ఠాక్రే ఇంట్లో సాయంత్రం 5 గంటలకు ఏం జరగబోతోంది..? 

ఠాక్రే ఇంట్లో సాయంత్రం 5 గంటలకు ఏం జరగబోతోంది..? 
  • శివసేన ఎమ్మెల్యేలందరికీ ఆ పార్టీ చీఫ్ విప్ సునీల్ ప్రభు లేఖలు
  • సాయంత్రం 5 గంటలకు ఠాక్రే ఇంట్లో ముఖ్యమైన సమావేశం
  • సమావేశానికి హాజరుకాని వారిపై వేటు వేసే అవకాశం 

మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్టంభన రెండో రోజుకు చేరుకుంది. రాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వంపై తన అనుచర ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి ఏక్ నాథ్ షిండే తిరుగుబావుటా ఎగురవేయడంతో రాష్ట్ర ప్రభుత్వం సంక్షోభంలో చిక్కుకుంది. మంగళవారం (జూన్ 21) గుజరాత్ లోని సూరత్‌లో ఉన్న లీ మెరిడియన్ హోటల్‌లో బస చేసిన ఏక్‌నాథ్ షిండే, ఇతర తిరుగుబాటు ఎమ్మెల్యేలు తమ మకాన్ని అస్సాం రాష్ట్రానికి మార్చారు.

ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇంట్లో సాయంత్రం 5 గంటలకు శివసేన పార్టీ తమ ఎమ్మెల్యేలందరితో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలందరూ హాజరుకావాలని లేఖలో కోరారు. ఒకవేళ ఎవరైనా గైర్హాజరైతే, ఆ ఎమ్మెల్యే స్వచ్ఛందంగా శివసేన పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు పరిగణిస్తామని లేఖలో పేర్కొన్నారు. సరైన కారణం, ముందస్తు సమాచారం లేకుండా ఎవరైనా సమావేశానికి గైర్హాజరైతే, రాజ్యాంగ నిబంధనల ప్రకారం వారి సభ్యత్వాన్ని రద్దు చేయడానికి చర్యలు తీసుకుంటామనే విషయాన్ని ఎమ్మెల్యేలందరూ గుర్తుంచుకోవాలని శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు లేఖలో హెచ్చరించారు. శివసేన ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరు కావాలని వాట్సాప్, ఈమెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా సందేశాలు పంపారు. ఒకవేళ ఇవాళ సాయంత్రం 5 గంటలలోపు సమావేశానికి హాజరుకాని వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 

మరోవైపు 40 మంది ఎమ్మెల్యేలు తనతో ఉన్నారని, తాను పార్టీ మారబోనని షిండే చెబుతున్నట్లు తెలుస్తోంది.  బీజేపీతో శివసేన పొత్తును పునరుద్ధరించుకోవాలని, రాష్ట్రాన్ని ఉమ్మడిగా పాలించాలని షిండే డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. షిండే తన అనుచర ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరవచ్చనే ఊహాగానాల మధ్య పలువురు బీజేపీ నేతలు కూడా సూరత్‌లో షిండేను కలిశారు. మరోవైపు ప్రభుత్వం ఏర్పాటు విషయంపై ఇప్పటికి బీజేపీ నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని, వారితో ఇంకా చర్చలు జరపలేదని ఏక్‌నాథ్ షిండే స్పష్టం చేశారు.