7న విద్యుత్ సౌధ ముట్టడి

7న విద్యుత్ సౌధ ముట్టడి
  • ఈ నెలంతా వరుస ఆందోళనలు
  • 4న మండల కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసనలు
  • 6న అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు

హైదరాబాద్, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా వరుస ఆందోళనలు నిర్వహిస్తున్నట్టు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ నేతలు మీడియా సమావేశాలు నిర్వహిస్తారని, ఈ నెల 4న మండల కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసనలు, 6న అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల దగ్గర నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపారు. 7న సివిల్ సప్లయ్స్‌‌ భవన్, విద్యుత్ సౌధ ముట్టడిస్తామని చెప్పారు. 2001లో బషీర్‌‌‌‌బాగ్‌‌లో జరిగిన దాని కంటే ఎక్కువ విద్యుత్ సౌధ ముందు జరగాలని, ఇందులో అందరూ పాల్గొనాలని, లెఫ్ట్ పార్టీల నేతలు కలిసి రావాలని  పిలుపునిచ్చారు. లాఠీ దెబ్బలకు తుపాకీ తూటాలకు తానే ముందుంటానని, ఎవరూ భయపడొద్దని, ప్రభుత్వం ఎలా అడ్డుకుంటుందో చూస్తానన్నారు. ఈనెలంతా ఆందోళన కార్యక్రమాలు ఉంటాయని, ఒక కార్యక్రమానికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవుతారని తెలిపారు. శనివారం గాంధీభవన్ లో మీడియాతో రేవంత్ మాట్లాడారు.
ఉగాది రోజున ప్రజలు సంతోషంగా లేరు
కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ధరలు పెంచుతుండటం వల్ల ఉగాది రోజున ప్రజలు సంతోషంగా లేరని రేవంత్ అన్నారు. కేసీఆర్, మోడీకి ప్రజలు రెండు సార్లు అవకాశమిస్తే ధరలు భారీగా పెంచారని విమర్శించారు. యూపీఏ 2 హయాంలో క్రూడాయిల్ ధరలు పెరిగినా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచలేదని గుర్తుచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ట్యాక్స్‌‌ల రూపంలో రూ.36 లక్షల కోట్లను ప్రజల మీద మోపాయన్నారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ మీద భారీగా ట్యాక్స్‌‌ వసూలు చేస్తున్నాయని, వ్యాట్‌‌ను ఎన్నో రాష్ర్టాలు తగ్గించినా తెలంగాణ మాత్రం తగ్గించలేదన్నారు. పేద ప్రజలను దోచుకోవటంలో కేసీఆర్, మోడీలు అవిభక్త కవలలని అన్నారు.
రైతుల హక్కులను కేసీఆర్ తాకట్టు పెట్టిండు
గతేడాది 2021 అక్టోబర్ 4న రా రైస్ ఇస్తమని ఎఫ్‌‌సీఐకి సివిల్ సప్లయ్స్‌‌ కమిషనర్ లేఖ రాశారని, అందుకే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇలా మాట్లాడుతున్నారని రేవంత్ చెప్పారు. రైతుల హక్కులను కేంద్రానికి కేసీఆర్ తాకట్టు పెట్టాడని ఫైరయ్యారు. మెడ మీద కత్తి పెడితే సంతకం చేశానని సీఎం చెబుతుండని, మెడ మీద గన్ పెడితే ఫామ్‌‌ హౌస్ రాసిస్తవా అని ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాల్లో వడ్ల కొనుగోలు స్టార్ట్ అయిందని, తెలంగాణలో మొదలు కాలేదన్నారు. రాజ్‌‌భవన్‌‌లో ఉగాది వేడుకలకు సీఎంతోపాటు మంత్రులు హాజరుకాకపోవడం సరికాదన్నారు. గవర్నర్‌‌‌‌ను, రాజ్యాంగ పదవులను గౌరవించాలని సూచించారు.
ప్రభుత్వంపై కేసు పెట్టాలె
డిస్కంలకు బకాయిలు కట్టకుండా ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని, ప్రభుత్వ ఆఫీసులు భారీగా బకాయిలు ఉన్నాయని రేవంత్ గుర్తు చేశారు. విద్యుత్ సంస్థలు దివాళా దశలో ఉన్నాయని చెప్పారు. డిస్కంలకు ప్రభుత్వం రూ.15 వేల కోట్ల బకాయి పడిందని తెలిపారు. బిల్లు కట్టకపోతే జనంపై కేసులు పెడుతున్నారని, ఇప్పుడు ప్రభుత్వంపై కేసులు పెట్టాలన్నారు.