‘ముందస్తు’ దూకుడుతో రాష్ట్రంలో హీట్

‘ముందస్తు’ దూకుడుతో రాష్ట్రంలో హీట్
  • ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ మీటింగులతో బీఆర్ఎస్ బిజీ బిజీ
  • పోడు పట్టాలు, టీచర్ల బదిలీలు, ఉద్యోగులకు డీఏ, రెగ్యులరైజేషన్ ప్రకటనలు
  • 17న సెక్రటేరియెట్ ఓపెనింగ్
  • ఎన్నడూ లేనిది ఒక నెల ముందే బడ్జెట్ సెషన్స్
  • జిల్లాల్లో కేటీఆర్ వరుస పర్యటనలు
  • ఈ నెలలోనే ఏపీలోనూ బీఆర్ఎస్ మీటింగ్‌‌కు ప్లాన్
  • ఉన్నట్టుండి పెరిగిన పొలిటికల్ యాక్టివిటీస్‌‌

హైదరాబాద్, వెలుగు:అటు ప్రభుత్వ కార్యక్రమాలు, ఇటు పార్టీ మీటింగ్‌‌లతో అధికార బీఆర్ఎస్ ఒక్కసారిగా యాక్టివిటీస్ పెంచింది. ఫిబ్రవరి మొత్తం బిజీగా ఉండేలా షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నది. కొత్త సెక్రటేరియెట్ ఓపెనింగ్, టీచర్ల బదిలీలు, ఉద్యోగులకు డీఏ, కంటి వెలుగులో వేగం పెంచడం, పోడు భూములకు పట్టాలు ఇస్తామని ప్రకటించడంతోపాటు ఒక నెల ముందే అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్‌‌ను మొదలుపెట్టింది.

ఇక పార్టీపరంగా మహారాష్ట్రలోని నాందేడ్‌‌‌‌లో ఆదివారం బీఆర్ఎస్ మీటింగ్ నిర్వహించారు. మంత్రి కేటీఆర్ జిల్లాల్లో పర్యటిస్తూ.. సభల్లో పాల్గొంటున్నారు. ఏపీలోనూ ఈ నెలలోనే బీఆర్ఎస్ సభ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. బీఆర్ఎస్‌‌‌‌లో ఉన్నట్టుండి వచ్చిన మార్పులు రాజకీయ, అధికార వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. పార్లమెంట్ రద్దు చేసుకుని రావాలని, ముందస్తు ఎలక్షన్స్‌‌‌‌కు పోదామని ఇటీవల కేటీఆర్ సవాల్ చేయడం, ప్రతిపక్షాలు సై అంటుండంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది.

కేంద్ర బడ్జెట్ పెట్టిన ఐదు రోజుల్లోనే..

ఎప్పుడూ లేనివిధంగా ఈసారి ప్రభుత్వం ఎర్లీగా రాష్ట్ర బడ్జెట్‌‌‌‌ను పెడుతున్నది. తెలంగాణ వచ్చిన తర్వాత తొలిసారిగా ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. 2015 నుంచి గత ఏడాది వరకు మార్చి నెలలోనే రాష్ట్ర బడ్జెట్ పెడుతూ వచ్చారు. ఒక్క 2019 లోనే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఫిబ్రవరి ఆఖర్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు. తాజాగా కేంద్రం ఫిబ్రవరి ఒకటో తేదీన పెడితే రాష్ట్ర ప్రభుత్వం సోమవారం బడ్జెట్ పెడుతున్నది.

ఈనెలలోనే అమరవీరుల చిహ్నం కూడా..

ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కొత్త సెక్రటేరియెట్‌‌‌‌ను ప్రారంభించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. వాస్తవానికి గత నెల జనవరిలోనే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కొత్త సెక్రటేరియెట్ ప్రారంభం ఉంటుందని ప్రభుత్వ వర్గాల నుంచి లీకులు వచ్చాయి. కానీ తర్వాత అనూహ్యంగా ఫిబ్రవరి 17 అని ప్రకటించారు. దీంతోపాటు తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం కూడా ఇదే నెలలో ప్రారంభించే సూచనలు కనిపిస్తున్నాయి. నిర్మాణ పనుల్లో వేగం పెంచారు. ఇక పోడు భూములపై రెండేళ్లు నాన్చారు. కానీ ఈ వారం నుంచే పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌లో ఆదేశాలిచ్చారు.  

టీచర్ల బదిలీలు.. ఉద్యోగులకు డీఏ

ఎన్నాళ్లుగానో పెండింగ్​లో ఉన్న టీచర్ల బదిలీలకు రాష్ట్ర సర్కార్ అనుమతించింది. ఫిబ్రవరి నెలలోనే ఆ ప్రక్రియను పూర్తి చేస్తున్నది. అందులోనూ స్పౌజ్ బదిలీలకు పచ్చజెండా ఊపింది. త్వరలో జరగనున్న  టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు 317 జీవో విషయంలో టీచర్ల నుంచి వస్తున్న వ్యతిరేకతను తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చర్చ జరుగుతున్నది. దీంతో పాటు జనవరి చివరి వారంలో ఒక డీఏను ప్రకటించింది. ఫిబ్రవరి నెల నుంచే పెంచిన డీఏ చెల్లించనున్నట్లు పేర్కొంది. ఈ డీఏ బకాయిలు 2021 జులై నుంచి.. 2022 డిసెంబర్ వరకు ఇవ్వాల్సి ఉంటుంది. ఉద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు ఇతర పెండింగ్ సమస్యలనూ పరిష్కరిస్తామని హామీలు ఇస్తోంది. మన ఊరు–మన బడి కార్యక్రమాన్ని కూడా సడన్​గా స్టార్ట్ చేశారు. ఈ కార్యక్రమాన్ని నెల మొత్తం నిర్వహించేలా ప్లాన్ చేసుకున్నారు. పోయిన ఏడాది ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడేమో హడావుడిగా రీస్టార్ట్ చేసింది.

అటు కేసీఆర్.. ఇటు కేటీఆర్

దావోస్ పర్యటన ముగించుకుని వచ్చిన మంత్రి కేటీఆర్.. జిల్లా పర్యటనలు చేపట్టారు. ఈ నెలలో మరికొన్ని నియోజకవర్గాల్లో పాల్గొననున్నట్లు బీఆర్ఎస్ లీడర్లు చెప్తున్నారు. సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ మీటింగ్​లు ప్లాన్ చేస్తుండగా.. రాష్ట్రంలోని జిల్లాల్లో కేటీఆర్​ సభలు పెడుతున్నారు. ఈ నెలఖారుకు దాదాపు 15 నుంచి 20 నియోజకవర్గాల్లో కేటీఆర్​ పర్యటన చేయనున్నట్లు తెలిసింది. కేసీఆర్ కూడా నిత్యం ప్రగతి భవన్‌‌‌‌లో వివిధ రాష్ట్రాల నేతలను పిలిపించుకుని మాట్లాడుతున్నారు. రాష్ట్రం బయట తొలిసారిగా నాందేడ్‌‌‌‌లో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించారు. అసెంబ్లీలో వన్ మ్యాన్ షోలా సీఎం కేసీఆర్​ నిర్వర్తించే బాధ్యతలను కేటీఆర్ సమన్వయం చేస్తున్నారు. 

రెగ్యులరైజ్ చేసి.. పట్టాలు ఇచ్చేలా..

జీవో నంబర్ 58, 59, 76 కింద తీసుకున్న అప్లికేషన్ల ప్రాసెస్ పూర్తి చేసి ఈ నెలఖారుకు పట్టాలు ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయమై సీఎస్ శాంతి కుమారి జిల్లాల కలెక్టర్లకు స్పష్టం చేశారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. మరోవైపు కంటి వెలుగును వంద రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇప్పుడు మాత్రం ఈ నెలలోనే పూర్తి చేసేలా యుద్ధ ప్రాతిపదికన టెస్టులు చేపడుతున్నారు.