ఒకప్పుడు మనిషిని చూడగానే, ఎంత వయసు ఉండొచ్చో ఈజీగా చెప్పగలిగేవాళ్లం. 50 ఏళ్లు దాటితే కానీ తల నెరిసేది కాదు. వయసు 60లను క్రాస్ అయ్యాకే చర్మం ముడతలు పడేది. కానీ ఇప్పుడు ముప్పైట్లోనే ఫేస్లో గ్లో ఆటకెక్కిస్తోంది. నలభైలు దాటుతుండగానే చర్మం ముడతలు పడుతోంది. లాక్ డౌన్ టైంలో ఎంతో కొంత ఖాళీ టైం దొరుకుతోంది. దాన్ని సరిగా వాడుకుంటే యంగ్ గా తయారవ్వొచ్చు. అదికూడా ఇంట్లో దొరికే వాటితోనే...
తేనె, చక్కెర
ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ చక్కెర కలపాలి. దాంతో ముఖాన్ని సున్నితంగా స్క్రబ్ చేయాలి. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడుక్కోవాలి. ఇలా చేస్తే డెడ్ స్కిన్ తొలగిపోతుంది.
అల్లం రసం, టీ
నీళ్లలో టీ పౌడర్ మాత్రమే వేసి మరిగించి, అందులో కొద్దిగా అల్లం రసం కలపాలి. టి చల్లారాక, అందులో దూది ముంచి ముఖంపై రాయాలి. నిమిషం కంటే ఎక్కువసేపు ముఖం మీద ఉంచకూడదు. వెంటనే కడిగేయాలి. స్కిన్ యంగ్ గా కనపడేలా చేసేందుకు 'టీ' ఉపయోగపడుతుంది.
అరటిపండు, ఆలివ్ నూనె
పండిన అరటిపండును మెదిపి, ఒక టీస్పూన్ ఆలివ్ నూనె కలపాలి. దీన్ని ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. పావుగంటయ్యాక చల్లని నీళ్లతో కడగాలి. అరటిలో పొటాషియం, జింక్, విటమిన్ 'ఎ, బి, సి, ఇ' లు ఉంటాయి. ఇది చర్మాన్ని యంగ్ గా ఉంచుతుంది. దీనికి తోడు ఆలివ్ ఆయిల్ మాయిశ్చరైజర్లా పనిచేస్తుంది.
రోజ్ వాటర్, ద్రాక్షరసం
ద్రాక్షరసంలో కొన్ని చుక్కల రోజ్ వాటర్ కలపాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖం మీద రాయాలి. ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని తాజాగా ఉంచుతాయి.
నిమ్మరసం, గుడ్డు
గుడ్డు తెల్లసొనలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కలపాలి. ఇందులో దూది ముంచి ముఖం మీద రాయాలి. 20 నిమిషాల తర్వాత, చల్లని నీళ్లతో కడుక్కోవాలి. గుడ్లలో ఉండే ప్రొటీన్లు చర్మాన్ని టైట్ చేస్తాయి. నిమ్మరసం మచ్చలను పోగొడుతుంది.
