చార్మినార్ రిజల్ట్ ఫస్ట్.. డిసెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వెలువడే చాన్స్!

చార్మినార్ రిజల్ట్ ఫస్ట్.. డిసెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం  12 గంటల వెలువడే చాన్స్!
  • చార్మినార్ రిజల్ట్ ఫస్ట్
  • రేపు 12 గంటల వెలువడే చాన్స్!
  • ఒంటి గంట కల్లా స్టేట్ రిజల్ట్స్ పై క్లారిటీ
  • ఉదయం 8 నుంచి 8.30 వరకు పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్
  • ఉదయం 10 నుంచి రౌండ్ల వారీగా ఫలితాలు
  • ప్రతి 20 నిమిషాలకో రౌండ్ కంప్లీట్
  • సెగ్మెంట్ కు 14 చొప్పున 1,766 టేబుళ్ల ఏర్పాటు
  • 40 కంపెనీల కేంద్ర బలగాలతో మూడంచెల భద్రత
  • లెక్కింపు కేంద్రాల వద్ద 144 సెక్షన్.. 
  • 30 పోలీస్ యాక్ట్ అమలు.. ర్యాలీలపై నిషేధం

హైదరాబాద్ : కౌంటింగ్ కు  కౌంట్ డౌన్ స్టార్టయింది. మధ్యాహ్నం 12 గంటల కల్లా చార్మినార్ సెగ్మెంట్ ఫలితం వెలువడనుంది. మిగతా నియోజకవర్గాల ఫలితాలపై మధ్యాహ్నం ఒంటి గంటకల్లా క్లారిటీ రానుంది. రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు 49 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి.  ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటల నుంచి 8.30 వరకు పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్న ఓట్లను కౌంట్ చేస్తారు. 

తెలంగాణలో మొత్తం ఓట్ల సంఖ్య 3,26,02,793 కాగా అందులో 2,32,59,256 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,290 మంది అభ్యర్ధుల భవితవ్యం రేపు తేలనుంది. కౌంటింగ్ కోసం మొత్తం 1,766 టేబుల్స్ ఏర్పాటయ్యాయి. ఒక్కొక్క నియోజకవర్గానికి 14 టేబుల్స్ ఉంటాయి.   పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం ప్రతి 500 ఓట్లకు ఒక టేబుల్ ఏర్పాటు చేశారు. ఈసారి 1.80 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు.  తొలి అరగంట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉంటుంది. 

ఉదయం 9 వరకు పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వెలువడుతాయి. ఈవీఎంల ఓట్ల లెక్కింపు మొదలైన  ప్రతి 20 నిమిషాలకు ఒక రౌండ్ పూర్తయ్యే అవకాశం ఉంది. కూకట్‌పల్లి, ఉప్పల్, మల్కాజ్‌గిరి, పఠాన చెరువు, నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలు 400 పైగా ఉండటంతో ఇక్కడ మాత్రం 20 టేబుల్స్ ఏర్పాటయ్యాయి. ఇక రాజేంద్రనగర్, ఎల్బీనగర్, శేర్‌లింగంపల్లి, మహేశ్వరం, మేడ్చల్ నియోజకవర్గాల్లో 500 పైగా పోలింగ్ కేంద్రాలుండటంతో 28 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి ఈవీఎంను మూడు సార్లు లెక్కిస్తారు.  

కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత   

కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను  ఏర్పాటు చేశారు. 40 కంపెనీల కేంద్ర బలగాలు విధుల్లో ఉంటాయి. ప్రతి లెక్కింపు కేంద్ర సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుంది. కేంద్రాల వద్ద 144వ సెక్షన్ అమల్లో ఉంటుంది. కౌంటింగ్ సందర్భంగా రోడ్లపై ర్యాలీలు, టపాసులు కాల్చడం, ఊరేగింపులు నిషేదం. మద్యం దుకాణాలు మూసివేసుంటాయి.