అధికార, ప్రతిపక్ష సభ్యుల నినాదాలు... సజావుగా సాగని ఉభయ సభలు

అధికార, ప్రతిపక్ష సభ్యుల నినాదాలు... సజావుగా సాగని ఉభయ సభలు

న్యూఢిల్లీ: పార్లమెంటులో వాయిదాల పర్వం కొనసాగుతున్నది. రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో నాలుగో రోజూ ఉభయ సభలు సజావుగా సాగలేదు. అధికార, ప్రతిపక్ష సభ్యుల నినాదాలు, నిరసనలతో గందరగోళ పరిస్థితులే ఉంటున్నాయి. గురువారం లోక్‌‌సభ మూడే నిమిషాలు నడిచింది. ప్రారంభమైన వెంటనే సభ్యుల ఆందోళనలతో వాయిదా పడుతూనే ఉంది. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి. రాహుల్ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని అధికార పక్షం.. అదానీ అంశంపై జేపీసీ వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.

సభ్యులపై స్పీకర్ అసహనం

ఉదయం సభ ప్రారంభమైన 2 నిమిషాలకే వాయిదా పడింది. అధికార, ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తుండటంతో సభను సజావుగా కొనసాగించేందుకు సహకరించాలని స్పీకర్ ఓంబిర్లా కోరారు. ‘‘నేను సభను నడపాలనుకుంటున్నా. మీకు మాట్లాడేందుకు అవకాశం, సమయం ఇవ్వాలని అనుకుంటున్నా. దయచేసి మీ సీట్ల వద్దకు వెళ్లండి. మీరు వెల్‌‌లోకి వస్తారు.. తర్వాత బయటికి వెళ్తారు. మళ్లీ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని ఆరోపిస్తారు. ఇది సరి కాదు. మీకు బడ్జెట్‌‌పై చర్చ జరగడం ఇష్టం లేదా?” అని అసహనం వ్యక్తం చేశారు. సభ్యులు వినకపోవడంతో మధ్యాహ్నానికి వాయిదా వేశారు. 2 గంటలకు తిరిగి లోక్‌‌సభ ప్రారంభమైంది. చర్చ జరగాలంటే సభ్యులు తమ సీట్లలో కూర్చోవాలని, నినాదాలు చేయడం ఆపాలని స్పీకర్ స్థానంలో ఉన్న కిరీట్ సోలంకి కోరారు. కానీ అధికార, ప్రతిపక్ష సభ్యులు వెనక్కి తగ్గలేదు. దీంతో ఒక్క నిమిషంలోనే సభ వాయిదా పడింది. నల్లటి రిబ్బన్లతో నోరు కట్టేసుకున్న టీఎంసీ మెంబర్లు.. వెల్‌‌లోకి వెళ్లి నిరసన తెలిపారు. బెంగాల్​ స్కూల్ రిక్రూట్‌‌మెంట్ కుంభకోణంపై బీజేపీ సభ్యులు నినాదాలు చేశారు. ఇదే సమయంలో అధికార పక్షంలోని మిగతా సభ్యులు.. రాహుల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు వెల్‌‌లోకి వెళ్లి నిరసనలు తెలిపారు.

రాజ్యసభలోనూ అంతే..

రాజ్యసభలోనూ ఇరుపక్షాల నినాదాలు కొనసాగడంతో ఎలాంటి చర్చ జరగకుండానే సభ వాయిదా పడింది. ఉదయం సభ ప్రారంభం కాకముందే టీఎంసీ సభ్యులు.. నల్ల మాస్క్ పెట్టుకుని వెల్‌‌లోకి వెళ్లారు. తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వెట్లేదని నిరసన తెలిపారు. గందరగోళం కొనసాగడంతో సభను చైర్మన్ జగదీప్ ధన్‌‌కర్ మధ్యాహ్నానికి వాయిదా వేశారు. మధ్యాహ్నం కూడా సభ ప్రారంభానికి ముందే.. పలువురు సభ్యులు వెల్‌‌లో కనిపించారు. దీంతో సీట్లలోకి వెళ్లి కూర్చోవాలని, ప్రొసీడింగ్స్ కొనసాగించేందుకు సహకరించాలని డిప్యూటీ చైర్మన్ హరివన్ష్ కోరారు. సభ్యులు వినకపోవడంతో రోజంతా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 

పార్లమెంటు వద్ద ప్రతిపక్షాల మానవహారం

అదానీ గ్రూప్‌‌లో అవకతవకలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు ఆవరణలో ప్రతిపక్షాలు మానవహారంగా ఏర్పడ్డాయి. నేతలు ప్లకార్డులు పట్టుకుని.. నినాదాలు చేశారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, డీఎంకే నేత టీఆర్ బాలు, ఎస్పీ నేత రాంగోపాల్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా, శివసేన (ఉద్ధవ్ వర్గం) లీడర్లు ప్రియాంకా చతుర్వేది, అర్వింద్ పాల్గొన్నారు.


అధికార పార్టీనే అడ్డుకుంటున్నది: ఖర్గే

అదానీ వ్యవహారం, కేంద్రం వైఫల్యాలపై చర్చ జరగకుండా ఉండటానికి ప్రభుత్వం ప్రతిపక్షాలను ఉసిగొల్పుతున్నదని, పార్లమెంటును నిర్వహించనివ్వట్లేదని కాంగ్రెస్ చీఫ్​ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. బ్రిటన్ పర్యటనలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై సారీ చెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ‘‘ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతున్నారు. మేం నిన్న శాంతియుతంగా ప్రదర్శన చేస్తుంటే.. మమ్మల్ని ఆపింది ఎవరు? మమల్ని అడ్డుకునేందుకు మహిళా కానిస్టేబుళ్లను ముందు ఉంచారు” అని మండిపడ్డారు.