అమెరికా-ఇరాన్ సంతకాలు చేసి 24 గంటలు కాలేదు.. లెబనాన్పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. 16 మంది మృతి..

అమెరికా-ఇరాన్ సంతకాలు చేసి 24 గంటలు కాలేదు.. లెబనాన్పై  ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. 16 మంది మృతి..

గల్ఫ్ లో ఇన్నాళ్లు ఇరాన్ ఒక్కటే తలనొప్పి అనుకున్న అమెరికాకు.. ఇజ్రాయెల్ కొరకరాని కొయ్యగా మారినట్లు కనిపిస్తోంది. ఒకవైపు శాంతి ఒప్పందం కోసం నయోనో.. భయానో ఒప్పించే ప్రయత్నం చేసి.. చివరికి ఇరాన్ కండిషన్స్ ను పరిగణిస్తూ.. బుజ్జగిస్తూ సంతకాలు చేశారు అమెరికా ప్రసిడెంట్ ట్రంప్. పీస్ డీల్ పై ఇరు దేశాలు సంతకాలు చేసి 24 గంటలు కానేలేదు.. అక్కడ ఇజ్రాయెల్ అల్లకల్లోలం చేస్తోంది. లెబనాన్ పై భీకరంగా విరుచుకుపడుతోంది. రాత్రంతా దాడిలో పాల్గొన్నామని.. 16 మంది చనిపోయారని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. 

ఒప్పందం విషయంలో ఇప్పటికే ఇజ్రాయెల్ వైఖరికి నిరసనగా ఒకసారి ఇరాన్ వెనక్కు తగ్గింది. ఆ దేశం తీరు మారకుంటా ఒప్పందానికి ఒప్పుకునేదే లేదని తేల్చి చెప్పడంతో.. ఫ్రెండ్షిప్ ను పక్కన పెట్టి ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై కాస్త ఫైర్ అయిన విషయం తెలిసిందే. అయితే మీ ఒప్పందం మీది.. మా దేశ భద్రత మాది అని చెప్తున్న ఇజ్రాయెల్.. అవేవీ పట్టించుకోకుండా యుద్ధానికి దిగుతోంది. 

అయితే హిజ్బొల్లా రాత్రంతా రెచ్చగొడుతూ యుద్ధానికి దిగిందని.. అందుకే తాము బాంబుల వర్షం కురిపించాల్సి వచ్చినట్లు ఇజ్రాయెల్ చెప్పింది. హిజ్బొల్లా తీరు ఇరాన్, అమెరికాల మధ్య ఒప్పందానికి ముప్పు వాటిల్లేలా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆ ప్రాంతంలో తీవ్రమైన పోరాటం జరుగుతోందని  హిజ్బుల్లా ప్రకటించడంతో .. శుక్రవారం రాత్రికి రాత్రే దక్షిణ లెబనాన్ అంతటా తమ బలగాలు లక్ష్యాలపై దాడి చేశాయని ఇజ్రాయెల్ తెలిపింది.

ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో కనీసం 16 మంది మరణించారని లెబనాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. 

లెబనాన్‌లో కొనసాగుతున్న పోరాటం, కొత్తగా కుదిరిన ఒప్పందానికి గండి కొట్టే అవకాశం ఉంది. ఈ ఒప్పందం ప్రకారం, ఇరాన్ మద్దతుతో నడుస్తున్న హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థతో పాటు  లెబనాన్‌తో సహా అన్ని రంగాలలో సైనిక కార్యకలాపాలను ఇజ్రాయెల్ తక్షణమే నిలిపివేయాల్సి ఉంది. 

ఈ ఏడాది చివర్లో నెతన్యాహు ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంది. అయితే హిజ్బుల్లా నుంచి ముప్పు తొలగిపోయే వరకు ఇజ్రాయెల్ దళాలు లెబనాన్‌లోనే ఉంటాయని చెబుతూ, పదవి నుంచి వైదొలగడానికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నిరాకరించడం గమనార్హం.

మరోవైపు సంతకాలైతే చేశారు కానీ.. యుద్ధానికి శాశ్వత ముగింపు పలికే ప్రయత్నాలపై స్విట్జర్లాండ్‌లో ఇరాన్, అమెరికాల మధ్య జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. ఈ తరుణంలో దాడులు జరగటం ఆందోళన కలిగించే అంశం.

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, చర్చలకు నాయకత్వం వహించాల్సి ఉంది. అయితే  స్విట్జర్లాండ్ పర్యటనను గురువారం (జూన్ 18) వాయిదా వేసుకున్నారు. లాజిస్టికల్ సమస్యలను వైట్ హౌస్ కారణంగా చూపినప్పటికీ, లెబనాన్‌లో ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న సైనిక చర్య కారణంగా.. ఇరాన్ తన డెలిగేట్స్ ను  స్విట్జర్లాండ్‌కు పంపడాన్ని ఆలస్యం చేస్తోందని టాక్.

మరోవైపు  ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కలిసి విందు సందర్భంగా  ఇరాన్‌తో ప్రాథమిక ఒప్పందంపై సంతకం ట్రంప్ సంతకం చేశారు. ఒప్పందంపై సంతకం చేసిన అనంతరం వాన్స్ చేసిన వ్యాఖ్యలు ప్రధాన్యతను సంతరించుకున్నాయి.  ప్రస్తుత తరుణంలో ఇజ్రాయెల్ పట్ల సానుభూతితో ఉన్న ఏకైక దేశాధినేత ట్రంప్ మాత్రమే అని పరోక్షంగా ఇజ్రాయెల్‌ ను హెచ్చరించారనే చెప్పాలి. కానీ ఇజ్రాయెల్ మాత్రం తన వైఖరి మార్చుకోవడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి.