ఆలుగడ్డ తింటే బరువు పెరుగుతారన్న మాట తరచూ వినపడుతుంటుంది. కానీ, నిజానికి ఆలుగడ్డ బరువు తగ్గేందుకు సాయం చేస్తుంది. కాకపోతే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆలుగడ్డని ఎలా తింటున్నాం అన్నదానిమీదే బరువు పెరగడం , తగ్గడం ఉంటుందని చెప్తున్నారు క్లౌడ్ నైన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ న్యూట్రిషనిస్ట్ గ్రేటా షెరీన్ రాబిన్సన్. బరువు తగ్గించే కొన్ని ఆలుగడ్డ రెసిపీలని కూడా చెప్పారు.
ఆలుగడ్డలో ఉండే రెసిస్టెంట్ స్టార్చ్ ప్రొ–బయోటిక్‌గా పనిచేసి పేగుల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. వీటిలో ఉండే సాల్యుబుల్ ఫైబర్ మలబద్ధకాన్ని, ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ .. లాంటి సమస్యల్ని తగ్గిస్తుంది. అంతేకాదు శరీరంలోని కొవ్వు కణాల్ని కుచించుకుపోయేలా చేస్తుంది ఆలుగడ్డ. ఈ వెజిటబుల్‌లో ఉండే పొటాషియం శరీర బరువుని, బ్లడ్ ప్రెజర్‌ని అదుపులో ఉంచుతుంది. కండరాల్ని బలంగా చేస్తుంది. ఆలుగడ్డలోని యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి సెల్స్ డ్యామేజ్‌ని తగ్గిస్తాయి. వీటిల్లోని జింక్, ఫాస్పరస్, విటమిన్– బి , బి6, ఆల్ఫాలాయిక్ యాసిడ్ బ్రెయిన్ ఫంక్షనింగ్కి సాయపడతాయి. ఆలుగడ్డ ప్రి– మెనుస్ట్రువల్ సిండ్రోమ్ నుంచి బయటపడేస్తుందని చాలా స్టడీల్లో తేలింది. ఇవన్నీ ఇలా ఉంచితే.. బరువు తగ్గడంలోనూ కీ రోల్ పోషిస్తుంది ఆలుగడ్డ. అయితే బరువు తగ్గాలనుకునేవాళ్లు ఆలుగడ్డతో డీప్ ఫ్రై, చిప్స్‌కి బదులు ఇలాంటి హెల్దీ వంటకాలు చేసుకోవాలి.
సలాడ్
కావాల్సినవి: ఆలుగడ్డ ముక్కలు ( ఉడికించినవి)– ఒక కప్పు, ఆలివ్ నూనె– రెండు టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి పొడి– అర టీ స్పూన్, మిరియాల పొడి– అర టీ స్పూన్, నువ్వులు– ఒక టీ స్పూన్, ఉల్లి కాడల తరుగు– కొద్దిగా, కీరదోస ముక్కలు– అర కప్పు, ఉల్లిగడ్డ తరుగు– అర టేబుల్ స్పూన్, పచ్చి మామిడి ముక్కలు– ఒక టేబుల్
స్పూన్
తయారీ: ఆలుగడ్డలు పొట్టు తీసి, ముక్కలుగా తరగాలి. వాటిని ఉప్పు కలిపిన నీళ్లలో ఉడికించి మెదపాలి. అందులో ఆలివ్ ఆయిల్, నిమ్మరసం, వెల్లుల్లి పొడి (వెల్లుల్లిని బాగా వేగించి, పొడి చేయాలి), ఉప్పు, మిరియాల పొడి, నువ్వులు, ఉల్లి కాడలు, కీరదోస, ఉల్లిగడ్డ, మామిడి ముక్కలు వేసి బాగా కలపాలి. చివరిగా ఉప్పు వేసి మరోసారి కలిపితే ఆలుగడ్డ సలాడ్ రెడీ. బరువు తగ్గాలనుకునే వాళ్లకి ఈ రెసిపి బెస్ట్ ఛాయిస్.
పాన్ కేక్
కావాల్సినవి: ఆలుగడ్డ గుజ్జు– రెండు కప్పులు
గోధుమ పిండి– పావు కప్పు, కోడి గుడ్లు– రెండు
వెల్లుల్లి రెబ్బలు– నాలుగు, మిరియాలు, ఉప్పు– సరిపడా, క్యారెట్స్ (సన్నగా తరిగి)– ఒక టేబుల్ స్పూన్, ఉల్లి కాడలు( తరుగు)– ఒక టేబుల్ స్పూన్, నూనె– సరిపడా
తయారీ: ఆలుగడ్డలు ఉడికించి, బాగా మెదిపి గిన్నెలోకి తీయాలి. అందులో గుడ్ల సొన, గోధుమ పిండి, వెల్లుల్లి, క్యారెట్స్, ఉల్లి కాడలు వేసి పేస్ట్‌లా కలపాలి. అందులో సరిపడా ఉప్పు, మిరియాలు కూడా వేసి మరోసారి కలపాలి. పాన్ వేడి చేసి కొద్దిగా నూనె వేయాలి. వేడెక్కాక ఆలుగడ్డ పేస్ట్‌ని పాన్‌లో సమంగా పరవాలి లేదా కొంచెం కొంచెం తీసుకొని చేత్తో గారెల్లా అదిమి పాన్‌లో వేయాలి. రెండు వైపులా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కాల్చితే ఆలుగడ్డ పాన్ కేక్ రెడీ.
సూప్
కావాల్సినవి: ఆలుగడ్డలు(ఉడికించినవి)– నాలుగు, క్యారెట్ ముక్కలు– ఒక కప్పుఉల్లిగడ్డ తరుగు– అర టేబుల్ స్పూన్, మొక్కజొన్న గింజలు(ఉడికించినవి)– రెండు టేబుల్ స్పూన్లు, పచ్చి బఠానీ– రెండు టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి తరుగు– రెండు టీ స్పూన్లు, పాలు– అర కప్పు, ఉప్పు, మిరియాలు– సరిపడా, పెరుగు– పావు కప్పు, వెన్న– రెండు టేబుల్ స్పూన్లు
తయారీ: మందపాటి పాన్‌లో వెన్న కరిగించాలి. ఉల్లిగడ్డ, క్యారెట్, పచ్చి బఠానీ, మొక్కజొన్న .. ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా కలపాలి. కాస్త మెత్తబడ్డాక వెల్లుల్లి, మిరియాలు, ఉప్పు వేసి మరోసారి కలపాలి. తర్వాత పాలు పోసి, కాసేపు ఉడికించాలి. మిశ్రమం దగ్గరపడ్డాక ఆలుగడ్డలు వేసి ఉండలు లేకుండా కలపాలి. పెరుగు కూడా వేసి ఇంకోసారి కలపాలి. కావాలనుకుంటే ఇంకాస్త ఉప్పు, మిరియాలు కలుపుకోవచ్చు. క్యారెట్స్, పచ్చి బఠానీ, కార్న్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఈ హెల్దీ సూప్ రెడీ. ఫాస్ట్ ఫుడ్ తినాలనిపించే కోరికని కంట్రోల్ చేస్తుంది ఈ సూప్. ఇది తాగితే త్వరగా ఆకలి వేయదు.
