టిమ్స్ కోసం.. ఉస్మానియా, గాంధీ ఖాళీ!..180 మంది డాక్టర్లను టిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు డిప్యూటేషన్

టిమ్స్ కోసం.. ఉస్మానియా, గాంధీ ఖాళీ!..180 మంది డాక్టర్లను టిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు డిప్యూటేషన్
  • మొత్తం180 మంది డాక్టర్లను టిమ్స్‌‌‌‌కు డిప్యూటేషన్ చేస్తూ డీఎంఈ ఉత్తర్వులు
  • మొత్తం 180 మంది డాక్టర్లను టిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు డిప్యూటేషన్
  • ఉస్మానియా నుంచి 80, గాంధీ నుంచి 36 మంది 
  • నిమ్స్ సీటీవీఎస్ హెచ్ఓడీ సైతం టిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు..
  • కొత్త పోస్టులతో నింపకుండా ప్రతిష్టాత్మక హాస్పిటల్స్ నుంచి తీసుకోవడంపై విమర్శలు
  • గతంలో 1,142 పోస్టులను 14 మెడికల్ కాలేజీల నుంచి రీ–డిప్లాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్
  • ఉస్మానియా, గాంధీ, నిమ్స్, నీలోఫర్, చెస్ట్ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సేవలపై ప్రభావం

హైదరాబాద్, వెలుగు: సనత్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని టిమ్స్(తెలంగాణ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్​ఆఫ్ మెడికల్ సైనెన్స్) కు డాక్టర్ల  కేటాయింపు అంశం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. త్వరలో ప్రారంభించబోతున్న ఈ హాస్పిటల్ కోసం ఎలాంటి కొత్త రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్​చేయకుండా ఉస్మానియా, గాంధీ, నిమ్స్ వంటి హాస్పిటల్స్ నుంచి 98 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 82 మంది సీనియర్ రెసిడెంట్లతో కలిపి మొత్తం 180 మంది డాక్టర్లను టిమ్స్‌‌‌‌‌‌‌‌కు డిప్యుటేషన్‌‌‌‌‌‌‌‌పై బదిలీ చేస్తూ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ఉత్తర్వులు జారీ చేశారు. వీరందరినీ జూన్ 18నే రిలీవ్ చేసి 19వ తేదీ ఉదయంకల్లా విధుల్లో చేరాలని ఆదేశించారు. 

ముఖ్యంగా నిమ్స్ నుంచి సీటీవీఎస్(కార్డియో థొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జరీ), ఉస్మానియా నుంచి నెఫ్రాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, గాంధీ నుంచి న్యూరో సర్జరీ, యూరాలజీ, ఆర్థోపెడిక్స్ వంటి అత్యంత కీలక డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లకు చెందిన సీనియర్ స్పెషలిస్టులను, మెంటల్ హాస్పిటల్ (ఐఎంహెచ్) నుంచి సైకియాట్రీ నిపుణులను తరలించడం వల్ల ఆయా హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌లో  సూపర్ స్పెషాలిటీ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉందని వైద్యవర్గాలు హెచ్చరిస్తున్నాయి. 

నిపుణులు లేని దవాఖానగా ఉస్మానియా.. 

ఉస్మానియా నుంచి 34 మంది కీలక ఫ్యాకల్టీని, 46 మంది సీనియర్ రెసిడెంట్లను టిమ్స్‌‌‌‌‌‌‌‌కు డిప్యూట్ చేశారు. నెఫ్రాలజీ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ నుంచి హెచ్‌‌‌‌‌‌‌‌ఓడీ డాక్టర్ మనీషా సహాయ్‌‌‌‌‌‌‌‌తో పాటు మరికొందరు డాక్టర్లను టిమ్స్‌‌‌‌‌‌‌‌కు తరలించడం వల్ల.. డయాలసిస్, కిడ్నీ చికిత్సలకు తీవ్ర అంతరాయం కలగనుంది. 

ఇక గ్యాస్ట్రో ఎంటరాలజీ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో సీనియర్లు డాక్టర్ రమేశ్​ కుమార్, డాక్టర్ మధుసూదన్, డాక్టర్ వాసిఫ్ అలీలు వెళ్లడంతో లివర్, జీర్ణకోశ శస్త్రచికిత్సలు నిలిచిపోయే పరిస్థితి ఉంది. న్యూరో సర్జరీ నుంచి డాక్టర్ పి. శ్రీనివాస్ ప్రసాద్, న్యూరాలజీ నుంచి డాక్టర్ శ్రీరంగలక్ష్మి, సీటీవీఎస్ నుంచి కొందరు నిపుణుల బదిలీతో మెదడు, గుండె ఆపరేషన్ల వెయిటింగ్ లిస్టు పెరగడమే కాకుండా ఎమర్జెన్సీసేవలకు బ్రేక్ పడనుంది. ఇవే కాకుండా... ఉస్మానియా మెడికల్ కాలేజీ పరిధిలోని జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, అనస్థీషియా, ఆర్థోపెడిక్, డీవీఎల్,ఈఎన్‌‌‌‌‌‌‌‌టీ, ఆప్తాల్మాలజీ, రేడియాలజీ వంటి డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ల నుంచి నిపుణులను సైతం గుంపగుత్తగా టిమ్స్‌‌‌‌‌‌‌‌కు తరలించడంతో ఉస్మానియా హాస్పిటల్ నిపుణులు లేని ఉత్త దవాఖానాగా మారే ప్రమాదం ఉంది.

గాంధీ నుంచి 36 మంది ఫ్యాకల్టీ.. 

గాంధీ ఆస్పత్రి నుంచి 24 మంది ఫ్యాకల్టీని, 12 మంది సీనియర్ రెసిడెంట్లను టిమ్స్‌‌‌‌‌‌‌‌కు డిప్యూట్ చేశారు. ముఖ్యంగా న్యూరో సర్జరీ విభాగం నుంచి సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ కె. రవి, సీటీవీఎస్ నుంచి ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శివ గౌడ్‌‌‌‌‌‌‌‌లను తరలించడంతో బ్రెయిన్, గుండె ఆపరేషన్ల కోసం వచ్చే పేద రోగులకు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది.  అనస్థీషియా డిపారట్మెంట్ నుంచి ప్రొఫెసర్ డాక్టర్ కిరణ్ మదాల సహా డాక్టర్ అలేఖ్య తదితర నలుగురిని పంపడంతో వివిధ విభాగాల్లో జరగాల్సిన సర్జరీల షెడ్యూల్ పూర్తిగా తలకిందులు కానుంది. 

వీరికి తోడు జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్స్ నుంచి టిమ్స్‌‌‌‌‌‌‌‌కు పంపడం వల్ల గాంధీలో ఓపీ, ఐపీ సేవలతో పాటు అత్యవసర వైద్యానికి విఘాతం కలగనుంది. అటు డయాగ్నోస్టిక్ విభాగాలైన పాథాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ల నుంచి కూడా ప్రొఫెసర్లను కదిలించడంతో ల్యాబ్ టెస్టుల రిపోర్టుల్లో జాప్యం జరగనుంది. 

నిమ్స్‌‌‌‌‌‌‌‌లో గుండె కోత... 

రాష్ట్రంలోనే గుండె ఆపరేషన్లకు కేరాఫ్ అడ్రస్‌‌‌‌‌‌‌‌గా ఉన్న.. నిమ్స్ సీటీవీఎస్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ నుంచి సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ అమరేశ్‌‌‌‌‌‌‌‌ను టిమ్స్‌‌‌‌‌‌‌‌కు డిప్యూటేషన్ చేయడంతో ఇప్పటికే వందలాది మందితో ఉన్న బైపాస్ సర్జరీల వెయిటింగ్ లిస్టు మరింత పెరిగే అవకాశం ఉంది. హాస్పిటల్ మేనెజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో కీలకమైన హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి డాక్టర్ గీత, డాక్టర్ శిరీషలను, ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ నుంచి డాక్టర్ అనుదీప్, డాక్టర్ మౌనిక వంటి నలుగురు సీనియర్ రెసిడెంట్లను కూడా ఒక్కసారిగా తరలించడంతో నిమ్స్‌‌‌‌‌‌‌‌లో అటు ఎమర్జెన్సీ సేవలు, ఇటు వార్డుల పర్యవేక్షణ అస్తవ్యస్తం కానుంది. 

ఒక్క కొత్త కొలువు ఇయ్యలే..

టిమ్స్ హాస్పిటల్‌‌‌‌ను 1000 బెడ్ల సామర్థ్యంతో, అత్యాధునిక వసతులతో అంతర్జాతీయ స్థాయిలో నిర్మించారు. వందల కోట్ల ఖర్చుతో కట్టిన టిమ్స్ లాంటి పెద్ద హాస్పిటల్‌‌‌‌లో శాశ్వత ప్రాతిపదికన ఒక్క రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌ కూడా చేయకపోవడం గమనార్హం. కేవలం డిప్యుటేషన్లు, రీ-పోస్టింగ్‌‌‌‌లు, డిప్లాయ్‌‌‌‌మెంట్లతో కాలం వెళ్లదీయాలని సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తున్నది. 

ఇప్పటికే రాష్ట్రంలోని 14 మెడికల్ కాలేజీల నుంచి 1,142 మంది డాక్టర్లు, నర్సులు, ఇతర పారా మెడికల్ సిబ్బందిని రీ డిప్లాయ్‌‌‌‌మెంట్ చేస్తూ ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. బుధవారం  పీజీ డాక్టర్లను టిమ్స్‌‌‌‌కు రీపోస్టు చేశారు. తాజాగా 180 మంది డాక్టర్లను టిమ్స్‌‌‌‌కు రీ డిప్లాయ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇప్పటికే టిమ్స్‌‌‌‌లో ట్రయల్ రన్ సేవలను ప్రారంభించారు. సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి చేతుల మీదుగా త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉన్నది. 

హాస్పిటల్స్ వారీగా డిప్లాయ్‌‌మెంట్ వివరాలు

హాస్పిటల్ పేరు    ఫ్యాకల్టీ     సీనియర్    మొత్తం
        రెసిడెంట్స్
ఉస్మానియా    34    46    80
గాంధీ హాస్పిటల్    24    12    36
చెస్ట్ హాస్పిటల్    09    10    19
నిలోఫర్ హాస్పిటల్    05    02    07
నిమ్స్ హాస్పిటల్     01    04    05
మెంటల్ హాస్పిటల్    02    02    04
సంగారెడ్డి మెడికల్ కాలేజీ    06    00    06
ఇతర జిల్లా మెడికల్ కాలేజీలు    17    06    23
మొత్తం    98    82    180