అసెంబ్లీలో తీర్మానం.. బ్లాక్ మెయిల్ చేయడమే

అసెంబ్లీలో తీర్మానం.. బ్లాక్ మెయిల్ చేయడమే
  • కేంద్రంపై విమర్శలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పోటీ పడుతున్నరు: కిషన్​రెడ్డి
  • వాళ్లు దీక్ష చేసినంత మాత్రాన.. 
  • తెలంగాణకు మేలు జరగదని కామెంట్​

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర బడ్జెట్​పై అసెంబ్లీలో చర్చ పెట్టి తీర్మానం చేయడం కచ్చితంగా బ్లాక్‌‌‌‌‌‌‌‌ మెయిల్‌‌‌‌‌‌‌‌ చేయడమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్నారు. మోదీ సర్కారు ద్వారా పదేండ్లుగా తెలంగాణ సంక్షేమం, అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేశామని.. కానీ, కేసీఆర్‌‌‌‌‌‌‌‌ తరహాలోనే సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ప్రధాని మోదీని, బీజేపీని విమర్శించేందుకు పోటీ పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని నడపడంలో తమ అసమర్థత నుంచి తప్పించుకునేందుకు కేంద్రంపై బురదల్లే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 

గతంలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్, ఇప్పుడు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అదే తరహాలో డ్రామాలు ఆడుతున్నాయన్నారు. బుధవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో రాష్ట్ర బీజేపీ నేతలతో కలిసి కిషన్​రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాల్సింది తాను కాదని.. హామీలను అమలు చేయనందుకు రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డే సీఎం పదవికి రాజీనామా చేయాలన్నారు. తాను తనను గెలిపించిన సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, దేశానికి, తన పార్టీకి బానిసనని.. మీలాగా గాంధీ కుటుంబానికి బానిసను కాదని ధ్వజమెత్తారు.

 పదవి కంటే అహంకారమే ముఖ్యమని మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ భావించారని, అదే దారిలో ప్రస్తుత సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి కూడా వెళ్తున్నారని కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి విమర్శించారు. ఏపీకి ఆర్థిక సహాయం చేయాలని గతంలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీలు కూడా కోరాయని.. ఇప్పుడు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి మండిపడ్డారు. అమరావతికి నిధులిస్తే.. మీకు వచ్చిన ఇబ్బందేమిటి? అని రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డిని కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి ప్రశ్నించారు. ఏపీని ప్రత్యేక పరిస్థితి కింద పరిగణించి నిధులిచ్చామని ఆయన తెలిపారు.  

రేవంత్ రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నరు..

‘కేసీఆర్‌‌‌‌‌‌‌‌ కలిసి రావాలి.. కలిసి దీక్ష చేద్దాం.. చచ్చుడో.. తెలంగాణకు నిధులు తెచ్చుడో’ అంటూ సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ ప్రజలను తప్పుదారి పట్టించేవిధంగా, రెచ్చగొట్టేవిధంగా వ్యవహరిస్తున్నారని కిషన్​రెడ్డి మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ పదాన్నే బహిష్కరించారని రేవంత్‌‌‌‌‌‌‌‌ అనడం హాస్యాస్పదమన్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, పుదుచ్చేరి పదాలు ఉన్నాయా? అని ఆయన ప్రశ్నించారు. 

తెలంగాణకు ఏం చేయాలో బీజేపీకి బాగా తెలుసని ఆయన అన్నారు. వాళ్లు దీక్ష చేసినంత మాత్రాన.. తెలంగాణకు ఏం మేలు జరగదన్నారు. ‘‘సైనిక్‌‌‌‌‌‌‌‌ స్కూలు తెలంగాణకు రాకపోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వమా? రాష్ట్ర ప్రభుత్వమా? 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తామే బయ్యారం స్టీలుఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీపై ఏనాడైనా కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను అడిగారా?’’ అని రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డిని కిషన్​రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు.  

అనేక హామీలు అమలు చేశాం..

తెలంగాణకు ఇచ్చిన అనేక హామీలను అమలు చేశామని కిషన్​రెడ్డి చెప్పారు. కేంద్రం ఇప్పటిదాకా పదేండ్లలో 10 లక్షల కోట్లు తెలంగాణ అభివృద్ధికి ఇచ్చిందని తెలిపారు. ఆ నిధులను దారిమళ్లించిన విషయం వాస్తవం కాదా? అని ఆయన ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల నిధులను దారిమళ్లించారని.. ఉపాధిహామీకి నిధులిస్తే.. ఎమ్మెల్యేలకు పంపిణీ చేసి దుర్వినియోగం చేశారని ఆరోపించారు. 

రాష్ట్రాలు నిధులను దుర్వినియోగం చేస్తున్నాయనే కేంద్రం నేరుగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందిస్తోందని కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి తెలిపారు. ఎకరానికి 18వేల చొప్పున 60 లక్షల మంది తెలంగాణ రైతులకు ఎరువుల సబ్సిడీ అందిస్తున్నామని.. 20 లక్షల మంది రైతుల నుంచి ధాన్యం సేకరణకు రూ.25 వేల కోట్లు వెచ్చిస్తున్నామని కిషన్​రెడ్డి  తెలిపారు.