- టీజీపీఈజేఏసీ నేతల డిమాండ్
- మహారాష్ట్ర మోడల్లో రైతు డిస్కం ఏర్పాటు చేయాలి
- ఉద్యోగులకు రెగ్యులర్ ప్రమోషన్లు ఇవ్వాలని విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న అన్ని కేడర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీపీఈజేఏసీ) డిమాండ్ చేసింది. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే రైతు డిస్కమ్‌ను మహారాష్ట్ర మోడల్లో ఏర్పాటు చేయాలని, ఉద్యోగులకు రెగ్యులర్ ప్రమోషన్లు ఇవ్వాలని కోరింది. ఈ మేరకు టీజీ ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్‌ను ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కలిసి వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్‌లోని మింట్ కంపౌండ్1104 యూనియన్ కార్యాలయంలో గురువారం తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం నిర్వహించారు. తెలంగాణ పవర్ సెక్టార్‌లోని తాజా పరిణామాలు, ట్రాన్స్‌కో, జెన్కో, ఉత్తర, దక్షిణ డిస్కమ్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఆర్టిజన్ల సమస్యలపై చర్చించారు.
అనంతరం పలు అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ‘1999–2004 మధ్య నియమించబడిన ఉద్యోగులకు జీపీఎఫ్, పెన్షన్ సౌకర్యం అందించాలని, కొత్త సబ్‌స్టేషన్లలో సిబ్బంది నియామకం చేపట్టాలి, సాధారణ ఉద్యోగుల బదిలీ విధానం నిర్వహించాలి, టైమ్ బౌండ్ ప్రమోషన్లు ఇవ్వాలి, రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిలో సామర్థ్య పెంచాలి, ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను మెరుగు పరచాలి’ అని డిమాండ్‌చేశారు. సమావేశంలో జేఏసీ చైర్మన్ జి.సాయిబాబు, కన్వీనర్ పి.రత్నాకర్ రావు, జనరల్ సెక్రటరీ శ్రీధర్, నాయకులు పాల్గొన్నారు.
