నీ సేవలు ఇక చాలు: టీ20 కెప్టెన్సీ నుంచి రషీద్ ఖాన్‏ ఔట్

నీ సేవలు ఇక చాలు: టీ20 కెప్టెన్సీ నుంచి రషీద్ ఖాన్‏ ఔట్

కాబుల్: స్టార్ స్పిన్నర్, అఫ్గాన్ టీ20 కెప్టెన్ రషీద్ ఖాన్‎కు బిగ్ షాక్ తగిలింది. రషీద్ ఖాన్‎ను టీ20 కెప్టెన్సీ నుంచి తొలగించింది అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు. అతని స్థానంలో ఇబ్రహీం జద్రాన్‌ను నియమించింది. ఇండియా, శ్రీలంక సంయుక్త వేదికలుగా జరుగుతోన్న టీ20 వరల్డ్ కప్‎లో రషీద్ ఖాన్ నేతృత్వంలోని అఫ్గానిస్తాన్ జట్టు గ్రూప్ దశలోనే నిష్ర్రమించింది. 2024 టీ20 వరల్డ్ కప్‎లో జట్టును సెమీస్‎కు తీసుకెళ్లిన రషీద్ ఈ సారి గ్రూప్ స్టేజ్‏ను దాటించలేకపోయాడు. 

మెగా టోర్నీలో టీమ్ గ్రూప్ దశలోనే ఇంటి బాట పట్టడంతో అఫ్గాన్ క్రికెట్ బోర్డు జట్టు ప్రక్షాళను పూనుకుంది. ఇందులో భాగంగానే టీ20 కెప్టెన్సీ నుంచి రషీద్ ను తప్పించి పగ్గాలను జద్రాన్ కు అప్పగించింది. జట్టు దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అఫ్గాన్ చీఫ్ సెలెక్టర్ అహ్మద్ షా సులిమాంఖిల్ స్పష్టం చేశాడు. రషీద్ ఖాన్ డిప్యూటీగా పనిచేసిన ఇబ్రహీం జద్రాన్ ఈ ఫార్మాట్‌లో ఆఫ్ఘనిస్తాన్ రెగ్యులర్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు. 

►ALSO READ | T20 World Cup: టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్న భారత్.. 

రషీద్ ఖాన్ జట్టుకు అందించిన విలువైన సహకారానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. నాయకత్వ మార్పే కాకుండా జట్టులో పలువురు సీనియర్ ప్లేయర్లకు కూడా బోర్డు ఉద్వాసన పలికింది. పేసర్ ఫజల్హాక్ ఫరూఖీ, గుల్బాదిన్ నయీబ్ వంటి కొంతమంది మార్క్యూ క్రికెటర్లను అంతర్జాతీయ వన్డే, టీ20 రెండు ఫార్మాట్ల నుండి తొలగించింది. 

ప్రపంచ కప్ జట్టు నుంచి రిజర్వ్ కీపర్ మొహమ్మద్ ఇషాక్‌ను కూడా జట్టు నుండి తొలగించారు. అతని స్థానంలో నూర్ రెహమాన్ వచ్చారు. ఫరీద్ అహ్మద్ మాలిక్ వన్డే జట్టులోకి తిరిగి వచ్చాడు. ఫాస్ట్ బౌలర్ జియా ఉర్ రెహమాన్ షరీఫీ వన్డే జట్టు నుంచి పిలుపు అందుకున్నాడు.