- వచ్చింది ఐదుగురు కాదు.. ఆరుగురు
- ఎస్కేప్ చేసేందుకు ధర్మపురిలో ఒకరిని పెట్టుకున్న ముఠా
- పెద్దపల్లిలో మార్చి, ఏప్రిల్‌లో మకాం
- కరీంనగర్ దోపిడీ కేసులో వెలుగులోకి కీలక విషయాలు
కరీంనగర్/పెద్దపల్లి, వెలుగు: కరీంనగర్‌లోని పీఎంజే జ్యువెలరీలో జరిగిన దోపిడీ ఘటనలో ఐదుగురు పాల్గొన్నట్లు సీసీ కెమెరాల్లో నమోదైనా, ఈ ముఠాలో మరో వ్యక్తి కూడా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. ఐదుగురు కరీంనగర్‌కు వచ్చి దోపిడీకి పాల్పడిన అనంతరం ధర్మపురికి చేరుకోగానే, అక్కడ ముందుగానే వేచి ఉన్న మరో ముఠా సభ్యుడు ఫోర్ వీలర్‌లో వీరిని తప్పించుకునేలా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ముఠాలో ఒకరు తప్ప మిగతా వారంతా బిహార్‌కు చెందినవారేనని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఇప్పటికే వారి పేర్లు, వివరాలను పోలీసులు సేకరించి, నిందితులను పట్టుకునేందుకు గాలింపును ముమ్మరం చేశారు.
పెద్దపల్లిలో మకాం..
పీఎంజే జ్యువెలరీ దోపిడీకి పాల్పడిన ముఠా మార్చి, ఏప్రిల్ నెలల్లో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న పరమేశ్వర లాడ్జిలో బస చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఏప్రిల్ చివరి వారంలో నాలుగు రోజుల పాటు నిందితులు అక్కడే ఉన్నట్లు సీసీ కెమెరాల్లో నమోదైంది. కరీంనగర్‌లో దోపిడీకి ప్లాన్ చేసిన ఈ ముఠా తమకు పెద్దపల్లి అనుకూలంగా లేదని భావించి తరువాత ధర్మపురికి మకాం మార్చినట్లు తెలుస్తోంది. సమీపంలో బస్టాండ్, రైల్వే స్టేషన్ ఉండటంతోనే మొదట పెద్దపల్లి పరమేశ్వర లాడ్జిని ఎంచుకున్నారని ప్రచారం జరుగుతోంది. లాడ్జిలో బస చేసినప్పుడు వీరు జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వారిగా ఆధార్ కార్డులు చూపించినట్లు సమాచారం.
అక్కడ ఉన్న నాలుగు రోజుల్లో ఎక్కడా డిజిటల్ చెల్లింపులు చేయకుండా, అన్ని లావాదేవీలను నగదు రూపంలోనే నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో లాడ్జి యాజమాన్యం, సిబ్బందిని కరీంనగర్ పోలీసులు మంగళవారం విచారించారు. అనంతరం సీసీ కెమెరా దృశ్యాలకు సంబంధించిన హార్డ్ డిస్క్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
