బిగ్ బాస్ ప్రేమ్ దివ్వెల మాధురి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తన స్నేహానికి గుర్తుగా బిగ్‌బాస్ బ్యూటీ తనూజ పుట్టస్వామికి ఇచ్చిన సర్‌ప్రైజ్ కాస్తా విమర్శలకు దారితీస్తోంది. తిరుమల పవిత్రతను విస్మరించారనే విమర్శలకు దారితీస్తోంది. గతంతో కూడా తిరుమల కొండపై మాధురి నిబంధనలను అత్రికమించారని ఇప్పుడు మరోసారి చేశారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బిగ్‌బాస్ స్నేహం.. బర్త్‌డే గిఫ్ట్!
బిగ్‌బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన దివ్వెల మాధురి, మొదట 'ముద్దమందారం' ముద్దుగుమ్మ తనూజతో గొడవపడినా, ఆ తర్వాత వారిద్దరూ 'మ్యాడీ - బంగారు' అంటూ ప్రాణ స్నేహితులుగా మారిపోయారు. ఈ రోజు (మార్చి 5) తనూజ 30వ పుట్టినరోజు కావడంతో, మాధురి ఆమెకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చింది. తనూజకు ఇష్టమైన చీర, గాజులతో పాటు ఖరీదైన బంగారు చెవికమ్మలను బహుమతిగా ఇచ్చి తన ప్రేమను చాటుకుంది. "నువ్వు స్వర్గం నుంచి దిగి వచ్చిన దేవతవి.. హ్యాపీ బర్త్‌డే మై స్వీట్ హార్ట్" అంటూ సోషల్ మీడియాలో భావోద్వేగమైన పోస్ట్ పెట్టింది.
►ALSO READ | Arjun Tendulkar: సచిన్ ఇంట పెళ్లి సందడి.. వైభవంగా అర్జున్ - సానియా కల్యాణం.. హాజరైన ప్రముఖులు!
తిరుమలలో అపచారం..
అయితే, ఈ వేడుకలు జరిగిన ప్రదేశమే ఇప్పుడు వివాదానికి కారణమైంది. ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్ తిరుమల కొండపై ఉన్న ఒక గెస్ట్ హౌస్‌లో జరిగినట్లు వీడియోల ద్వారా స్పష్టమవుతోంది. తిరుమల పవిత్రతను కాపాడే ఉద్దేశంతో టీటీడీ (TTD) కొండపైకి కేకులు తీసుకెళ్లడం, బర్త్‌డే వేడుకలు నిర్వహించడంపై కఠిన నిషేధం విధించింది. నియమ నిబంధనలు పక్కన పెట్టి దివ్వెల మాధురి తిరుమల కొండపైకి కేక్ తీసుకెళ్లి మరీ తనూజతో కట్ చేయించడం భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి పాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహించడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
విజిలెన్స్ ఆరా.. !
దివ్వెల మాధురికి ఇలాంటి వివాదాలు కొత్తేమీ కాదు. గతంలోనూ దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి తిరుమల మాడ వీధుల్లో రీల్స్ చేసి పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నారు. అప్పట్లో క్షమాపణలు చెప్పిన మాధురి, ఇప్పుడు మళ్ళీ కేక్ కటింగ్ వీడియోను షేర్ చేయడం గమనార్హం. భద్రతా సిబ్బంది కళ్లు గప్పి కేక్ కొండపైకి ఎలా చేరిందనే అంశంపై టీటీడీ విజిలెన్స్ అధికారులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు. స్నేహితురాలిపై ప్రేమ ఉండొచ్చు కానీ, అది దైవ సన్నిధిలో నిబంధనలను అతిక్రమించేలా ఉండకూడదని భక్తులు హితవు పలుకుతున్నారు. ఈ వివాదంపై మాధురి, తనూజ ఎలా స్పందిస్తారో చూడాలి.
