. దీనికోసం బడ్జెట్‌‌లో 8.5 శాతం నిధులు కేటాయించామని గుర్తు చేశారు. 

‘‘విద్యాశాఖను నిర్లక్ష్యం చేస్తున్నానంటూ కొందరు గిట్టనివారు ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఏమాత్రం నిజం లేదు. ఈ ప్రభుత్వానికి అన్ని శాఖల కంటే విద్యాశాఖే అత్యంత ప్రాధాన్యమైంది” అని పేర్కొన్నారు. దశాబ్దాలుగా ప్రభుత్వ బడులు, హాస్టళ్లలో పేరుకుపోయిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు, విద్యా రంగ ప్రక్షాళనపై వేగంగా అడుగులు వేసేందుకే ఈ  నిర్ణయం తీసుకున్నట్టు సీఎం తెలిపారు.

సీఎం  స్వయంగా విద్యాశాఖను నడపడం వల్ల నిధుల మంజూరు, ఫైళ్ల క్లియరెన్స్ వేగంగా జరుగుతుందని,  పర్యవేక్షణ సులువవుతోందని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌‌‌‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ స్కూళ్లు, గురుకుల విద్యార్థులకు గవర్నర్‌‌‌‌ శివప్రతాప్‌‌‌‌ శుక్లా, సీఎం  రేవంత్‌‌‌‌ రెడ్డి చేతుల మీదుగా ‘యంగ్‌‌‌‌ ఇండియా ఎడ్యుకేషన్‌‌‌‌ కిట్ల’ను పంపిణీ చేశారు. 

గురుకుల విద్యార్థులకు 22 వస్తువులు, వసతి గృహ విద్యార్థులకు 10 వస్తువులు, పాఠశాల విద్యార్థులకు 7 రకాల వస్తువులతో కూడిన కిట్లు అందించారు. పాఠశాలలు, కళాశాలలను డ్రగ్స్  రహితంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో గవర్నర్‌‌‌‌ శివప్రతాప్‌‌‌‌ శుక్లా 15 వేల మంది విద్యార్థులతో సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. 

గొప్ప నాయకులుగా, సైంటిస్టులుగా ఎదగాలి..

రాష్ట్రంలోని  ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల నుంచి వందలాది మంది అంబేద్కర్‌‌‌‌లు రావాలని , వారు కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా దేశాన్ని ఏలే గొప్ప నాయకులుగా, శాస్త్రవేత్తలుగా ఎదగాలని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి పిలుపునిచ్చారు. పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదని, విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల వసతులు, సౌకర్యాలు కల్పించే బాధ్యతను వారి అన్నగా తానే స్వయంగా తీసుకుంటానని ప్రకటించారు. 

 ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల భవిష్యత్తులో ఉద్యోగ రంగంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి యువతను సిద్ధం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని  అభిప్రాయపడ్డారు. ఏఐ వల్ల అమెరికాలాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం లక్షలాది వైట్ కాలర్ ఉద్యోగాలు ప్రమాదంలో పడుతున్నాయని, అయితే నైపుణ్యం కలిగిన బ్లూ కాలర్ ఉద్యోగాలను ఏఐ రీప్లేస్ చేయలేదని స్పష్టం చేశారు. 

అందుకే మన విద్యార్థులకు కేవలం ఇంగ్లిష్ మాత్రమే సరిపోదని, అంతర్జాతీయ మార్కెట్‌‌‌‌లో రాణించాలంటే జర్మన్, జపనీస్, సౌత్ కొరియన్‌‌‌‌లాంటి విదేశీ భాషలను కూడా నేర్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ భాషల అభ్యసనం ద్వారా విదేశాల్లో ఉన్న కోట్లాది ఉద్యోగావకాశాలను తెలంగాణ యువత సులభంగా దక్కించుకోగలుగుతుందని వివరించారు. సిలికాన్ వ్యాలీలో ప్రస్తుతం మన తెలుగు వారు ఎలాగైతే ఐటీ రంగంలో దూసుకుపోతున్నారో, భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రంగాల్లో తెలంగాణ యువత అగ్రస్థానంలో నిలవాలని అన్నారు.

క్రీడల్లోనూ రాణించాలి.. 

చదువుతోపాటు క్రీడల్లోనూ తెలంగాణ విద్యార్థులను ప్రపంచ స్థాయిలో నిలిపేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసిందని రేవంత్ రెడ్డి ప్రకటించారు. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఒలింపిక్స్‌‌‌‌లో కనీసం ఒక్క బంగారు పతకం సాధించడానికి కూడా ఇబ్బంది పడుతున్న తరుణంలో.. మనకంటే తక్కువ జనాభా ఉన్న దేశాలు పతకాల పట్టికలో దూసుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.  పబ్లిక్- ప్రైవేట్ పార్టనర్‌‌‌‌షిప్ (పీపీపీ) పద్ధతిలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను ఈ బోర్డులో సభ్యులుగా నియమించామని, రాబోయే ఒలింపిక్స్‌‌‌‌లో తెలంగాణ బిడ్డలు దేశానికి బంగారు పతకాలు సాధించడమే లక్ష్యంగా ఈ యూనివర్సిటీ పనిచేస్తుందని చెప్పారు.  

సాంకేతిక నైపుణ్యాల పెంపు.. ఐటీఐల ఆధునీకరణ

మారుతున్న కాలానికి తగ్గట్టుగా సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులను తట్టుకునేందుకు వీలుగా విద్యార్థులను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం తెలిపారు. గతంలో నిరాదరణకు గురైన ప్రభుత్వ ఐటీఐలను సుమారు 2 వేలకోట్లతో అడ్వాన్స్‌‌‌‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీ)గా మార్చినట్టు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఈ ఏటీసీలను ఏర్పాటు చేశామని, ఇక్కడ చదువుకునే విద్యార్థులకు సాంకేతిక శిక్షణ ఇవ్వడమే కాకుండా.. ప్రతి నెలా రూ.2 వేలను స్టైఫండ్ కూడా అందిస్తున్నట్టు తెలిపారు. 

దీనితో పాటు పాలిటెక్నిక్ కాలేజీలను అప్‌‌‌‌గ్రేడ్ చేశామని, ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ని కూడా ఏర్పాటు చేశామన్నారు. ఈ చర్యలతో మన యువత కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా, పరిశ్రమలకు అవసరమైన అంతర్జాతీయస్థాయి నైపుణ్యాలను సొంతం చేసుకుని ఉద్యోగ రంగంలో రాణించేందుకు వీలవుతుందని వివరించారు. 

మత్తకు బానిసలు కావొద్దు..

యువత మత్తుపదార్థాలకు బానిసలు కావొద్దని..  చదువు, క్రీడలు, సృజనాత్మక నైపుణ్యాలవైపు మాత్రమే తమ దృష్టిని కేంద్రీకరించాలని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి పేర్కొన్నారు. విద్యాసంస్థల పరిసరాల్లో డ్రగ్స్ రవాణా లేదా విక్రయాలకు పాల్పడే వారిపై అత్యంత కఠినమైన, చట్టపరమైన చర్యలు ఉంటాయని, ఈ విషయంలో ప్రభుత్వం ఎవరినీ ఉపేక్షించబోదని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు స్వచ్ఛంద సంస్థలు కూడా భాగస్వాములై విద్యార్థులలో సామాజిక బాధ్యతను పెంపొందించాలన్నారు. 

అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్న విపక్షాలు: డిప్యూటీ సీఎం భట్టి

ప్రభుత్వం పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తూ, అధునాతన పాఠశాలల నిర్మాణాన్ని వేగవంతం చేస్తుంటే ప్రతిపక్షాలు రాజకీయ స్వార్థంతో విమర్శలు గుప్పిస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ శైలిలో తీర్చిదిద్దుతూ, పేదలకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని అన్నారు. 

పాఠశాలల నిర్మాణంలో వస్తున్న పురోగతిని చూసి భయాందోళనకు గురవుతున్న కొన్ని శక్తులు కావాలనే ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. అయితే, ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎలాంటి అపోహలను ప్రచారం చేసినా ప్రభుత్వం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పారు. పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి తాము ప్రారంభించిన ఈ యజ్ఞం నిరాటంకంగా కొనసాగుతుందని, ప్రతిపక్షాల అసూయను తిప్పికొడుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా మౌలిక సదుపాయాల కల్పనను మరింత వేగంగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

డ్రగ్స్​రహిత  తెలంగాణకు కృషిచేయాలి: గవర్నర్‌‌‌‌  

డ్రగ్స్‌‌‌‌రహిత తెలంగాణ కోసం అందరూ కృషి చేయాలని గవర్నర్‌‌‌‌ శివప్రతాప్‌‌‌‌ శుక్లా అన్నారు. విద్యార్థుల అవసరాలు తీర్చేలా యంగ్‌‌‌‌ ఇండియా ఎడ్యుకేషన్‌‌‌‌ కిట్స్ ఉన్నాయని ప్రశంసించారు. మంచి పనిని అందరూ స్వాగతించాలన్నారు. ప్రధాని స్ఫూర్తితో డ్రగ్స్‌‌‌‌ కట్టడి కోసం ఒక గవర్నర్‌‌‌‌గా హిమచల్‌‌‌‌ప్రదేశ్‌‌‌‌లో కార్యక్రమాలు చేపట్టానని.. ఇక్కడ సీఎంతో కలిసి డ్రగ్స్‌‌‌‌ రహిత తెలంగాణ కోసం అందరి భాగస్వామ్యంతో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామన్నారు. 

విద్యార్థులకు రూ.1,505 తో కిట్‌‌‌‌, గురుకుల విద్యార్థులకు రూ.3 వేలతో కిట్‌‌‌‌ ఇస్తున్నట్టు చెప్పారని, కిట్‌‌‌‌లో పుస్తకాలు, యూనిఫాంలాంటి సామగ్రి ఉన్నాయన్నారు. ఇది కేవలం సామగ్రి పంపిణీ కార్యక్రమం కాదని, సమాన అవకాశాలు, ఆత్మవిశ్వాసం, మంచి విద్య అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు, నిబద్ధతకు నిదర్శనమని గవర్నర్ ప్రశంసించారు.